శ్రీ స్వయంభూలింగేశ్వరుడు దుద్దెడ

 


భారత దేశంలో వున్న అనేక ఆలయాలలో భగవంతుని మూర్తులు ప్రతిష్టించబడ్డాయి.  అయితే కొన్ని పుణ్య క్షేత్రలలో భగవంతుడు అర్చా రూపంలో స్వయంగా వెలిస్తే తర్వాత ఆలయాలు నిర్మింపబడి, అభివృధ్ధి చెయ్యబడ్డాయి.  అలాంటి క్షేత్రాలను  స్వయంభూ క్షేత్రాలంటారు.  సదా శివుడు అలా స్వయంభువుగా లింగ రూపంలో వెలిసిన క్షేత్రమే సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, దుద్దెడ గ్రామంలో వున్న శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు.  ఈ ఆలయంలో శివుడు క్రీ.శ. 10 వ శతాబ్దం పూర్వమే స్వయంభువుగా వ్యక్తమయ్యాడంటారు.  ఈ స్వామిని పూజిస్తే ఎంతటి మొండి జబ్బులైనా తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

ఆలయ నిర్మాణం:
క్షేత్ర పురాణం ప్రకారం, ఈ ఆలయ నిర్మాణం  9 – 12 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన  కళ్యాణి చాళుక్యుల కాలంలోదిట.  ఈ ఆలయంలో కనిపిస్తున్న సప్త మాతృకల విగ్రహాలున్న పట్టి దీనికి నిదర్శనం.  తర్వాత కాకతీయుల కాలంలో ఆలయ ప్రాకారం వగైరా నిర్మాణాలు జరిగాయి.   ప్రవేశ ద్వారంపై ఇంకో మండపం నిర్మించటం కాకతీయుల శైలి.  ఇక్కడ ప్రవేశ ద్వారం రెండు మండపాలుగా వుంటుంది.

 

ఆలయం ప్రహరీ గోడ మొత్తం మట్టి వగైరాలు వాడకుండా పెద్ద పెద్ద బండ రాళ్ళతో పేర్చారు. దేవాలయ నిర్మాణమంతా ఆగమశాస్త్రానుసారం జరిగింది.  గర్భాలయం ముందు 16 ఏక శిలా స్తంభాలతో నిర్మించబడ్డ కళ్యాణ మండపం వున్నది. దీనికీ, గర్భాలయానికీ మధ్య నందీశ్వరుడున్న మండపం.  గర్భ గుడిపైన గోపురం 36 అడుగుల ఎత్తున మట్టితో కట్టబడింది.  

శాసనాలు:
ఈ ఆలయ ప్రాంగణంలో ఒక శాసనం వున్నది.  ఈ శాసనం ద్వారా తెలుస్తున్న వివరాలు  …  ఈ శాసనం క్రీ.శ. 1296 లో చేసినది.  కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సామంత రాజు నాచిరెడ్డి  .. ఆయన కుమారుడైన మాధవరెడ్డి చేశాడు.  ఆయన పానుగల్లునుంచి దుద్దెడ వరకు పాలించేవాడు.    అప్పట్లో దుద్దెడ గ్రామంలో పెద్ద సంత జరిగేదట.  దానిలో స్ధానిక సంస్ధలు వసూలు చేసే సుంకాలలో 80 మాడలు స్వయంభూదేవుని నిత్య పూజలు, ఉత్సవాలు మొదలగువాటికి ఇచ్చేవారు.  …   అంటే ఈ దేవాలయం ఆ శాసనానికన్నా ముందునుంచే వున్నదనేకాదు, ఆ కాలంలో ఈ ప్రాంతం వైభవోపేతంగా విలసిల్లిదని కూడా తెలుస్తోందికదా.

 

అమ్మవారు:
అమ్మవారు భవాని.  చతుర్భుజాలతో, ఏక శిలతో చెక్కబడిన సోమసూత్రంపై, దక్షిణాభి ముఖంగా వుండటం ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత.  మన దేశంలో దక్షిణాభిముఖంగావున్న అమ్మవారి ఆలయాలు తక్కువ.  దక్షిణ దిక్కు యమ స్ధానం.  క్షుద్ర శక్తుల నిలయం.  ఆ దిక్కు చూస్తున్న అమ్మ దుష్టు శక్తుల ప్రభావంనుండి తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో మువ్వల శబ్దం విన్నామనే భక్తులున్నారు.

ఉపాలయాలు:
ఒక దానిలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వున్నాడు.  ఈయన ఆలయానికి ముందే సప్త మాతృకల విగ్రహాలు వున్నాయి.

 

విశేషం:
పూజారిగారు చెప్పినదాని ప్రకారం తెల్లవారుఝామున 3, 4 గం. ల ప్రాంతంలో ఒక యోగి ఈ వీరభద్రస్వామి ఆలయంనుంచి సర్ప రూపంలో వచ్చి స్వామిని సేవించి వెళ్తారుట.  యోగులు, ఋషులు రాత్రివేళ ఇక్కడికొచ్చి స్వామిని సేవిస్తారనటానికి నిదర్శనంగా రాత్రి వేళల్లో ఓంకారనాదాలు విన్నామని చెప్పిన భక్తులు వున్నారు.  అలాగే ఒక స్త్రీ రాత్రివేళల్లో ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామనేవారు కొందరు.

అక్షయ జలనిధీశుడు:
ఇక్కడి ఇంకొక విశేష లింగం అక్షయ జలనిధీశుడు.  ఈ లింగం పానువట్టం మీదనుంచి తియ్యటానికి వస్తుంది.  లింగం కింద చిన్న గుంట లాగా వుంది.  అందులో ఎప్పుడూ నీరు వుంటుంది.  ఆ ప్రాంతంలోని కర్షక భక్తులు కొందరికి ఈ నీరు తమ పంటలపై చల్లితే చీడ పట్టకుండా వుంటుందని నమ్మకం.

 

ఆవరణలో వున్న సంతాన నాగేంద్రుని సేవిస్తే సంతానం కలుగుతుందంటారు.  నాగుల పంచమి, నాగుల చవితి రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ స్వామికి విశేష పూజలు జరుపుతారు. దేవాలయంలో కనిపించే ఇంకో విగ్రహం పార్శ్వనాధుడిది.  ఈయన జైనుల ఆరాధ్య దైవం.

కోనేరు:
ఇక్కడవున్న కోనేరుకి మూడు సొరంగ మార్గాలు వున్నాయని..ఒకటి దేవాలయంలోకి వస్తుందని, అందుకే పూర్వం అప్పుడప్పుడు దేవాలయంలోకి నీరు వచ్చేదని పెద్దలు చెప్పేవారని, ఒక మార్గం కాశీ వెళ్తుందని, ఇంకొకటి ఎటు వెళ్తుందోకూడా తెలియదని అన్నారు.

ఉత్సవాలు:
శ్రావణ మాసం, శరన్నవరాత్రులు, మహా శివరాత్రి మొదలగు పరవడి రోజులలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.  పుష్య బహుళ దశమినుంచి ద్వాదశి వరకు జాతర జరుగుతుంది.  ఇందులో పుష్య బహుళ దశమి రోజు శకటోత్సవం జరుగుతుంది.  దీనిలో బళ్ళని రకరకాలుగా అలంకరించి మేళ తాళాలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు.  ఇది ఇక్కడి ఆనవాయితీ.  ఇక్కడ జరిగే రధోత్సవంలో గ్రామంలోని అన్ని కులాలవారూ పాలుపంచుకుంటారు.

సందర్శన వేళలు:
ఉదయం 5 గం. ల నుంచి 11 గం. ల దాకా
సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

ఇతర ఆలయాలు:
ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, రహదారికి ఎడమవైపు శ్రీ పెద్దమ్మ ఆలయాలు వున్నాయి.    

మార్గము:
హైదరాబాదు  - సిద్దిపేట మార్గంలో హైదరాబాదునుంచి 70 కి.మీ. లు వెళ్ళాక  దుద్దెడ గ్రామం బోర్డు కనబడ్డాక కుడి పక్కకి తిరగాలి.  సిద్దిపేట నుంచి 12 కి.మీ. ల దూరంలో వుంది.

సంప్రదించండి
శ్రీ శివ శంకర్    సెల్ నెం.  9705829535

పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu