సత్యనారాయణస్వామి కళ్యాణం… స్వామిని సేవించుకునే సందర్భం


 

తెలుగువారికి దగ్గరైన దేవదేవుడు సత్యనారాయణ స్వామి. మన అన్నవరంలో కొలువైన ఈ స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తీరుతుందనీ, సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అందుకే ఏ కాస్త వెసులుబాటు ఉన్నా, తెలుగువారు సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటారు. అలాంటి సత్యదేవుని కళ్యాణ సమయమిది. వైశాఖశుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు ఆరురోజుల పాటు అన్నవరంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ నెల 22న వైశాఖశుద్ధ దశమి వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారిని తల్చుకుని తరిద్దాం…
 

అన్నవరం అన్న పేరే చాలా విశిష్టమైనది. ఒకప్పుడు ఇక్కడ నిత్యాన్నదానం జరిగేది కాబట్టి ఈ పేరు వచ్చిందని అంటారు. మరో భావన ప్రకారం ఇక్కడి స్వామిని పూజిస్తే అన్నవస్త్రాలకు ఎప్పటికీ లోటు రాదు కాబట్టి ఈ పేరు వచ్చి ఉండవచ్చు.
 

పూర్వం మేరు పర్వతానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం మేరకు భద్రుడు, రత్నకుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. భద్రుడు, విష్ణుమూర్తిని మెప్పించి పర్వతరూపంలో ఉన్న తనపై కొలువై ఉండే అనుగ్రహాన్ని పొందాడు. శ్రీరాముని పుణ్యక్షేత్రమైన భద్రాచలంగా మారాడు. రత్నుడు కూడా మహావిష్ణువుకు నెలవైన క్షేత్రంగా ఉండాలనే కోరిక కోరాడు. అలా సత్యదేవుని ఆవాసమైన రత్నగిరిగా చరిత్రలో మిగిలాడు.
 

1891లో శ్రీమహావిష్ణువు, ఈ ప్రాంతాన్ని పాలించే ఓ జమీందారుకు కలలో కనిపించి, రత్నగిరి మీద తను వెలుస్తున్నట్టు చెప్పారు. అందుకు అనుగుణంగానే, కొండ మీద స్వామి వారి పాదాలు కనిపించాయి. అప్పటి నుంచి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం, దానికి భక్తులు తండోపతండాలుగా రావడం మొదలైంది. త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే అన్న సత్యాన్ని చాటుతూ, ఇక్కడి ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలు కనిపించడం విశేషం.
 

రత్నగిరి పర్వత పాదాలను తాకుతూ ప్రవహించే పంపానదిలో స్నానం చేసి… ఇక్కడి స్వామిని దర్శించుకునే భక్తులకు త్రిమూర్తులను సేవించిన ఫలితం దక్కుతుంది. ఈ ఆలయంలో విశిష్టమైన ‘మహానారాయణ యంత్రం’ ఉండటం మరో ప్రత్యేకత. ఇక్కడ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణస్వామి పేర వ్రతం చేసుకుంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్య, వివాహం, సంతానం, విజయం, కీర్తి… సమస్త కోరికలూ నెరవేరతాయని భక్తుల నమ్మకం. అందుకే అన్నవరం వరకు వెళ్లలేకపోయినా, ఇంట్లోనే ఉన్నంతలోనే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు.

సత్యనారాయణ స్వామికి కళ్యాణం జరిగే ఈ ఆరు రోజులలో స్వామివారి వ్రతం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలా కుదరని పక్షంలో, ఆయన ప్రతిరూపాన్ని పూజించి… మనసులో కోరికలను నివేదించినా త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది.

- మణి

 


 


More Subrahmanya Swamy