మేకల బేరంలో సాయిబాబా మోసపోయరా?
శ్రీ సాయిసచ్చిరితము
నలుబది ఆరవ అధ్యాయము 2 వ భాగం

 


ఒకనాటి ఉదయం బాబా లెండి తోట నుంచి తిరిగి వస్తున్నారు. దారిలో మేకల మంద బాబాకు ఎదురుపడినది. వాటిలో రెండు మేకలపై బాబా దృష్టి పడింది. బాబా వాటిని సమీపించి ప్రేమతో తాకి లాలించెను. ఆ మేకల యజమాని దగ్గరకు వెళ్ళి  ముప్పైరెండు రూపాయలు యిచ్చి ఆ మేకలను కొన్నారు. బాబా ఇలా చేయటం ఆయన భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. బాబా మేకల బేరము చేయుటలో మోసపోయారని వారి అభిప్రాయం. ఎందుకంటే ఒక్క మేకకు రెండు లేదా మూడు రూపాయలు మాత్రమే. రెండు మేకలు కలిపి 8 రూపాయలకంటే ఎక్కువ పైకం చాలు అలాంటిది ముప్పై రెండు రూపాయలు చాలా హెచ్చు పైకమని వారి భావన. ఆ విషయమే వారు బాబకు వివరించారు. కానీ బాబా ఊరకనే ఉండెను. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానము చెప్పమని వేడుకొన్నారు. బాబా అందుకు "నాకు ఇల్లుగానీ, కుటుంబము గాని లేదు. కావున నేను ధనము నిలువ చేయరాదు". అనిరి. ఆ తర్వాత బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి యిచ్చి వేసేను. అప్పుడు ఆ మేకల పూర్వ వృత్తాంతము ఈ విధము చెప్పిరి.

 

 

"శ్యామా! తాత్యా! మీరీ బేరములో నేను మోసపోయితిని అని అనుకుంటున్నారు. అది యదార్థము కాదు. వాని కథ చెబుతా, వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము చేత నా మిత్రులుగా ఉండెడివారు. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. వారికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండెను. రాను రాను వారిరువురూ బద్ధ శత్రువులుగా మారారు. పెద్దవాడు సోమరి. చిన్నవాడు చురుకైనవాడు. అతను చాలా ధనం సంపాదించాడు. అది చూసి అసూయ చెందిన పెద్దవాడు, చిన్నవాడిని చంపి, ధనం సొంతం చేసుకో జూసెను. సోదరులమని మరిచి యిద్దరూ కలహించుకున్నారు. అన్న తమ్ముని చంపుటకు అనేక పన్నాగాలు పన్నెను. అవన్నీ నిష్ప్రయోజనములయ్యెను. వారిలో శత్రుత్వము మరింత పెరిగెను. ఒకరోజు అన్న తన తమ్ముని బడితెతో కొట్టెను. తమ్ముడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అక్కడిక్కడే చచ్చి పడిరి. వారి కర్మ ఫలం చేత ఇద్దరూ మేకలుగా పుట్టిరి. వారు నా పక్క నుంచి పోతుండగా, వారి ఆనవాలు గుర్తించితిని. పూర్వవృత్తాంతము జ్ఞప్తికి వచ్చి, వారిపై కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి నిచ్చి, ఓదార్చాలనుకుంటిని. అందుకే అంత ద్రవ్యం వ్యయపరిచితిని. అందువలన మీరు నన్ను దూషించుచున్నారు... నా బేరం మీకు నచ్చనందువలన నేను వానిని యజమాని వద్దకు తిరిగి పంపితిని"... బాబాకు మేకల పైన కూడా అంతటి దయ... 

 

సమాప్తం


More Saibaba