పరశురాముడు ప్రతిష్టించిన చిట్టచివరి
శివలింగం!!
నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడనీ, ఆయన ప్రతిష్టించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం.
నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలో మీటర్ల దూరంలో, అద్దంకి నార్కట్ పల్లి ప్రధాన రహదారికి ఒక కిలో మీటరు దూరంలో ఉంది.
స్థలపురాణం: పూర్వం హైహయ వంశ మూలపురుషుడు, కార్త వీర్జార్జున చక్రవర్తి సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి బయలుదేరాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి, సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజ పరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడుగుతాడు.
అందుకు మహర్షి తిరస్కరించడంతో కుపితుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి ధేనువును తీసుకుని వెళతాడు. ఆ సమయంలో పరశురాముడు బయటకు వెళ్లి, తిరిగి పరశువుతో (దొడ్డలి) కార్త వీర్యార్జుని సంహరించి, ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు.
క్షత్రియ వధానంతరం, తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని, ఆ క్షేత్రానికి ధారపోసి, మానవ కళ్యాణానికి పాటుబడ్డాడు. అలా ప్రతిష్టించిన శివలింగాలలో చిట్టచివరిదైన 108వ శివలింగం ఈ చెర్వుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు.
ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ.. ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంత కాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవ త్రేక్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడు.
అనంతరం పరశురాముడు కూడ ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము జడల రామలింగేశ్వరాలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడలరామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపై గుహలోగల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్ధానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఇది హైదరాబాద్- నల్లగొండ రహదారిపై నార్కెట్ పల్లి నుండి 6 కి.మీ దూరంలో ఉన్నది. ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ నుండి కొండపైకి వెళ్ళడానికి మార్గం కలదు నల్లగొండ మరియు నార్కెట్ పల్లి నుండి ఎల్లారెడ్డిగూడెం మెయిన్ రోడ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి