అవివాహితుల కోరిక తీర్చే అమ్మ.. కాత్యాయనిదేవి..

దేవినవరాత్రుల ఆరవ రోజు  దుర్గా దేవి రూపమైన కాత్యాయనిని పూజిస్తారు.   కాత్యాయన ఋషి కుమార్తె కావడంతో ఈ అమ్మవారికి  కాత్యాయని అని పేరు పెట్టారు. కాత్యాయనీ మాతను పూజించడం వల్ల వివాహ సమస్యలు తీరుతాయి. ఆ అమ్మ అనుగ్రహంతో తగిన వరుడు దొరకడం,  వివాహానికి అన్ని అడ్డంకులు తొలగిపోవడం జరుగుతాయని నమ్ముతారు. కాత్యాయని దేవి  విజయానికి, కీర్తికి ప్రతీక. శ్రీకృష్ణుడిని పొందేందుకు బృందావనంలో  గోపికలు కాళింది నది ఒడ్డున ఈ అమ్మను  పూజించారని పురాణ కథనం.


కాత్యాయని అమ్మవారి రూపం చాలా గొప్పది,  దివ్యమైనది. అమ్మవారి  రంగు బంగారంలా ప్రకాశవంతంగా  ఉంటుంది. సింహంపై స్వారీ చేస్తున్న అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి, ఆమె ఎడమ చేతిలో కమలం, ఖడ్గం,  ఆమె కుడి చేతిలో స్వస్తిక చిహ్నం,  ఆశీర్వాద చిహ్నం ఉన్నాయి.

 కాత్యాయనీ దేవిని  ఆరాధించడం వల్ల  చేసిన పాపాలు తొలగిపోతాయని అంటారు.  సంపద, ఆధ్యాత్మికతను, కోరికలను,  మోక్షాన్ని ఇలా అన్నింటిని ఈ అమ్మ ప్రసాదిస్తుందని అంటారు.  దేవీ భాగవతం  ప్రకారం ఈ అమ్మవారిని  పూజించేవారికి తేజస్సు పెరుగుతుంది.   గృహస్థ జీవితం ఆనందంగా ఉంటుంది.  సాధకుని రోగాలు, దుఃఖాలు, భయాలు పూర్తిగా నశిస్తాయి. శత్రువులపై విజయం చేకూరడం  కోసం కూడా ఈ అమ్మను పూజిస్తారు. ఈ అమ్మ ప్రతికూల శక్తులను స్వయంగా అంతం చేసే దేవత.

నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున ముందుగా స్నానం,  ధ్యానం చేసిన తర్వాత, కలశాన్ని ఏర్పాటు చేయాలి. మంగళకరమైన రంగుల వస్త్రాలను ధరించి దుర్గా రూపమైన  కాత్యాయనీని పూజించాలి. అమ్మవారికి కుంకుమ, అక్షింతలు, పుష్పాలు మొదలైనవాటితో షోడషోపచార పూజ చేయాలి.  ఆ తర్వాత నైవేద్యం అందించాలి.  నెయ్యి దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి. అమ్మవారిని పూజించడంతో పాటు శివుడిని కూడా పూజించాలి.  ఈ అమ్మకు తేనె  అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మకు తేనె తప్పకుండా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మ సంతోషిస్తుంది. అమ్మకు  పసుపు,  ఎరుపు రంగులు చాలా ఇష్టం.  పూజ సమయంలో ఎరుపు,  పసుపు గులాబీలను సమర్పించాలి. అమ్మవారి మంత్రాన్ని భక్తితో పఠించాలి.

చంద్ర హసోజ్జవల్కర శార్దూల్వర్వాహన |
కాత్యాయనీ శుభాంద్ద్యా దేవీ దానవఘటినీ||

                                           *నిశ్శబ్ద.


More Dasara - Navaratrulu