మార్గశిర గురువారం విశిష్టత


మనకు నవగ్రహాలు ఉన్నాయి। వాటిలో రాహు,కేతువులు ఛాయా గ్రహాలు అని అంటారు। అవి కాకుండా మిగిలిన ఏడు గ్రహాల పేరు మీద మనకు వారములో ఏడు రోజులకు ఆదివారము, సోమవారం, మంగళ వారము, బుధ వారము, గురు వారము,శుక్ర వారము, శని వారము అని పేర్లు ఉన్నాయి। అయితే వీటిలో కార్తీక మాసములో సోమవారములు విశిష్టమైనవి అని, శ్రావణ మాసములో మంగళ వారములు, శుక్రవారములు, శని వారములు విశిష్టమైనవి అని అంటారు। అలాగే మాఘమాసము విషయమునకు వస్తే ఆది వారములు ఎంతో శుభప్రదమైనవి అని అంటారు। మధ్యలో బుధ వారము, గురువారం మాత్రము అంతగా విశిష్టత లేవేమో అనిపించేలా ఉంటాయి।కానీ నిజానికి దత్తాత్రేయుడు బుధవారం నాడు పుట్టాడు। కానీ గురు సంప్రదాయానికి చెందిన వాడు కనుక గురువారం తనకు ప్రీతికరం అని తెలుస్తోంది। అలాగే ఆ తరువాత ఆ సంప్రదాయంలో వచ్చిన గురువులందరు కూడా గురువారమును ఫలప్రదముగా స్వీకరించారు। ఈ మార్గశిరమాసములో గురువారములు ఎంతో పవిత్రం అని శాస్త్రవచనము। ఏమిటి దీనికి ప్రమాణం అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారికి  గురువారం సాయంత్రం పూట పూలంగి సేవ అని చేస్తారు। అంటే స్వామి వారికీ ఈ ఆభరణాల అలంకారం లేకుండా భూమి మీద పుట్టి, ఉన్న కొద్దిసేపు తమ పరిమళాలతో పరిసరాలను ఆహ్లాదభరితంగా చేసే పువ్వులతో స్వామివారిని అలంకరిస్తారు।  ఇది కేవలం గురువారం నాడే జరుగుతుంది। అంతే కాకుండా, ఈ గురువారమును లక్ష్మి వారము అని కూడా అంటారు।ఎందుకు అని ఆంటే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది।

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కోరుకొండ।అద్భుతమైన నరసింహ క్షేత్రం। అక్కడ  స్వామిని లక్ష్మీదాసి అని పేరు ఉన్న ఒక అమ్మగారు ప్రతిష్టించారని స్థల పురాణం ప్రకారం తెలుస్తోంది। అందుకని అప్పటి నుంచి గురువారమును లక్ష్మీ నృసింహ వారము అంటూ వచ్చేవారని, ఆ తరువాత జన బాహుళ్యంలో ఆ పేరు కాస్తా లక్ష్మలక్ష్మీవారము అయింది అని ఇప్పటికీ గురువారము అని కాకుండా లక్ష్మీవారము అని మాత్రమే అంటారు అని తెలుస్తోంది। అంతేకాకుండా, వైజాగ్ ప్రాంతములో కనకమహాలక్ష్మి అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు। ఎంతో ఆధారంగా గురువారంనాడు ప్రీతిగా పూజిస్తారు ఈ తల్లిని।
   
మార్గశిరమాసమునకు మహాలక్ష్మి పీఠమునకు మనసా శిరసా మరీ వందనం।మరీ మరీ వందనం అంటూ ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు। అలాగే శుక్రవారము నాడు సాధారణముగా ఏ నియమాలు అయితే పాటిస్తారో వాటినే ఉభయ గోదావరి జిల్లావాసులు, ఒడిస్సా ప్రాంతవాసులు కూడా గురువారం నాడు పాటిస్తూ ఉంటారు। కట్టెల మండీ వంటివి గురువారము నాడు ఉండవు। శుక్రవారము నాడు యధాతధముగా ఉంటాయి। ఎవరికీ గురువారం నాడు డబ్బు ఇవ్వరు। ఈ మాసములో కనక మహాలక్ష్మి అమ్మవారికి జరిగే ఉత్సవములు చూడడానికి వైజాగ్ నివాసులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తముగా ఎంతోమంది వస్తూ ఉంటారు।  అంతే కాకుండా లక్ష్మివారం రోజున అభ్యంగన స్నానం చేయడం అనేది ఒక ఆచారంగా ఉంది కనుక ఆ రోజు ఎక్కువ నీళ్లు కూడా ఇస్తూ ఉంటారు। ఆంటే ఈ మాసములో ఈ గురువారమునకు ప్రాధాన్యత ఈ మధ్య రాలేదు। ఎప్పటి నుంచో ఉంది। అంతేకాకుండా ఈ మాసములో గురువారం లక్ష్మీదేవికి,వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజు చేసుకునే పూజ శ్రావణ మాసములో శుక్రవారము లాగా, కార్తీక మాసములో సోమవారము లాగా అక్షయమైన ఫలితములను ఇస్తుంది అని తెలుస్తోంది। ఇంకా కనక మహాలక్ష్మికి ఆరాధన చేసే భక్తులు ఏదైనా కారణం వలన శ్రావణ మాసములో వరలక్ష్మి వ్రతం చేసుకోలేక పొతే ఈ మాసములో గురువారం చేసుకుంటూ ఉంటారు। ఇంకో విధముగా ఆలోచిస్తే ఈ కలియుగములో తొలి గురు స్వరూపమైన దత్తాత్రేయుడు ఈ మాసములోని జన్మించారు కనుక ఈ గురువారములు ఎంతో విశిష్టమైనవి అని చెప్పుకోవడం కూడా సమంజసమే। అందుకే ఎంతోమంది భక్తులు ఈ మాసములో గురువారములు చక్కని ఆయురారోగ్య,ఐశ్వర్య అభివృద్ధి కొరకు, సత్సంతాన ప్రాప్తి కొరకు పూజ చేసుకుని తరిస్తూ ఉంటారు। మనము వీలైనంత వరకు ఆచరించి తరిద్దాము।


More Festivals