ముక్తిని ప్రసాదించే క్షేత్రం – ముక్తినాధ్‌

 

 

ఒకే క్షేత్రం అటు శైవులకీ, వైష్ణవులకీ, బౌద్ధులకీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనత కలిగిన క్షేత్రం నేపాల్లోని ముక్తినాధ్‌ ప్రాంతం.

 

వైష్ణవులు 108 ప్రదేశాలను తమ దివ్యదేశాలుగా కొలుచుకుంటారన్న విషయం తెలిసిందే! అనుక్షణమూ విష్ణుతత్వంతో జీవించిన ఆళ్వారులు ఈ 108 క్షేత్రాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఆ 108 క్షేత్రాలలో ప్రస్తుతం మన దేశానికి ఆవల ఉన్న ఏకైక దివ్యదేశం ముక్తినాధ ఆలయం. తిరుమంగై అనే ఆశ్వారు పాడిన పాశురాలలో ఈ గుడి ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది. వైష్ణవపరంగా ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. వైష్ణవులు శ్రీరంగం, బదరీనాధ్‌, తిరుపతి వంటి ఎనిమిది క్షేత్రాలను స్వయంవ్యక్త క్షేత్రాలుగా పిలుచుకుంటారు. ఈ ప్రాంతాలలో విష్ణుమూర్తి స్వయంగా వెలిశాడన్నది వారి భావన. అలాంటి 8 స్వయంవ్యక్త క్షేత్రాలలో ముక్తినాధ్‌ కూడా ఒకటి.

 

 

ఇక అమ్మవారి శక్తిపీఠాలలో సైతం ముక్తినాధ్‌ ప్రస్తావన కనిపిస్తుంది. అమ్మవారి శక్తిపీఠాలు ఎన్ని అన్న విషయం మీద పలు వివరాలు ఉన్నప్పటికీ, 51 శక్తి పీఠాలుగా పేర్కొనే జాబితాలో ముక్తినాధ్ కూడా ఉంటుంది. అమ్మవారి నుదుటి భాగం ఇక్కడ పడిందని భక్తుల నమ్మకం. ఇక్కడి సమీపంలో గండకీనది ప్రవహించడం వల్ల, ఈమెకు ‘గండకీ చండి’ అన్న పేరు వచ్చింది. ఇక ఈమెకు తోడుగా నిలిచే స్వామివారిని ‘చక్రపాణి’గా కొలుచుకుంటారు.

 

 

ఇక బౌద్ధులు కూడా ఈ ముక్తినాధ ఆలయాన్ని పరమపవిత్రంగా భావిస్తారు. ‘అవలోకితస్వర’ అనే తమ దేవత ఈ ప్రాంతంలోనే ఉద్భవించిందని వారి నమ్మకం. తాంత్రికవిద్యలను అభ్యసించే కేంద్రాలలో ముక్తినాధ్‌ కూడా ఒకటని భావిస్తారు. టిబెట్‌ బౌద్ధానికి ఆద్యునిగా భావించే రింపోచే అనే గురువుగారు కూడా ఇక్కడ కొంతసేపు ధ్యానంలో గడిపారని నమ్ముతారు. ఆయన స్మారకార్థం ఆలయానికి వెలుపల ఒక ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. ఆ ఆలయంలో అప్రయత్నంగా ఒక జ్వాల వెలుగుతూ ఉండటాన్ని దైవ మహిమగా భావిస్తారు. హిందువుల ఈ జ్యోతిని జ్వాలామాయిగా కొలుస్తారు.

 

ముక్తినాధ్‌ ఆలయంలోని దైవం పేరు ముక్తినారాయణుడు. వీరితో పాటుగా భూదేవి, సరస్వతి, సీతమ్మతల్లి, గరుడ, లవకుశ, సప్తర్షుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయంలోని పూజాదికాల్ని బౌద్ధభిక్షువులే నిర్వహిస్తుంటారు. ఇక ఆలయం చుట్టూ అర్ధచంద్రాకారంలో 108 గోముఖాలు కనిపిస్తాయి. గండకీనది ద్వారా చల్లటి నీరు ఈ గోముఖాల ద్వారా ప్రవహిస్తుంటుంది. బహుశా 108 దివ్యదేశాలకు ప్రతీకగా ఇన్ని గోముఖాలను ఏర్పాటు చేసి ఉంటారు. రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో కూడా భక్తులు వీటి కింద స్నానమాచరిస్తుంటారు.

 

 

నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో దాదాపు 12 వేల అడుగుల ఎత్తున ఉండే ముక్తినాధ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఏమంత తేలిక కాదు. రాణిపువా, జామ్‌సమ్‌ వంటి ప్రాంతాల నుంచి నడుచుకుంటూనో, గుర్రాల మీదనో ఈ ఆలయానికి చేరుకోవాలి. ఆ ప్రయాస కూడా చేయలేనివారు హెలికాప్టర్లలో ఆలయం సమీపానికి చేరుకుంటారు. ఆలయాన్ని చేరుకోవడం ఇంత వ్యయప్రయాసలతో కూడుకున్నప్పటికీ నిత్యం వేలాదిమంది ప్రయాణికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముక్తిక్షేత్రంగా పిలుచుకునే ఈ పుణ్యస్థలిని చేరుకుంటూ ఉంటారు. 


 

- నిర్జర.


More Punya Kshetralu