కాశీ వెళ్లలేకపోయినా కాలభైరవాష్టమి రోజు ఈ పూజ చేయండి చాలు

 

కాల భైరవుడు। రుద్రుని అంశంలో పుట్టిన వాడు। మార్గశిర మాసములోని శుక్ల పక్ష అష్టమి రోజున ఈ స్వామి అవతరించినట్లు మనకు శివ మహాపురాణం నుంచి తెలుస్తోంది। ఈ రోజున వివిధ ప్రాంతాలలో ఈ స్వామిని అర్చించి, అష్టకం తో పూజించి, కుక్కను కాలభైరవుడి స్వరూపంగా భావించి పూజించి, గారెల దండాలు వేసి తినిపిస్తారు। అంతే కాదు, కాశీ యాత్ర చేసి వచ్చిన వాళ్ళు కాశీ సమారాధన అని చేసి వీధి కుక్కను పూజించి, కాలభైరవుడిగా భావించి, గారెల దండ వేసి, వాటికి ఇష్టమైన వేరే ఆహరం కూడా పెట్టి పూజిస్తారు।

అయితే ఎవరీ కాలభైరవుడు, ఎలా పుట్టాడు? ఎందుకు పుట్టాడు అనే విషయం ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుస్తోంది। ఒకప్పుడు సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడు, లయ కర్త అయిన శివుడి మధ్య ఎవరు అధికులు అనే విషయం పైన గొడవ మొదలైంది। బ్రహ్మ దేవుడు సంయమనం కోల్పోయి శివుడిని విపరీతంగా దూషించాడు। అప్పటివరకు సహనంగా ఉన్న శివుడు కోపోద్రిక్తుడై తన శరీరం నుంచి కాలభైరవుడిని సృష్టించాడు। కోపం తో ఉన్న శివుడిని చూసి స్వామి, నన్నెందుకు పుట్టించావు? ఏమి చేయమంటావు అని అడిగాడు ఆ స్వామి। అప్పుడు శివుడు నన్ను అనవసరంగా బ్రహ్మ దేవుడి మధ్య తల విపరీతంగా దూషించింది। కనుక ఆ తలను పెరికివేయి అని చెప్పాడు। అసలే ఆవేశావతారం, శివుడి ఆజ్ఞ కూడా అయింది। వెంటనే వెళ్లి బ్రహ్మదేవుడి శిరస్సుని పెరికి వేసాడు। కానీ ఎంతైనా బ్రహదేవుడు కావడంతో అతనికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది। తిరిగి వచ్చి శివుడిని అడిగితే భూమి మీద ఉన్న పుణ్య క్షేత్రాల దర్శనం చేయమని, పుణ్య తీర్ధాలలో స్నానం చేయమని చెప్పాడు। ఏ క్షేత్రంలో నీకు ఈ బ్రహ్మ హత్యాపాతకం వెంటపడడం ఆగిపోతుందో ఆ క్షేత్రం పరమపావనం అని తెలుసుకోమ్మని చెప్పాడు। ఆ స్వామి ఆజ్ఞ మేరకు భూమి మీద క్షేత్రాలు అన్నీ తిరుగుతూ ఉండగా కాశీ క్షేత్రమునకు రాగానే బ్రహ్మ హత్యా పాతకం వదలి వెళ్లి పోయింది। అప్పుడు శివుడు కనిపించి నాకు ఎంతో ప్రీతికరమైన ఈ క్షేత్రములో నీకు ఇలా మేలు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది। ఇక మీదట ఇక్కడే స్థిరనివాసుడవై ఉండు। ఇక్కడ నేను విశ్వనాధుడను అయినప్పటికీ నిన్ను ముందుగా దర్శించుకుని ఆ తరువాత నన్ను దర్శించేలా వరం ఇస్తున్నాను అంటూ అనుగ్రహించాడు।

అందుకే ఎన్ని యుగాలు గడచినా ఇప్పటికీ అదే ఆచారం కాశీలో అనుసరిస్తూ ఉన్నాము। కాశికి వెళ్లాలని కోరుకునేవాళ్ళు ఈ స్వామి ని సేవిస్తూ ఉంటే ఆ పరమపావన క్షేత్రం దర్శించగలిగిన అర్హతను స్వామి ప్రసాదిస్తాడు అని కాశి మహత్యం తెలుపుతోంది। అందుకే ఈ అపురూపమైన రోజున ఆ స్వామిని మనకు చేతనైన విధముగా సేవించి ఆ కటాక్షాన్ని పొందుదాం।


More Festivals