మహా శివరాత్రి రోజు రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు.. రుద్రాభిషేక ప్రాముఖ్యత ఏమిటి!
.webp)
భారతదేశం యావత్తు జరుపుకునే పర్వదినం మహా శివరాత్రి. సాధారణంగా పరమేశ్వరుడికి అభిషేకాలు అంటే మహా ప్రీతి. అందులోనూ రుద్రాభిషేకం మరీ శక్తివంతమైనది. పరమేశ్వరుడికి చేసే ప్రత్యేక అభిషేకాన్నే రుద్రాభిషేకం అని అంటారు. మాఘ మాస కృష్ణపక్ష చతుర్థశి రోజు మహా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజు రాత్రి మొత్తం శివుడికి నిరంతరంగా అభిషేకాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. పరమేశ్వరుడి అనుగ్రహం అందించే శివరాత్రి నియమాలలో రుద్రాభిషేకం చాలా ముఖ్యమైనది. రుద్రాభిషేకం గురించి, రుద్రాభిషేక ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటే..
రుద్రాభిషేకం అంటే..
అభిషేకం అంటే పవిత్ర స్నానం. ఈ అభిషేకాన్ని రుద్రుడికి లేదా శివుడికి సమర్పించినప్పుడు దానిని రుద్రాభిషేకం అంటారు. రుద్రాభిషేకంలో శివలింగాన్ని నీరు, గంగా జలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో పాటు ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకం కోసం ఉపయోగిస్తారు. రుద్ర సూక్త, మహామృత్యుంజయ మంత్రం లేదా "ఓం నమః శివాయ" వంటి మంత్రాలను జపిస్తూ అభిషేకం చేస్తారు. ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, భక్తి, భగవంతుని పట్ల భక్తులకు ఉండే అంకిత భావం, అంతర్గత శుద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, మహా శివరాత్రి నాడు చేసే రుద్రాభిషేకం అత్యంత ఫలవంతమైనది. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల మానసిక అశాంతి తొలగిపోయి సానుకూల శక్తి లభిస్తుందని చెబుతారు. రుద్రాభిషేకం ద్వారా భక్తులు తమ దుఃఖాలు, బాధలు, మానసిక సమస్యలను శివుడికి సమర్పిస్తారట. మనస్ఫూర్తిగా పరమేశ్వరుడి మీద పూర్తీ భక్తి ఉంచి చేసే రుద్రాభిషేకం, పరమేశ్వర ఆరాధన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు.
రుద్రాభిషేక ప్రాముఖ్యత..
వేదాలలో శివుడిని "రుద్రుడు" అని పిలుస్తారు. రుద్రుడు అంటే దుఃఖాలను నాశనం చేసేవాడు. "ఋతం దుఃఖం ద్రవయతి ఇతి రుద్ర" అని ఒక మాట ఉంది. అంటే దుఃఖాలను తొలగించేవాడు రుద్రుడు. మన జీవితంలోని అనేక అడ్డంకులు మన గత చర్యల ఫలితమేనని నమ్ముతారు. రుద్రాభిషేకం, రుద్ర అర్చన ఈ పాపపు కర్మలను నాశనం చేస్తాయి. సాధకుడిలోని శివ తత్వాన్ని మేల్కొల్పుతాయి. రుద్రహృదయో ఉపనిషత్తు కూడా రుద్రుడు అన్ని దేవతలకు మూలం అని, ఆయన రూపం మొత్తం విశ్వంలో వ్యాపించిందని పేర్కొంది. అందువల్ల రుద్రాభిషేకం ఎలాంటి సమస్యలకు అయినా త్వరిత ఫలితాలను ఇచ్చే పరిహారంగా పరిగణించబడుతుంది. కాలసర్ప దోషం, గ్రహ బాధలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టం లేదా విద్యలో అడ్డంకులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన ఆచారంగా కూడా పరిగణించబడుతుంది.
రుద్రాభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు..
రుద్రాభిషేకం జీవితంలో ప్రతికూల శక్తిని తగ్గించడానికి, మళ్లీ మళ్లీ ఎదురయ్యో అడ్డంకులను క్రమంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి, కెరీర్ స్థిరత్వాన్ని పొందడానికి కూడా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
రుద్రాభిషేకం ఆరోగ్య సమస్యలు, గ్రహ బాధలను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది వైవాహిక, కుటుంబ సంబంధాలను కూడా పెంచుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, శివుని ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది.
మహాశివరాత్రి నాడు భక్తితో చేసే రుద్రాభిషేకం జీవితంలో సానుకూల మార్పులను తెస్తుందని నమ్ముతారు. ఇది భౌతిక పురోగతికే కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి కూడా మార్గం సుగమం చేస్తుంది.
*రూపశ్రీ.



