శ్రీ నారసింహ క్షేత్రాలు – 17
సింగరకొండ
ప్రకాశం జిల్లాలోనే వున్న సింగరకొండ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా క్రీ.శ. 1443-44 సంవత్సరాలలో విజయనగర రాజు దేవరాయలుచే నిర్మించబడినదని శిలా శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ ప్రచారంలో వున్న ఇంకొక కధనం ప్రకారం 14వ శతాబ్దంలో సింగన్న అనే నరసింహస్వామి భక్తుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. ఆయన కూతురు నరసమ్మ తమ పశువులను మేపటానికి ఈ కొండమీదకి వచ్చేది. వారి మందలోని ఒక ఆవు కొన్ని రోజులుగా పాలివ్వకపోవటం గమనించిన సింగన్న ఒక రోజు ఆ ఆవుని రహస్యంగా వెంబడించి వెళ్ళాడు. ఆ ఆవు ఈ కొండమీద ఒక పెద్ద రాతిదగ్గరకొచ్చి నుంచోగా, ఆ రాతినుంచి ఒక బాలుడు వచ్చి ఆవు పాలు తాగి అదృశ్యమయ్యాడుట. సింగన్న ఆవు పాలు తాగి అదృశ్యమైన బాలుడు తన ఇష్టదైవమైన నరసింహస్వామిగా భావించి ఆ స్వామికి అక్కడ ఆలయాన్ని నిర్మించాడుట. తర్వాత ఆయన పేరుమీద ఆ కొండ సింగరకొండ అయింది.
ఆలయంలో స్వామి ఎడమతొడపై లక్ష్మీ దేవితో దర్శనమిస్తాడు. గర్భగుడి చుట్టూ ఆళ్వార్ల విగ్రహాలు చిన్న గూళ్ళల్లో వున్నాయి.
210 సంవత్సరాల క్రితం ఆ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. వేలాది భక్తులు ఆ ఉత్సవానికి వచ్చారు. వారందరు చూస్తుండగా, అత్యంత తేజోరూపుడైన యోగి ఒకరు కొండ దిగువన వున్న భవనాశని పుష్కరిణి దగ్గర ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి అదృశ్యమయ్యారుట. ఆ రోజునుంచీ, భక్తులు కొండ దిగువన ప్రసన్నాంజనేయస్వామిని పూజిస్తున్నారు. ఈ ఆలయం విశాలంగా వుండి, స్వామి నిలువెత్తు విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంపొందింప చేస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామి దక్షిణాభిముఖంగా వుంటారు. ఆంజనేయస్వామి ఆలయానికి ఈశాన్యాన భవనాశని పుష్కరిణి, నైఋతి దిశలో నరసింహస్వామి నెలకొన్న సింగరకొండ వుండటంవల్ల ఈ క్షేత్రం వాస్తు ప్రకారం ఉత్తమంగా వున్నదని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ స్వామి మీద అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ క్షేత్రానికి వచ్చేవారి సంఖ్యకూడా ఎక్కువే.
ఆంజనేయస్వామి ఆలయ క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి.
ఉత్సవాలు
ఫాల్గుణ శుధ్ధ పౌర్ణమి రోజు తిరునాళ జరుగుతుంది. వైశాఖ బహుళ దశమి రోజు హనుమజ్జయంతి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారు. హనుమజ్జయంతి రోజు విద్యుద్దీపాలతో అలంకరించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణ.
దర్శన సమయాలు
ఉదయం 6-30 నుంచీ, సాయంకాలం 6-30 దాకా.
సింగరాయకొండనుంచీ పైన చెప్పిన ఆలయాలకి ఆటోలో కూడా వెళ్ళిరావచ్చు. రెండు కొండలమీదకీ ఆటోలు వెళ్తాయి.
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)