పదునేడవరోజు పారాయణము
తృతీయాధ్యాయము
మళ్లా చెబుతున్నాడు సూతుడు: పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణునికి నమస్కరించి, 'ప్రాణేశ్వరా! కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతూండగా - తిథులలో యేకాదశీ, నెలలలో కార్తీకమూ మాత్రమే అంతటి యిష్టమయినందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా - నువ్వు రాజిల్లేడు మోము వాడయిన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. 'సత్యా! చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథుచక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను.'
నారద ఉవాచ: పృధుచక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు.
సముద్రనందనుడయిన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవతాది కారాలనూ హస్తగతం చేసుకుని, వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమతమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. "పదవులు పోయినంతమాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమబలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం వుంది గనుక, వేదాలను గూడ తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడయిన ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను ఆకర్షించాడు. కాని యజ్ఞమంత్ర బీజాలతో గూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు గాని, వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ, పూజాద్రవ్యాల్ని సమకూర్చుకొని, మేరు గుహాలయ వాసులయిన దేవతలందరినీ వెంటబెట్టుకుని, వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకమూ కలిసి వివిధ వృత్య వాద్యగీత నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ - కోలాహలం చేస్తూ యోగనిద్రాగతుడయిన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిదురలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలా పూజించి, శరణుకోరారు దేవతలు. శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు.
'మీరు చేసిన సర్వోపచారాలకూ సంతోషించినవాడినై - మీ పట్ల వరదుడి నవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిరోజు తెల్లవారు ఝామున నేను మేలుకొనే వరకూ మీరు ఏ విధంగానయితే సేవించారో - అదే విధంగా - ధూపదీప సుగంధ ద్రవ్యాదులూ, నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ, షోడశోపచారాలతోనూ, కార్తీక శుద్ధ ఏకాదశీ ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరు గాక! వాళ్ళచేత నాకీయబడిన ఆర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే, ప్రతీ కార్తీకమాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్థిల్లును గాక! నేనిప్పుడే మీనావతారుడనై సముద్రప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడెదను గాక! ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీస్నానం - అవబృథ స్నానతుల్యమగు గాక! మరియు, ఓ మహేంద్రా! కార్తీక వ్రతము నాచరించిన వారందరును, నేను వైకుంఠమును, నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగ, పుణ్యలోకములను పొందదగియున్నారు. ఓ వరుణదేవా! కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి, పుత్రపౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలూ అందించు. ఓ కుబేరా! ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటు వంటి వాళ్లందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా! ఎవరీ కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేతా కూడా పూజించతగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో, మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన యీ యేకదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత, ఏకాదశీ వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడంకన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్నీయ గలవేగాని - నా వైకుంఠపదాన్నీయ లేవు సుమా.'
తృతీయోధ్యాస్సమాప్తః (మూడవ అధ్యాయము సమాప్తము)
చతుర్థాధ్యాయము (మత్స్యావతారము)
భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించినవాడై తత్ క్షణమే మహా మత్సశాబకమై - వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేపపిల్లను తన కమండలములో వుంచాడు. మరుక్షణమే ఆ మీనపుకూన పెరిగిపోవడం వలన దానినొకనూతిలో వుంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆశఫరీశిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన, కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో వుంచాడు. కాని విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహా సముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి - శంఖుని వధించి, వాడిని తన చేతి శంఖంగా ధరించి, బదరీవనానికిచేరి, అక్కడ ఎప్పటివలెనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి, 'ఓ మునులారా! వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని వున్నాయి. మీరు వెళ్లి జలాంతర్గతములైన ఆ వేదాలను వెదకి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయోగలో వుంటాను' అని చెప్పాడు. విష్ణ్వాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్లి యజ్ఞబీజాలతో కూడి వున్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా! ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖయైనది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై, ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణ్వాజ్ఞపై ఆ సమస్తవేదాలనూ స్వీకరించిన బ్రహ్మ - ఆ శుభవేళను పురస్కరించుకుని, దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేథయాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్షపన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్ధించారు. 'ఓ దేవాధిదేవా! జగన్నాయకా! మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాధా! నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరమూ యజ్ఞంలోని హవిర్భాగాలనూ పొందాము. కాబట్టి, నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనదీ, నిత్యమూ పుణ్యవర్ధకమైనదీ, ఇహపరసాథకమైనదిగానూ యగుగాక! అదే విధంగా - ఈ కాలం మహా పుణ్యవంతమైనదీ - బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనదీ అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు.'
దేవతల ప్రార్ధనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు. దైత్యారి 'దేవతలారా! మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక! ఇక నుంచి బ్రహ్మ క్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతికాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడీ క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగా - సూర్యసుతయైన కాళిందీ ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే సుస్థితులయ్యెదరు గాక! ఇది తీర్ధరాజముగా ఖ్యాతి వహించుగాక! ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రతయజ్ఞ హోమనార్చనాదులు అనంత పుణ్యఫలదాలైనా సాన్నిధ్యమును అందిచ్చును గాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్రదర్శనమాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేనివాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో, వాళ్ల పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతఃస్నానం చేసిన వాళ్లని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా - సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా! శ్రద్ధాళువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిదిచేసి వుంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడంవల్ల ఏ ఫలం కలుగుతుందో - ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్క రోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్ధ దర్శనమాత్రం చేతనే సర్వులూ తమ పాపాలను పోగొట్టుకున్నవారై - జీవన్ముక్తులవుతారు.'
శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి - బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశల నా క్షేత్రంలో విడిచి __ తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు నృపాలా! ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో - అంతటి పుణ్యాన్నీ కూడా ఈ కథాశ్రవణ మాత్రంచేతనే పొందగలరయ్యా!' అని చెప్పి ఆగాడు నారదుడు.
ఏవం శ్రీ పద్మ పురాణంతర్గత కార్తీక మహత్మ్యమందు
మూడవ, నాలుగవ అధ్యాయములు
17 వ రోజు
నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం
పదనేడవ (బహుళ విదియ) రోజు పారాయణము సమాప్తము