శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం తిరుక్కోవెలూరు పార్ట్ 2

 

 

తిరుక్కోవెలూర్ ఆలయం గురించి కిందటి వారం చెప్పుకున్నాంకదా.  ఇప్పుడు స్ధల పురాణం చూద్దాం.


స్ధల పురాణం: ముదలాళ్వార్లు తిరుక్కోవెలూర్ వచ్చి పాశురాలని ప్రధమంగా ఇక్కడ పాడారు. అంటే పాశురాలు ఇక్కడే ఆవిర్భవించాయి.  దీని  గురించి కూడా ఒక కధ వున్నది.  ఆళ్వారులు పన్నెండుమంది.  వీరంతా విష్ణుమూర్తి  పరివార మూర్తులయిన గరుడుడు, ఆది శేషు, విష్వక్సేనుడు మొదలగువారని చెప్తారు.  వీరిలో ముందుగా అవతరించిన ముదులాళ్వార్లు ముగ్గురు.  వాళ్ళు .. పోయ్ గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు.  వీరు అయోనిజులుగా వేర్వేరు ప్రదేశాలలో .. కాంచీ పురం, కడల్ మల్లై, మయిలాపురంలో అవతరించారు. వీరు అనేక దివ్య దేశాలను దర్శిస్తూ ఒక రోజు రాత్రి తిరుక్కోవెలూర్ వచ్చారు.  భగవంతుడి లీలా విచిత్రం చూడండి.  ఆ రోజు రాత్రి పెద్ద వర్షము వచ్చింది.  ముందుగా ఆ ఊరు చేరిన పోయగై ఆళ్వారు అక్కడ వున్న మృకండ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ రాత్రి అక్కడ వుండటానికి చోటు దొరుకుతుందా అని అడిగారు.  మృకండ మహర్షి ఒక మూల  కొంచెం చోటు చూపించి, అక్కడ ఒకరు పడుకునే స్ధలముందని చెప్పారు.  తర్వాత పూదత్తాళ్వారు అక్కడికి వచ్చి ఆ రాత్రి వుండటానికి చోటుకోసం అడగగా పోయ్ గై ఆళ్వారు ఇద్దరు వుండచ్చు రండని పిలిచారు.  మరి కొంచెంసేపట్లో పేయాళ్వార్ వచ్చి చోటుకోసం అడగగా, లోపల వున్న ఇద్దరు ఆళ్వార్లు ఇక్కడ ముగ్గురు నుంచోవచ్చు రమ్మని పిలిచారు.

 


అలా ఆ ముగ్గురు ఆళ్వార్లు మృకండ మహర్షి చూపించిన కొంచెం స్ధలంలో వారికి పరుండే స్ధలం కాదు కదా కూర్చునే స్ధలంకూడా లేక నిలబడి భగవంతుని గురించి సంభాషించుకోసాగారు.  ఇంతలో ముగ్గురికే ఇరుకుగా వున్న ఆ స్ధలంలో నాల్గవ వ్యక్తిగా భగవంతుడు స్వయంగా చేరాడు.  ముదలాళ్వారు అనుమానం వచ్చి,  నాల్గవ వ్యక్తి ఎవరైనా వచ్చారా అని పరీక్షించి చూడగా భగవంతుడు తన దివ్య దర్శనాన్నిచ్చాడు.  ఆ సాక్షాత్కారానికి పరవశించిన ముగ్గురు ఆళ్వార్లు, ఒక్కొక్కరు నూఱు పాశురాలతో స్వామిని స్తుతించారు.  అంటే అప్పుడే ముదలాళ్వార్లు మొట్టమొదటిసారిగా తమిళ పాశురాలతో భగవంతుని స్తుతించారు. ఇది పాశురాలు ఆవిర్భవించిన కధ.  మరి అసలు స్వామి ఆవిర్భవించిన కధేమిటో తెలుసుకుందామా? పూర్వం బలి అనే రాక్షస చక్రవర్తి వుండేవాడు.  ఆయన గొప్ప దానశీలిగా పేరు తెచ్చుకున్నాడు.  ఆయన ఎంత గొప్పవాడైనా దేవతలను, మునులను చాలా హింసించేవాడు.  వాటిని తట్టుకోలేని దేవతలు, మునులు శ్రీ మహా విష్ణువు దగ్గరకెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.  మహా విష్ణువు వారికి అభయమిచ్చాడు. అదే సమయంలో కశ్యప మహర్షి భార్య అదితితో కలిసి సంతానంకోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. అప్పుడు యజ్ఞ పురుషుడైన శ్రీమన్నారా యణుడు వామన మూర్తిగా అవతరించాడు.

 
వామనావతారంలోని శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తి చేస్తున్న యాగానికి వెళ్ళి మూడడుగులు దానమడుగుతాడు.  విషయం తెలియని బలి చక్రవర్తి సంతోషంగా దానం ఇవ్వటానికి సమాయక్తమవుతాడు.  గురువు శుక్రచార్యులవారు కొంచెం ఆలోచించి, దీనిలో ఏదో మోసమున్నదని చెప్పినా వినక దానమివ్వటానికి సిధ్ధపడతాడు.  చక్రవర్తిని కాపాడటం కోసం శుక్రాచార్యుడు దానమిచ్చేటప్పుడు నీళ్ళు పోయటానికి వీలు లేకుండా కమండలం కొమ్ములో అడ్డుపడతాడు.  అది తెలిసిన వామనుడు దర్భతో కమండలం కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది.

 

బలి చక్రవర్తి విషయం తెలిసినా,  సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుకి దానమివ్వటంకన్నా అదృష్టం ఏమి వుంటుందని సంతోషంగా దానమిస్తాడు.  వామనమూర్తి తన విరాట్ రూపంతో దర్శనమిచ్చి  ఒక అడుగుతో భూమిని, ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని బలి చక్రవర్తినడుగుతాడు.  ఇక్కడ అదే రూపంలో స్వామి వెలిశాడు.  ఒక కాలు ఆకాశాన్ని కొలుస్తున్నట్లు, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతున్నట్లు వుంటాడు స్వామి.  గర్భగుడిలో స్వామి దివ్య దర్శనం ఇంతకు ముందు వర్ణించానుకదా.

 

ఆడి తప్పని బలి చక్రవర్తి తన శిరస్సు చూపిస్తాడు.  భగవంతుడు బలి చక్రవర్తి తలపై తన పాదం పెట్టిన రూపం కంచిలోని వామనాలయంలో చూడవచ్చు.  ఆకాశము, భూమి తనకు దానమివ్వటం వలన బలి చక్రవర్తిని పాతాళానికి పంపిస్తాడు శ్రీ మహా విష్ణువు. 

 

ఇక్కడ భగవంతుడు వామనావతారంలో రెండవసారి దర్శనమివ్వటం గురించి కూడా ఒక కధ వున్నది.   మృకండ మహర్షి భగవత్ సాక్షాత్కార సమయానికి వేరే చోటెక్కడో తపస్సు చేసుకుంటూ వుండటం వల్ల అంత అపురూపమైన భగవద్దర్శనం పొందలేక పోతాడు.  తర్వాత వేరే మునుల వల్ల ఆ కధ విని, ఆ అవతారమును తాను దర్శించలేకపోయానని చాలా దిగులుపడి,  ఆ దర్శనం కోసం అనేక వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు.  అయినా ఆయనకి భగవంతుని సాక్షాత్కారం కాలేదు.  కానీ నారదుడు ప్రత్యక్షమయ్యాడు. 

 

త్రివిక్రమావతార సాక్షాత్కారానికి తగు మార్గం చెప్పమని మృకండ మహర్షి నారదుణ్ణి వేడుకున్నాడు.  నారద మహర్షి, బ్రహ్మ దేవునికి ఆ అవతారంలో స్వామి పాదం కడిగి, పూజించే భాగ్యం దక్కింది, కనుక నువ్వు బ్రహ్మ దేవునికోసం తపస్సుచేస్తే ఆయన మార్గం చూపించగలడని చెప్పాడు.  తర్వాత మృకండ మహర్షి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేయగా, బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు.   మృకండ మహర్షి తనకు మహాద్భుతమైన త్రివిక్రమ రూపాన్ని దర్శింపచేయమని కోరుతాడు.  బ్రహ్మ ఆ స్వామి దర్శనోపాయం చెబుతాడు.  కృష్ణపురిలో  (తిరుక్కోవెలూర్ పూర్వ నామం) కృష్ణుడు కొలువుతీరి వున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ, బీదలకు, అతిధులకు అన్నదానం చేస్తూ వుంటే  ఆ భగవద్దర్శనం లభిస్తుందని చెబుతాడు. బ్రహ్మోపదేశంతో మృకండ మహర్షి తన భార్య మిత్రవతితో ఆ క్షేత్రం చేరుతాడు.  అక్కడ ఆశ్రమం ఏర్పరుచుకుని బ్రహ్మ చెప్పినట్లు జపతపాలు, దాన ధర్మాలు చేయసాగారు. 

 

ఒక రోజు సమయం కాని సమయంలో వృధ్ధ బ్రాహ్మణ దంపతులు వచ్చి, చాలా దూరమునుంచి వస్తున్నాము, చాలా ఆకలిగా వున్నది, వెంటనే ఆహారమిమ్మని అడిగారు.  మృకండుడు ఆలోచించాడు..వారు అకాలములో వచ్చి భోజనం అడుగుతున్నారు, ఇంట్లో సమయానికి ఆహారం లేదు, లేదని చెబితే నా తపస్సంతా వ్యర్ధమవుతుంది అని ఆలోచించిన   మహర్షి  లోపలకెళ్ళి తన భార్యతో వారి గురించి చెప్పి,  వారికి నీ పాతివ్రత్య మహిమవలన ఎలాగైనా భోజనం పెట్టమని కోరుతాడు.  మిత్రవతి మహాలక్ష్మిని ప్రార్ధించి, ఆ దేవి కృపతో అతిధులకు మంచి భోజనం పెడుతుంది.  తృప్తి చెందిన బ్రాహ్మణుడు వెంటనే  త్రివిక్రమ రూపంలో తన దివ్య దర్శనాన్ని వారికి అనుగ్రహిస్తాడు.  ఈ విధంగా మృకండ మహర్షి కోసం స్వామి ఇక్కడ రెండవసారి తన దివ్య దర్శనాన్ని కలుగ చేస్తాడు.

 

 

స్వామి మృకండ మహర్షితో ఎన్నో వేల సంవత్సరాలు ఆయన చేసిన తపస్సుకి సంతసించి ఆయన కోరికయిన దివ్య దర్శనాన్ని ప్రసాదించాననీ, ఇంకేమన్నా కోరుకోమంటాడు.  మృకండుడు దుర్లభమైన ఆ అవతార దర్శనంకన్నా ఏంకావాలనీ, అయినా, ఆ రూపంలో దర్శించే శక్తి తనకు లేనందున శ్రీదేవి, భూదేవిలతోకూడి, చతుర్భుజ రూపంలో దర్శనమివ్వమని కోరుతాడు. స్వామి అలాగే దర్శనమిచ్చి ఇంకేమి కావాలని అడుగగా, స్వామి పాదములు విడువకుండా వుండే వరం అడుగుతాడు.  దానికి స్వామి తాను ఎంతకాలం ఆ క్షేత్రంలో ప్రసన్నుడై అర్చారూపంలో వుంటాడో, అంతకాలం మహర్షి తన పాదపద్మాల నీడలో వుండి, తర్వాత పరమపదము చేరుకుంటాడని వరమిస్తాడు.  అప్పటినుంచి స్వామి పాదాలచెంత మృకండ మహర్షి, భార్యతో సహా వెలిశాడు. 

 

త్రివిక్రమ రూపంలో భగవంతుడు బ్రహ్మ లోకమువరకు పాదము ఎత్తినప్పుడు బ్రహ్మ దేవుడు తన కమండలంలోని జలంతో పాద్యమిచ్చి పూజించాడు.  ఆ పాద తీర్ధము చక్ర తీర్ధము.   అందుకే బ్రహ్మ కడిగిన పాదము…అనే పాట.
 ఇంతటి అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించటం మన అదృష్టంకాదా.

 

శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం తిరుక్కోవెలూరు పార్ట్ 1

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


More Punya Kshetralu