పదునెమిదవరోజు పారాయణము
పంచమాధ్యాయము
నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి, నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాదివిధుల్ని, ఉద్యాపనవిదినీ కూడా యథావిధిగా తెలియజేయవలసిన'దని కోరగా, నలువలియిలా చెప్పసాగాడు.
కార్తీకవ్రత విధి విధానములు __ శౌచము
శ్లో|| ఆశ్విన్యస్యతు మాసస్య యా శుద్దైకాదశీ భవేత్
కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా దతంద్రితః ||
మహారాజా! ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడూ, జాగరూకుడూయై _ ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశీనాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారు ఝూమునే లేచి, చెంబుతో నీళ్ళు తీసుకుని, తూర్పు దిశగాగాని ఊరివెలుపలకి గాని వెళ్ళి, యజ్ఞోపవీతాన్ని చెవికి తగలించుకుని తలకు గుడ్డచుట్టుకుని, ముఖాన్నీ నియమించి, ఉమ్మివేయడం మొదలయినని చేయకుండా మూత్రపురీశాలను విసర్జించాలి. పగలుగాని, సంధ్యలలో గానీ అయితే ఉత్తరాభిముఖంగానూ __ రాత్రుళ్ళుయితే దక్షణాభిముఖంగనూ ఈ అవిశిష్టాన్ని పూర్తీ చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకుని మట్టితోటీ __ శుభ్రం చేసుకుని లింగమందోకసారి, గదమందు మూడుసార్లు నీళ్ళతోనూ, రెండు సార్లు మట్టితోను, అపానమందైదుసార్లు, లింగమందు పదిసార్లు నీళ్ళతోనూ, రెండిటియందునా మట్టితో యేడుసార్లు __ __ ఈ విధంగా గృహస్థులకు శౌఛవిధి చెప్పబడివుంది. ఈ శౌచ౦ బ్రహ్మచారికి దీనికంటే రెండురెట్లు, వనప్రస్థులకు మూడురెట్లుగానూ, యతులకు నాలుగురెట్లుగానూ నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం, ఏ ఆశ్రమం వాళ్ళయినా సరే __ రాత్రిపూటల్లోనో మార్గమధ్యలోనో వున్నవాళ్ళు అందులో సగాన్నీ పాటించాలి. కర, చరణా౦ది శౌచకర్మ చేసుకొన్ని వాళ్ళాచరించే కర్మలేవీ కూడా తత్సలాలనీయవు.
దంతధావనం:
ముఖమార్జనం చేయనివాళ్ళకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి - ముఖమునూ, జిహ్వనూ ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి.
మంత్రం: ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూనిచ
బ్రహ్మప్రజ్ఞాం చ మేథాం చ త్వన్నో దేహివనస్పతే" ||
అనే మంత్రం పఠిస్తూ పాలవృక్ష్యం యొక్క పన్నెండ౦గుళశాఖలో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాసదినాలలోనూ, పాడ్యమి - అమావాస్య - నవమి - పక్ష - సప్తమి - సూర్యచంద్ర గ్రహణాలు - ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళచెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం - ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు.
దంతధావనం తరువాత - భక్తి - నిర్మలబుద్ధీ కలవాడై - గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికిగాని, విష్ణ్వాలయానికి గాని వెళ్ళి - అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలనాచరించి, స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి, నృత్యగీతవాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు, వీళ్లందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ర్పీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా! పృథురాజా ! ఒకానోకసారి నేను శ్రీహరిని దర్శించి "తాతా! నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు" మని కోరాను . అందుకాయన చిన్మయమయిన చిఱునవ్వు నవ్వుతూ_ "నారదా! నేను వైకుంఠంలోగానివుండను. కేవలం నా భక్తులు నన్నిక్కడ కీర్తీస్తూంవుంటారో అక్కడ మాత్రమే వుంటాను. నన్నుకీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలా పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథాలనూ, నాభక్తుల కీర్తనలనూ విని, నిందిస్తారో వాళ్ళే శత్రువులవుతున్నారు" అని చెప్పాడు.
హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు
ఉపయోగించకూడని పూవులు
ఓ రాజా! దిరిశెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు - వీటి పుష్పాలుగాని, తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశెనపూవులు, బండి గురువింద, మాలతి పుష్పాలు - ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నారో - అటువంటివాళ్లు - తులసీదళాలతో వినాయకుడినీ - గరికతో దుర్గాదేవినీ - అవిసె పువ్వులతో సూర్యునీ పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏఏ పూవులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా -
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
'ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీనీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగునుగాక' అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి, పునః క్షమాపణలు చెప్పుకుని, నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీకమాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని, విష్ణుపూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాలనుండి విడివడినవాళ్లై - వైకుంఠాన్ని పొంది తీరుతారు.
పంచమో 2ధ్యాయస్సమాప్తః (ఐదవ అధ్యాయము సమాప్తము)
షష్ఠాధ్యాయము
నారదుడు చెబుతున్నాడు: రాజా! మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి, శుచియై నువ్వులూ, దర్బలూ, అక్షతలు, పువ్వులు, గంధమూ తీసుకుని నదివద్దకు వెళ్ళాలి. చెరువులలోగాని దైవనిర్మితజలాశయాలలో గాని, నదులలోగాని, సాగరసంగమాలలో గాని స్నానం చేస్తే - ఒకదాని కంటే ఒకటి పదిరెట్లు పుణ్యానిస్తుంది. ఏ పుణ్యతీర్ధంలో స్నానం చేసినా - అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి, స్నాన సంకల్పం చేసి, దేవతలకు అర్ఘ్యాలనీయాలి.
ఆర్ఘ్యమంత్రం
శ్లో|| నమః కమలనాభాయ నమస్తే జలశాయినే
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
ఉపరివిధంగా ఆర్ఘ్యాదులనిచ్చి, దైవధ్యాన నమస్కారాదులను చేసి -
'ఓ దామోదరా! ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవును గాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రతస్నాతునడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువు గాక!
స్నానవిధి
ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి - బొడ్డులోతు వరకు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ - యతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య - ఈ ఆరు తిధులలోనూ - నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీరశుద్దికి స్నానం చేసి, ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి.
'భక్తిగమ్యుడైయేవడు దేవకార్యార్ధం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక! విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలును నన్ను పవిత్రుని చేయుదురు గాక! రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక, గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు - ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక!"
ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి - చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ - ఋషి - పితృ - తర్పణాలను విధిగా చేయాలి. కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి, ప్రాతఃకాలానుష్ఠానం (సంధ్యావందనాది) నెరవేర్చుకొని - విష్ణు పూజను చేయాలి. పిదప - ఆర్ఘ్యమంత్రం -
శ్లో|| ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినామమ
గృహాణార్ఘ్యం మయాదత్తంరాధయా సహితోహరే ||
అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్ధ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు -
శ్లో|| తీర్థాని దక్షిణే పాదే వేదాస్త న్ముఖమాశ్రితాః
సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసిమదర్చయా ||
'కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవము లందు సర్వదేవతలలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను' అని అనుకోవాలి. అటుమీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ మాచరించి - 'దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక' అనుకొని - నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్భుద్దీదాయకమూ, పుత్రపౌత్ర ధనప్రదమూ, ముక్తికారకమూ, విష్ణుప్రీతికరమూ అయిన కార్తీక వ్రతాన్ని మించింది, కలియుగంలో మరొకటి లేదు.
ఏవం శ్రీ పద్మ పురాణా౦తర్గత కార్తీక మహత్మ్యమందు
అయిదూ, ఆరు అధ్యాయములు
18 వ రోజు
నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి
పదునెనిమిదవ (బహుళ తదియ) నాటి పారాయణము సమాప్తము