భోగి పండ్లు ఎందుకంత ప్రత్యేకం!

 

 

సంక్రాంతి వస్తోందనగానే భోగిపండుగే గుర్తుకు వస్తుంది. భోగినాడు ఉదయం వేళ కుర్రకారుకి భోగిమంటలు, సాయంవేళల్లో పిల్లలకి భోగిపండ్ల సంప్రదాయం పూర్తికాకపోతే పండగంతా వెలితిగా తోస్తుంది. ఇంతకీ ఈ భోగిపండ్లకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే బోలెడు సమాధానాలు కనిపిస్తాయి.


- పిల్లలకు భోగిపండ్లుగా వినియోగించేందుకు చిన్న రేగుకాయలను వాడతారు. ఈ రేగుకాయలకు బదరీఫలం అన్న పేరు కూడా ఉంది. పూర్వం నరనారాయణులు ఈ బదరికావనంలోనే శివుని గురించి ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందట.


- రేగుపండుని అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడే! సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. భోగి మర్నాడు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మారతాడు. అలా సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి... ఆ సూర్యభగవానుని ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారని కూడా ఒక విశ్లేషణ ఉంది. బహుశా అందుకనే భోగిపండ్ల వేడుక సూర్యాస్తమయం లోపలే ముగించడం మంచిదంటారు.


- నిత్యం కేరింతలు కొడుతూ చిలిపి కృష్ణుని తలపించే పిల్లలకి దిష్టి తగులుతుందేమో అని పెద్దలు భావించడం సహజం. దీని కోసం ఉప్పు దిష్టి, గంటం దిష్టి, కొబ్బరికాయ దిష్టి... ఇలా రకరకాలుగా దిష్టి తీసేస్తుంటారు. అలా భోగిపండ్లను కూడా పిల్లలకు ఉన్న దిష్టిని దూరం చేస్తాయని నమ్ముతారు. అందుకే పిల్లవాడిని భోగిపండ్ల వేడుక కోసం కూర్చుండబెట్టిన తర్వాత, తొలుతగా తల్లి అతనికి బొట్టు పెట్టి తల చుట్టూ ముమ్మారులు దిష్టి తీస్తూ భోగిపండ్లను విడుస్తుంది. ఆ తరువాత ముత్తయిదువలకు కూడా పిల్లవాడి తల మీదుగా పడేట్లు భోగిపండ్లను విడుస్తారు. ఇలా పిల్లవాడి మీద నుంచి నేలకి రాలిన పండ్లని తినకూడదననీ... వాటిని బీదలకు దానం చేయడమో, ఎవరూ తొక్కని చోట పారవేయడమో చేయమని చెబుతుంటారు.


- భోగిపండ్ల వెనుక పిల్లవాడికి ఆ విష్ణుభగవానుడు, సూర్యభగవానుని ఆశీస్సులు ఉండాలనీ.... అతడిని ఆవరించి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలనీ పెద్దల నమ్మకం అని అర్థమవుతోంది. కాబట్టి ఇందుకోసం ఆడా, మగ తారతమ్యం కానీ కులాల పట్టింపులు కానీ అనవసరం. కాకపోతే 13 ఏడు వచ్చిన దగ్గర్నుంచీ పిల్లలు కౌమారదశకు చేరుకుంటారు కాబట్టి 11 లేక 12 ఏళ్ల వయసు లోపల పిల్లలకే ఈ వేడుకని నిర్వహిస్తుంటారు.


- భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. ఆయుర్వేదపరంగా రేగుపండ్లని దివ్యౌషధంగా పరిగణిచవచ్చు. వాటి వాసన సైతం ఆరోగ్యాన్ని కలిగిస్తుందంటారు. బంతిపూల సంగతి చెప్పనే అక్కర్లేదు. వైద్య పరిభాషలో కేలెండ్యులాగా పిలుచుకునే ఈ పూలు ఒంటికి తగిలితే, ఎలాంటి చర్మవ్యాధి అయినా నయమైపోతుందని సంప్రదాయ వైద్యం చెబుతోంది. ఇక ఇప్పుడంటే చిల్లర నాణేల తయారీ కోసం నానారకాల లోహాలనీ ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు చిల్లర నాణేలంటే రాగి నాణేలే. ఒంటికి తగిలినప్పుడు రాగి ఎంత మేలు చేస్తుందో పెద్దలు తరచూ చెబుతూనే ఉంటారు కదా! ఇలా భోగిపండ్ల వేడుక పిల్లలకు ఆశీస్సులనీ, ఆరోగ్యాన్నీ అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మరింకేం! భోగికి ఇంకా సమయం ఉంది కాబట్టి, మనం కూడా ఇంట్లో పిల్లలకు భోగిపండ్ల వేడుకుని చేసేందుకు కావల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు.

 

- నిర్జర.


More Enduku-Emiti