నారాయణవనంలో శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతిల కళ్యాణం
కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. తిరుపలికి 40కి.మీ. దూరంలో పుత్తూరుకి 5 కి.మీ. దూరంలో, శ్రీ కళ్యాణ వేంకటేవ్వర ఆలయం కలదు. ఇది అరుణానదీ తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయము. ఈ ఆలయం క్రీ.శ. 1544లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్నగారిచే నిర్మించబడినదని చర్రిత్ర చెప్పుచున్నది. ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియుచున్నది. కాని స్థలపురాణం మాత్రం నారాయణవరం అధిపతి అయిన ఆకాశరాజుగారు కట్టించారని చెప్పుచున్నది. ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించుచున్న కాలంలో వైకుంఠనివాసుడైన శ్రీమహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలసాడు. అపుడాయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది. యుక్తవయస్సుకు వచ్చిన పద్మావతి దేవి వేంకటేశ్వరుని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరింది. కుమార్తె కోరిక మన్నించిన ఆకావరాజు శ్రీవేంకటేవ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతివైభవంగా జరిపించాడని, ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.
ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఈ ఆలవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తుగల 7 అంతస్తులు గలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుచున్నది. ఈ ఆలయమందు గర్భగుడిలో కళ్యాణ వేంకటేశ్వరుడు ప్రక్కనే మరొక చిన్నగుడిలో పద్మావతీ అమ్మవారు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలయి. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెప్పుచుందురు.
ఈ ఆలయములో పద్మావతి, వేంకటేశ్వరులేకాక ఆళ్యారులు, దశావతారాలు, శ్రీవరదరాజస్వామి ఆండాళ్ళమ్మ, శ్రీకోదండరాముల వారు, శ్రీరంగ నాయకస్తామి, శ్రీరాజమన్నారుస్వామి, శ్రీ ప్రయాగస్వామి మున్నగువారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కొంత దూరంలో నున్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమినుండి అయిదు రోజులు స్వామివారి తెప్పోత్సవము, జ్వేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మాత్సవములు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.