అమ్మవారి తొమ్మిది అవతారాలు ఇవే!
శరన్నవరాత్రులు వచ్చేశాయి. భక్తులు అమ్మవారిని తమకి ఇష్టమైన అలంకారాలలో తల్చుకుని కొలుచుకునేందుకు సిద్ధపడిపోయారు. ఒకో దేవాలయపు సంప్రదాయాన్ని బట్టి అమ్మవారిని ఒకో రోజు ఒకో అలంకారంలో పూజించుకోవడం ఆచారం. ఈ అలంకారాలకీ అమ్మవారి అవతారాలకీ పొంతన ఉండకపోవచ్చు. దేవీమహత్యం ప్రకారం అమ్మవారు వేర్వేరు సందర్భాలలో ధరించిన తొమ్మిది అవతారాలూ ఇవే…
మహాకాళి :– ఒకానొక సమయంలో విష్ణుమూర్తి చెవుల నుంచి మధుకైటభులనే రాక్షసులు జనించారు. వారు లోకకంటకులై సాక్షాత్తు ఆ బ్రహ్మ మీదకే యుద్ధానికి వెళ్లారు. ఆ రాక్షసులని సంహరించేందుకు సిద్ధపడిన విష్ణుమూర్తికి, ఈ జగత్తుని పాలించే మహామాయ కూడా సాయపడింది. ఆ సమయంలో మహామాయ ధరించిన రూపమే మహాకాళి.
మహాలక్ష్మి :– పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలనూ పట్టిపీడిస్తున్న ఆ మహిషాసురుని బారి నుంచి రక్షించమంటూ దేవతలంతా శివకేశవులని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి, శివుని క్రోధాగ్నుల నుంచి వెలువడిన దేవి మహాలక్ష్మి. మహిషాసురుని సంహరించి ఈమె మహిషాసురమర్దినిగా కూడా పిలవబడుతోంది.
మహాసరస్వతి :– ఒకప్పుడు శుంభనిశుంభులనే రాక్షసులు లోకాన్ని పీడించసాగారు. వీరిని కడతేర్చేందుకు అమ్మవారు ధరించిన రూపమే మహాసరస్వతి. అయితే ఆ శుంభనిశుంభులు తమని సంహరించేందుకు అవతరించిన అమ్మవారినే మోహించారు. ఆమెని పట్టి తెమ్మంటూ చండ, ముండులనే రాక్షసులను పంపారు. మహాసరస్వతి నుంచి వెలువడిన కాళి అనే శక్తి ఆ చండముండులని సంహరించి చాముండిగా పేరుతెచ్చుకొంది. ఆ తర్వాత శుంభనిశుంభుల వధ జరిగిపోయింది.
నందయ :– కృష్ణుని జన్మవృత్తాంతం అందరికీ తెలిసిందే! దేవకి గర్భాన జన్మించినవాడు తనని హతమారుస్తాడని తెలిసిన కంసుడు, ఆమెకి పుట్టిన శిశువులందరినీ హతమార్చడం మొదలుపెట్టాడు. ఈలోగా దేవకి అష్టమ గర్భాన కృష్ణుడు పుట్టనే పుట్టాడు. కృష్ణుని తండ్రి వసుదేవుడు ఆ పసిబాలుని గోకులంలోని నందుని ఇంట చేర్చాడు. అదే సమయాన నందుని ఇంట జన్మించిన మాయాదేవిని దేవకి చెంతకి తీసుకువచ్చాడు. కంసుడు ఆ పసిపాపను చంపబోగా, ఆమె కంసుని పరిహసిస్తూ అదృశ్యమైపోయింది.
రక్తదంతి :– విప్రచిత్తుడనే రాక్షసుని సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారాన్ని ధరించినట్లు చెబుతారు. విప్రచిత్తుని, అతని అనుచరులను సంహరించడమే కాకుండా... వారి రక్తాన్ని కూడా తాగడం వల్ల, ఆమె దంతాలు ఎర్రగా మారిపోయాయట. అందుకే ఆమెను రక్తదంతి అని పిలుస్తారు. ఆమె దంతాలే కాదు- ఆయుధాలు, ఆభరణాలు, అంగాలు... అన్నీ ఎర్రగానే కనిపిస్తాయి.
శాకంభరి :– ఒకసారి ఈ భూమి మీద ఘోరమైన కరువు ఏర్పడింది. ఆ సమయంలో ప్రజలకు తినేందుకు ఆకులూ అలములూ కూడా మిగల్లేదు. ఆకలితో ప్రజలు విలవిల్లాడిపోయారు. ఆ ఆకలి కారణంగా ధర్మం కూడా దారితప్పింది. ఈ ఆపద నుంచి రక్షించమంటూ దేవమునులు ఆ అమ్మవారిని ఆర్తిగా అర్థించారు. అంతట ఆ చల్లని తల్లి వర్షాలను కురిపించి చెట్టూచేమా తిరిగి చిగురించేలా చేసింది. అలా ప్రజలకు శాకాలను (కూరలు) అందించిన తల్లిని శాకంభరీదేవిగా భావిస్తారు.
దుర్గ :– అమ్మవారి ఈ అవతారం అందరికీ తెలిసిందే! దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించినందుకుగాను అమ్మవారికి ఈ పేరు వచ్చింది. ఈ దుర్గమాసురుని సంహరించడంలో భాగంగా దుర్గాదేవి, నవదుర్గలు పేరుతో మరో తొమ్మిది ఉప అవతారాలను ధరించడం ఇంకో విశేషం. బెంగాల్ ప్రాంతంలో ఈ దుర్గాదేవినే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందుకనే అక్కడ నవరాత్రులను దుర్గాపూజగా పిలుస్తారు.
మాతంగి :– వాక్కుకీ, జ్ఞానానికీ, సంగీతానికీ... అ మాటకు వస్తే 64 కళలకూ ఈ తల్లి అధినేత్రి అని చెబుతారు. తాంత్రిక ఆచారాలలో ఈ అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఉంది. తాంత్రికులు అమ్మవారిని కాళి, తార, భైరవి తదితర పది రూపాలలో ఆరాధిస్తారు. వాటిని దశమహావిద్యలు అంటారు. వాటిలో మాతంగి కూడా ఒకరు.
భ్రమరి :– పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఘోరమైన తపస్సుతో అతను అమితబలశాలిగా మారిపోయాడు. ఆ మదంతో అతను ఏకంగా కైలాసం మీదకే దండెత్తాడు. అతన్ని నిలువరించడం ఆ పరమశివునికి కూడా సాధ్యం కాలేదు. దాంతో ఆయన సతి పార్వతి, అరుణాసురుని ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. ఆ సమయంలో పార్వతీదేవి ధ్యానం నుంచి తేనెటీగలు, తుమ్మెదలు తదితర కీటకాలన్నీ వెలువడ్డాయట. ఆ కీటకాలు అరుణాసురుడినీ, అతని సైనికులను చీల్చి చెండాడాయి. అలా భ్రమరాల సాయంతో దుష్టసంహారం గావించిన అమ్మవారికి భ్రామరి అన్న పేరు స్థిరపడింది. అమ్మవారి పేరుతో తెలుగువారికి ఆరాధ్య దైవమైన ‘శ్రీశైల భ్రమరాంబిక’ గురించి అందరికీ సుపరిచితమే!
అమ్మవారు ధరించిన అసంఖ్యాకమైన అవతారాలలో ఓ తొమ్మిది గురించి మాత్రమే ఇక్కడ పేర్కొన్నాము. సంఖ్యకి తొమ్మిదే కానీ, ఆ జగజ్జనని లీలలను సూచించే అవతారాలకు లెక్కేముంటుంది!
- నిర్జర.