ప్రదోష కాలం ఎప్పుడు.. ఈ సమయంలో శివారాధన శ్రేష్టం ఎందుకంటే..!
సాధారణంగా దేవుళ్లను అర్చించే సమయం సూర్యోదయం ఉంటుంది. ఏ పండుగకు అయినా సూర్యోదయం సమయంలో దీపారాధన, పూజ, నైవేద్యం.. మొదలైనవి పెడుతుంటారు. కానీ పరమేశ్వర పూజకు మాత్రం ప్రదోష కాలం మంచిదని చెబుతారు. అసలు ప్రదోషకాలం ఎందుకు అంత శ్రేష్టమైనది. ఈ సమయంలో చేసే శివారాధన ఎందుకు అంత శ్రేష్టం? చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటే..
ప్రదోష కాలం గురించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు.. సూర్యాస్తమయం తరువాత 45 నిమిషాలు మొత్తం 90 నిమిషాల కాల వ్యవధిని ప్రదోషకాలం అంటారని చెబుతారు.
రెండవది సూర్యోదయానికి ముందు 24 నిమిషాలు, సూర్యాస్తమయం తరువాత 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలం అని పిలుస్తారని అంటారు.
మూడవది.. సూర్యాస్తమయం తరువాత సాగే రెండు గంటల 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలంగా బావిస్తారని అంటారు. అయితే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు గల కాలాన్ని ప్రదోషకాలం అని ఆ సమయంలో శివారాధన చాలా శ్రేష్టం అని చెబుతారు. ఇక ఈ సమయమే శివారాధనకు శ్రేష్టం ఎందుకంటే..
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఒకే సమయంలో రెండు రూపాలను ధరించి ఉంటాడు. అంటే అర్థనారీశ్వర రూపంలో ఉంటాడు. ఈ సమయంలో చేసే పూజ ఏదైనా సరే.. పార్వతీపరమేశ్వరులకు ఇద్దరికీ చెందుతుంది. ఎడమ భాగంలో పార్వతి, కుడిబాగంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చే సమయం ఇది. అంతేకాదు.. ఈ సమయంలో అర్థనారీశ్వర రూపంలో శివుడు భూలోకంలో సంచరిస్తాడని కూడా పెద్దలు చెబుతారు. అందుకే ఈ సమయంలో శివారాధన తప్ప వేరే ఏ పనులు చేయకూడది, ముఖ్యంగా భార్యాభర్తలు కూడా అస్సలు సంభోగంలో కలవకూడదని అంటారు. అలాగే సాయంత్రం సమయంలో ఎవరూ నిద్రపోకూడదని కూడా అంటారు.
ఈ ప్రదోషకాలంలో చేసే శివపూజ, శివారాధన, శివాభిషేకం ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. సాయంత్రమే ఎందుకు మంచిదంటే.. శివుడు లయ కారుడు. అన్నింటిని తనలో కలిపేసుకునేవాడు. అందుకే సూర్యాస్తమయం సమయం శివుడికి ప్రీతి అంటారు. అలాగే సూర్యోదయం విష్ణువుకు ప్రీతి. ఆయా కాలాలను అనుసరించి ఆయా దేవతలను పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.
*రూపశ్రీ.
