కార్తీక మాసంలో ఈరోజు చేసే పూజకు సాక్షాత్తూ వైకుంఠ ద్వారాలే తెరచుకుంటాయట..!
కార్తీక మాసం భక్తికి పెట్టింది పేరు.. కార్తీక మాసంలో ప్రతి తిథికి ప్రత్యేకత ఉంటుంది. ప్రతిరోజు దీపాలు వెలిగించడం, హరిహరుల ఆరాధన, కార్తీక స్నానం మొదలైనవి చాలా ముఖ్యమైనవి. అయితే కార్తీక మాసంలో శుక్ల పక్ష చతర్థశి రోజు చేసే పూజ మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో ఎక్కువ శివాలయాలలోనే సందడిగా ఉంటుంది. కానీ ఈ మాసంలో చతుర్థశి నాడు ఉపవాసం ఉండటం, విష్ణువును పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. వైకుంఠ చతుర్థశి అని పిలుచుకునే ఈ రోజు గురించి తెలుసుకుంటే..
కార్తీక శుక్ల చతుర్థశికి వైకుంఠ చతుర్థశి అని పేరు. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరచుకుంటుందట. ఈ రోజు విష్ణుమూర్తి తన భక్తుల పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతున్నారు.
వైకుంఠ చతుర్థశి..
వైకుంఠ చతుర్ధశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి. విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచాలి.
దీపం, అగరబత్తులు, పువ్వులు, తులసి, అక్షింతలు, కర్పూరం, గంగాజలం, పంచామృతం, తీపి పదార్థాలు సమకూర్చుకోవాలి. విష్ణువు ముందు దీపం, ధూపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణుమూర్తి విగ్రహానికి గంగాజలంతో అబిషేకం చెయ్యాలి. ఆ తరువాత పంచామృతంతో అభిషేకం చెయ్యాలి. తరువాత తులసిని సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉండలేని వారు నియమాల ప్రకారం విష్ణువును పూజించాలి.
*రూపశ్రీ.