చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం
దక్షిణ భారతదేశం లో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయం ఒకటి. గుంటూరుజిల్లా నకరికల్లు మండలంలో నరసరావుపేటకు సుమారు ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగ్రామమిది. ఇది తొలుత బౌద్ధమతానికి అనంతరకాలంలో శైవ మతానికి ఆలంబనమైన ప్రాచీన ఆలయంగా పరిశోధకులు భావిస్తున్నారు. గజపృష్టవిమానం ఈ ఆలయ ప్రాచీనతకు తొలి సాక్ష్యంకాగా ఆలయ ప్రాంగణం లోని 9 శాసనాలు ఆలయప్రాచీనతకు, ప్రాశస్త్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. బుద్ధుని జాతక కథలలోని శిబి జాతకకథ కు ఈ ఆలయానికి సంబంథం ఉందని చరిత్ర పరిశోథకుల అభిప్రాయం.తనను ఆశ్రయించిన కపోతాన్ని రక్షించడానికి తన శరీరమందలి మాంసాన్ని కోసి యిచ్చిన శిబి చక్రవర్తి త్యాగగుణాన్ని ప్రస్తావించేదే శిబి జాతకకథ.అట్టి శిబి చక్రవర్తి నూరు యజ్ఞాలు చేసి, త్రిమూర్తులను మెప్పించి, తనతో పాటు తన అనుయాయులకు లింగరూపాల్ని ప్రాప్తింపచేసి, కైలాసప్రాప్తిని పొందిన పుణ్య ప్రదేశంగా ఈ చేరుజర్ల కీర్తించబడుతోంది. ఇచ్చట లింగమూర్తి శిలా లింగము కాదని, శల్య లింగమని స్థలపురాణము
స్థలపురాణం :-- షోడశచక్రవర్తులలో పేరెన్నికగన్న యాయాతి మహారాజు కుమారుడు మాంథాత. మాంథాత చక్రవర్తికి ముగ్గురు కుమారులు. వారిలో శిబి పెద్దవాడు. మేఘదంబరుడు, జీమూతవాహనుడు అతని అనుజులు. వీరి చరిత్రతోనే చేజర్ల కపోతేశ్వర ఆలయ చరిత్ర ముడివడి ఉండటం ఆ మహానుభావులను స్మరించుకునే మహద్భాగ్యం మనకు కలిగింది. ఆలయ గజపృష్ఠ విమానం. మాంథాత తరువాత జ్యేష్ఠపుత్రుడైన శిబి రాజ్యాథికారానికి వచ్చాడు. ప్రజా రంజకుడైన శిబి చక్రవర్తి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో తులతూగుతున్నారు. అన్న అడుగుజాడల్లో నడుస్తూ తమ్ముళ్లు ఇద్దరు ప్రజల గౌరవాదరాలను పొందుతున్నారు. అటు వంటి సమయంలో మేఘదంబరునకు పుణ్యక్షేత్రసందర్శన చేయాలనే కుతూహలం కలగడంతో తన కోరికను అన్నగారికి విన్నవించుకొని, అనుమతి నివ్వవలసిందిగా కోరాడు. తమ్ముని కోరిక సముచితమని భావించి, దేశాటనకి అవసరమైన ధనాన్ని, పదిహేనువందల మంది పరివారాన్ని ఇచ్చి వెళ్ళిరమ్మని ఆశీర్వదించాడు శిబి చక్రవర్తి. ఉత్తర దేశ యాత్రలు ముగించుకొని, దక్షిణ భారతంలో సంచరిస్తూ శ్రీశైలాది దివ్యక్షేత్రాలను సందర్శించి, చేరుంజర్ల ప్రాంతానికి చేరుకున్నాడు.
ఈ ప్రాంత ప్రకృతి రామణీయతకు, ప్రశాంతత కు ఆకృష్ట మానసుడైన మేఘదంబరుడు కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకొని , తన పరివారాన్ని అందుకు ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. కొద్దిరోజులు పరిసరాల్లోని కొండలు, కోనల్లో సంచరిస్తూ, అక్కడ దేవరకొండ కోనలోని గుహల్లో తపస్సుచేసుకుంటున్న తాపసులను చూసి సంభాషించి మానసిక ప్రశాంతతను పొందాడు. అనంతరం తన పర్ణశాలకు వచ్చిన మేఘదంబ డు తాను కూడ తపస్సుచేయాలనే సంకల్పానికి వచ్చాడు. మరుసటిరోజే ఒక ప్రశాంతమైన గుహలోకి ప్రవేశించి తపస్సు ప్రారంభించాడు. కొద్దికాలంలోనే ఆప్రాంతంలోని మునులతో చెలిమి ఏర్పడింది. అనతి కాలంలోనే తపస్సిద్ధి పొందిన మేఘదంబరుడు శివైక్యాన్ని పొందాడు. ఆయన అనుచరులు, అక్కడున్న వారి సహాయంతో మరణించిన అతని భౌతికకాయానికి దహన సంస్కారాలు జరిపించారు. ఆశ్చర్యంగా ఆ చితాగ్ని మధ్యనుండి ఒక అద్భుతమైన శివలింగం ఆవిర్భవించింది. ఆనందాశ్ఛర్యాలకు లోనైన పరిసర ప్రజలు, మునులు ఆ లింగాన్ని మేఘదంబేశ్వరలింగమని స్తుతించి, ఆతను తపస్సు చేసిన గుహలోనే ప్రతిష్టించి, పూజలు చేయసాగారు.
అదే ఈనాడు మేఘాలమల్లేశునిగా కొలువబడుతున్న లింగం. ఇది కుమారస్వామి (పుష్పగిరి) కొండకు పడమరగా 3 కి.మీ దూరంలో ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోతే పరిసర గ్రామస్ధుల మేఘాలమల్లేశుని కొండకు వెళ్ళి నవధాన్యాలతో పాయసము, పులగము తయారుచేసి, కొండచట్టులపై పోసి జుర్రుతారు. వారు ఇంటికి చేరులోపల భారీవర్షము కురియటం నేటికి సత్యంగా ఈ ప్రాంతీయులు చెపుతారు. ఇక్కడే జీమూతవాహనుని గుహ కూడ ఉన్నది. జీమూతవాహనుడు శిబిచక్రవర్తి చిన్న తమ్ముడు. మేఘదంబరుడు లింగాకృతిని పొందగానే ఆయన వెంట వచ్చిన పరివారమంతా ఖిన్నులై, వేగంగా రాజథానికి చేరుకొని జరిగిన వృత్తాంతాన్ని అంతటిని మహారాజైన శిబిచక్రవర్తికి విన్నవించారు. తమ్ముని మరణానికి మిక్కిలి శోకించిన శిబిచక్రవర్తి కొంతసమయానికి తేరుకొని, సోదరుడు లింగరూపాన్ని పొందడాన్ని విని ఆశ్చర్యపోయాడు. చిన్నతమ్ముడైన జీమూతవాహనుని పిలిచి చేరుంజర్ల వెళ్లి జరిగిన వృత్తాంతాన్నిసమగ్రంగా తెలుసుకొని రమ్మని పంపించాడు.
జీమూతవాహనుడు పరివారంతో బయలుదేరి వేగంగా చేరుంజర్ల చేరుకున్నాడు. అక్కడి మునివరులు చూపించగా అన్నయైన మేఘదంబరుడు తపస్సు చేసుకున్న గుహను, పూజలందుకుంటున్న మేఘదంబర లింగాన్ని చూశాడు. అన్న అదృష్ఠానికి ఎంతో మురిసిపోయాడు. స్థలప్రభావమో, లేక పూర్వ జన్మపుణ్యఫలమో కాని జీమూతవాహనునికి కూడా ఆ ప్రదేశంలోనే తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది. తపస్సు ప్రారంభించిన అనతి కాలంలోనే జీమూతవాహనుడు సిద్ధి పొందాడు. తోటి తాపసులు పరివారము అంత్యక్రియలు నిర్వహించారు. చితాగ్నిలో నుండి అద్భుతలింగం ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోయిన అక్కడి వారు జీమూతవాహనుడు తపస్సుచేసిన గుహలోనే ఆ లింగాన్ని ప్రతిష్ఠచేసి, పూజించసాగారు.
శిబిచక్రవర్తి చేరుంజర్ల పరిసర ప్రశాంత ప్రకృతికి ఆకర్షించబడి, అక్కడే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ పరిసరాల్లో ఏవో దివ్యశక్తులున్నాయని, తన తమ్ముళ్ళు ఇద్దరూ లింగరూపులుగా మారిన ఈ క్షేత్రంలోనే తాను నూరుయజ్ఞాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తొంభైతొమ్మిది యజ్ఞాలను నిర్విఘ్నంగా పూర్తిచేసి నూరవ యజ్ఞాన్ని ప్రారంభించిన శిబిచక్రవర్తిని చూసి భయపడిన దేవేంద్రుడు దిక్పాలకులతో కలసి త్రిమూర్తులను శరణువేడాడు. త్రిమూర్తులు శిబి చక్రవర్తి తపశ్శక్తిని పరీక్షించదలచారు. త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశమే” విప్పర్ల “ గ్రామంగా పిలవబడుతోంది. బ్రహ్మ బాణంగా, మహావిష్ణువు పావురంగా, మహేశ్వరుడు కిరాతకుడిగా రూపుదాల్చారు. త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం” రూపెనగుంట”గాను, త్రిమూర్తులు శిబిచక్రవర్తిని క్రీగంట చూసిన ప్రదేశాన్ని “కండ్లకుంట” గ్రామంగాను పిలువబడుతున్నాయని పరిసరప్రాంతవాసుల కథనం. వేటనుండి తప్పించుకొని పారిపోతున్న పావురాయిని బాణంతో కొట్టాడు మాయా కిరాతుడు. కాలువిరిగిన కపోతం ప్రాణభీతితో పరుగెత్తి శిబిచక్రవర్తి వద్దకు వచ్చింది.
శిబి మాయాకిరాతకులకు వాదోపవాదాలు జరిగాయి. శరణాగత రక్షణ రాజధర్మం కాబట్టి ఈ కపోతాన్ని రక్షిస్తాను. నీ ఆకలి తీరడానికి ఈ పావురమెత్తు మాంసాన్ని నాశరీరం నుండి కోసి నీకు యిస్తానని శిబి చక్రవర్తి చేసిన ప్రతిపాదనను మాయాకిరాతుడు అంగీకరించాడు. రాజసేవకుడు త్రాసుని సిద్ధం చేయగా, ఒకవైపు పావురాన్ని ఉంచి, రెండవవైపు తన శరీరమాంసాన్ని చురకత్తితో కోసి ఉంచసాగాడు. రెండు తొడల కండల కన్నా పావురమే బరువుగా ఉంది. రాజాజ్ఞ మీరని ఒకసేవకుడు శిబి ఆజ్ఞతో కాళ్ళు చేతులు నరికి త్రాసులో ఉంచాడు. అక్కడ చేరిన అశేష జనవాహిని ఆ దృశ్యాన్ని చూసి హహాకారాలు చేసింది. అప్పటికీ పావురమే బరువుగా ఉండటంతో మహారాజు నిర్వికారమైన చిరునవ్వుతో తన శిరస్సును ఖండించి త్రాసులో ఉంచవలసిందిగా తన సేవకుని ఆజ్ఞాపించాడు. రాజసేవకుడు ప్రభువు శిరస్సును ఖండించి త్రాసులో ఉంచాడు. అప్పుడు కపోతంతో సమానంగా త్రాసు తూగింది. దానితో భక్తుని యెడల భగవంతుని శోధన ముగిసింది. శంఖచక్రథారియై శ్రీమహావిష్ణువు, త్రిశూలధారియై ముసిముసినవ్వులతో శంకరుడు, బాణరూపాన్నివీడి చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యారు. దేవతలు పుష్పవృష్ఠి కురిపించారు. తనకు, తన సమస్త పరివారానికి, ఋత్వికులకు కైలాసప్రాప్తిని కోరాడు శిబిచక్రవర్తి. “తథాస్తు” అని ఆశీర్వదించారు త్రిమూర్తులు.
కరచరాణాద్యవయవములు లేని శిబి మొండానికి దేవతలందరు ఆకాశగంగా జలంతో అభిషేకం చేశారు. ఆ అభిషేకజలమే “ఓంకారనది”గా, “ఓగేరు”గా చేరుంజర్లలో ప్రవహిస్తోంది. ఆంథ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో కూడ ఈ కథ కన్పిస్తోంది. ఇక్కడ పైకథలోని త్రిమూర్తులకు బదులుగా ఇంద్రాగ్నులు శ్యేన(డేగ) కపోతాలుగా వచ్చి శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించాయి. ఈ కథలో తన శరీర భాగాలు తూకానికి చాలక పోవడంతో శిబి చక్రవర్తి తనకు తానుగా త్రాసులో కూర్చొని తన దాన శీలతను చాటాడు. శిబి చక్రవర్తి గాథ బుద్ధుని చరిత్రకు సంబంథించిన అవధాన శతకం లో “శిబిజాతకము” అనే శీర్షికతో కన్పిస్తోంది.
కపోతేశ్వర స్వామి. :-- కపోతేశ్వర లింగం స్వయంభువుగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది. అభిషేకజలం వెలుపలికి వెళ్ళే మార్గం లేదు. ఈ లింగము గుండ్రంగా కాకుండా కరచరణములు.శిరస్సు లేని మనిషి మొండెము వలే పలకగా ఉంటుంది. ఈ లింగాకృతి చుట్టు మాంసము తీసి యిచ్చినట్లు గుంటలు ఉంటాయి. శిబిచక్రవర్తి తన భుజాలను నరికి యిచ్చినట్లుగా లింగాకృతికి కుడి ఎడమల రెండు బిలాలుంటాయి. యిందులో కుడిబిలములో ఒక బిందె నీరు మాత్రమే పడతుంది. ఎడమబిలంలో ఎన్ని నీళ్ళు పోసినా నిండదు. ఆ ఎడమబిలాన్నినీటితో నింపే ప్రయత్నం ఒకసారి చేస్తే కొంతసేపటికి ఆ బిలంనుండి పొగ, మంటలు వచ్చాయని, అప్పుడు అపరాథ శాంతి చేశారని చెపుతారు. అంతేకాకుండా కుడిబిలంలో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చిమాంసపు వాసన వస్తుందని చెపుతారు. ఈ నీటిని ప్రతిరోజు కుంచెకోలతో తీస్తారట. అందుకే దీన్ని శల్యలింగంగా చెపుతారు. లింగానికి సహజ యజ్ఞోపవీతం కనిపిస్తుంది. శ్రీ స్వామివారికి ఎడమవైపు మండపంలో శ్రీ పార్వతీదేవి కొలువు తీరి ఉంది.
ఉత్సవాలు:- ఇక్కడ మహాశివరాత్రి గొప్ప ఉత్సవంగా చేస్తారు. తొలిఏకాదశి, దసరా, కార్తీకపూర్ణిమ, ముక్కోటి, సంక్రాంతి, సంవత్సరాదులకు శ్రీ స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
ప్రయాణం.:- గుంటూరుజిల్లా నరసరావుపేట నుండి కుంకలగుంట మీదుగా చేజర్లకు ఆర్టీసి సర్వీసులు ఉన్నాయి.