యోగక్షేమం వహామ్యమహమ్!
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమహమ్ (గీత.9.22)
నేను తప్ప వేరే ధ్యాస లేకుండా, ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో; నిత్యం నాయందే ఎవరైతే లీనమై ఉంటారో.... వారి యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను.భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాలలో ఇది ఒకటి! గీతలోని రాజవిద్యా రాజగుహ్యయోగం అనే తొమ్మిదవ అధ్యాయంలోని ఈ శ్లోకం, కర్మసిద్ధాంతానికి ఒక మూలస్తంభంలా తోస్తుంది. అహంకార రహితుడైన భక్తుడు తాను చేసే ప్రతి పనినీ ఆ పరమేశ్వరునికి అర్పిస్తూ, నిరంతరం ఆయననే స్మరిస్తూ, ఆయనలో లీనమయ్యేందుకు తపిస్తూ ఉన్నప్పుడు.... అలాంటి భక్తుని యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తనదే అన్న భరోసాను అందిస్తున్నాడు కృష్ణపరమాత్ముడు. అంతేకాదు! ఆపదలన్నీ కట్టకట్టుకుని చుట్టుముట్టినప్పుడు, కష్టాలన్నీ కలసి వచ్చినప్పుడు.... తాను భక్తుని వెంటే ఉంటానన్న సూచన కూడా ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నది కేవలం ఒక మాట కాదు, ఒక అభయం, ఒక ఆశీస్సు! అందుకే జీవిత బీమా సంస్థ కూడా తన నినాదంగా ఈ వాక్యాన్ని చేర్చుకుంది.