గురు పౌర్ణమి సందర్భంగా గురు వందనం
గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః
గురు పౌర్ణమి సందర్భంగా గురు స్మరణ. త్రిమూర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో మనం మన గురువులని దర్శించముగానీ, గురువుగారిలో ఆ దేవతా మూర్తులను దర్శించి నమస్కరిస్తాము. ఎంత గొప్ప సంస్కృతండీ మనది. అందుకే కబీర్ దాస్ అంటారు.
గురువు అర్దం:
గురు గోబింద్ దోవు ఖడే కాకే లాగూ పాయ్
బలిహారీ గురూ ఆప్ నే గోబింద్ దియో బతాయ్
ఈ దోహా చాలామంది వినే వుంటారు, దాని అర్ధమూ తెలిసే వుంటుంది. కానీ గురు పౌర్ణమి సందర్భంగా మరొక్కసారి దాని అర్ధం చెప్పుకుందాము. గురువూ భగవంతుడూ ఒకేసారి ముందుకొస్తే ముందు ఎవరికి నమస్కరించాలి? భగవంతుణ్ణి చూపించినవాడు గురువు, అందుకని ముందుగా గురువు కాళ్ళకే..... భారతీయ సంస్కృతిలో గురువుకి చాలా ఉన్నత స్ధానం వున్నది. భారతీయులు కేవలం తమ గురువునే కాక, గురు పరంపరని అంటే తన గురువుని (స్వ గురువు), గురువుగారి గురువుని (పరమ గురువు), వారి గురువుని (పరమేష్ఠి గురువు) కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారిని గురువు అంటారు. ఆ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తమ గురువులతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల ఈ బంధం తరతరాల వరకూ కూడా కొనసాగవచ్చు.
మన దేశంలో ఆది గురువుగా వేద వ్యాసుణ్ణి కొలుస్తారు. దానికి కారణం ఆయన మనకందించిన ఆధ్యాత్మిక వారసత్వం. ఈయన అసలు పేరు వైశంపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, పరిష్కరించాడుగనుక వేద వ్యాసుడయ్యాడు. పంచమ వేదంగా పేర్కొనబడే మహా భారతాన్ని రచించాడు. నాలుగు వేదాలను నలుగురు శిష్యులద్వారా లోకంలో ప్రచారం చేశాడు. శ్రీ కృష్ణుడు గీతా బోధ ద్వారా ప్రపంచానికి గురువైతే, శక్తివంతమైన సంస్కృతినీ, దానికి అవసరమైన వాజ్ఞ్మయాన్నీ ప్రపంచానికి అందజేసిన వ్యాసుడూ గురువే. ఈయనని శ్రీ మహా విష్ణువు అవతారంగా కూడా పరిగణిస్తారు. అందుకే ఆయనని గురువులందరికీ గురువుగా, ఆది గురువుగా భావించి, ఆయన పుట్టిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి, ఆయననీ, తమ గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకుంటారు.
గురు పౌర్ణమి ఎలా వచ్చింది ? మనకి ఆషాఢ మాసం నుంచీ వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒక చోట ఎక్కువ కాలం గడపరు. కానీ వర్షాకాలంలో వానల వలన ఇబ్బందే కాక, ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమినుంచి నాలుగు నెలల చాతుర్మాసం పాటిస్తారు. అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోటే వుంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయటానికి వచ్చేవారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమినాడు గురు పూజ చేసేవారు. ఆ ఆచారం ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అని కొందరి అభిప్రాయం.
ప్రతి షిర్డీ నిర్మాణం: ఎవరి అభిప్రాయం ఎలా వున్నా, గురు పౌర్ణమి రోజున గురువుని పూజించాలి అనే అంతరార్ధం ఒకటేగనుక (మిగతా రోజులలో అక్కరలేదని కాదు, సద్గురువు సదా పూజనీయులు), గురు పౌర్ణమి సందర్భంగా, మరి నేను మీకు గురువుగారి ఆలయం పరిచయం చెయ్యాలికదా. ప్రస్తుతం చాలామంది గురువు అంటే వెంటనే సాయిబాబా అంటారు. ఆయనని ఎవరూ ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదుగానీ, ఆయన కోసం ఒక భక్తుడు కట్టించిన నూతన ఆలయాన్ని పరిచయం చేస్తాను. ఈ ఆలయం పేరు ప్రతి షిర్డీ. ఇక్కడ నిర్మాణాలన్నీ షిరిడీలోని సాయి సంస్ధాన్ నిర్మాణాలని పోలివుంటాయి.. అందుకే దీనికి పేరూ ప్రతి షిర్డీ అని పెట్టారు. ఇది కొత్త ఆలయంగనుకు స్ధల పురాణం వుండదు. అయితే దీని నిర్మాణ కార్యక్రమంబెట్టిదనినా...
రైల్వే స్టేషన్: ప్రతి షిర్డీ పూనా రైల్వే స్టేషన్ నుంచి 32 కి.మీ. ల దూరంలో ఓల్డ్ ముంబాయి – పూనే మార్గంలో షిర్ గావ్ అనే ప్రదేశంలో నిర్మింపబడింది. అతి విశాలమైన ప్రదేశంలో విశాలంగా నిర్మింపబడిన ఈ భవనాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ప్రకాష్ కేశవరావ్ డియోలె అనే సాయిబాబా భక్తుడు షిర్డీలోలాగానే ఇక్కడకూడా సాయి మందిరాన్ని నిర్మించాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో ముందు నిర్మాణం మొదలు పెట్టారు. తర్వాత భక్తులందరి సహకారంతో నిర్మాణం 9 నెలలలోనే పూర్తయింది. ఇంత స్వల్ప వ్యవధిలో ఈ భారీ నిర్మాణం పూర్తి చెయ్యటం ఒక అద్భుతం అంటారు. ఈ తొమ్మిది నెలలూ ఇక్కడ పనిచేసినవారు సాయి చమత్కారాలను అనేకం అనుభవించారంటారు. ఇక్కడి నిర్మాణాలు షిర్డీని తలపింపచేస్తాయని చెప్పానుకదా. ప్రవేశ ద్వారం దాటి లోపలకి వెళ్ళగానే గురుస్ధాన్ దర్శనమిస్తుంది. ఇక్కడి వేప చెట్టు నిర్మాణం తలపెట్టిన తర్వాత పెట్టింది కాదు. ముందునుంచీ ఆ స్ధలంలో వున్న చెట్టు దగ్గర గురుస్ధాన నిర్మాణం చక్కగా అమిరింది.
అన్నసత్రం: ఆలయ ప్రవేశ ద్వారం, గురుస్ధాన్, సాయి మందిరం, సమాధి, ద్వారకామాయి, చావిడి, అన్నసత్రం అన్నీ షిరిడీని తలపింప చేస్తాయి. అందుకే దీనికి పెట్టిన పేరుకూడా ... ప్రతి షిర్డీ ... చక్కగా సరిపోయింది. అన్న సత్రం ఒక మహారాజుగారి పేలెస్ లాగా అత్యంత సుందరంగా వుంటుంది. భోజనానికి స్వల్ప రుసుం రూ. 25తో ఇక్కడ ప్రసాదం (భోజనం) లభిస్తుంది.
ఇంకా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతూ అభివృధ్ధి పధంలో నడుస్తున్న ఈ సంస్ధాన్ వల్ల షిర్ గావ్ ప్రఖ్యాతమయినది. రోజూ అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న ఈ ఆలయంలో పూజలు, హారతులు అన్నీషిరిడీలో లాగానే వుంటాయి. భగవంతునికి సమస్తం అర్పించటంలోవున్న సంతోషాన్నీ, విలువనీ చాటి చెప్పిన సాయిబాబా భక్తుల మనసులలో కొలువు తీరిన గురువు. ఆ గురువుకి గురుపౌర్ణమి సందర్భంగా శతకోటి వందనాలు.
అన్నట్లు దర్శన సమయాలు చెప్పలేదుకదూ.... రోజూ ఉదయం 5 గం. ల నుంచీ రాత్రి 10-30 దాకా. ప్రసాదం సమయం మధ్యాహ్నం 12 గం. ల నుంచి 3-30 దాకా. అవకాశం వున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది.
- పి.యస్.యమ్. లక్ష్మి
( తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)