పదునైదవరోజు పారాయణము
ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన, నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. థాత్రీ వృక్షసంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని నేర్పరచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం 'గోవింద' నామస్మరణతో - వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర వీధులనన్నిటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై, తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. 'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః' అంటూ నమస్కరించి దీపారాధలను చేశారు. ధ్యానావాహన ఆసన, ఆర్ఘ్య, పాద్య, ఆచమన, మథుపర్క. స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూపదీప వైవేద్యాదులు, పుష్పహారాలంకరణ, నమస్కారాలనే షోడశోపచారాలతోనూ పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి, దాని మీద శాలివ్రీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి, అర్పించారు.
అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను - సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్త్వనిష్ఠోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము. అజామిళోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, శ్రుత కీర్త్యుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు. తదుపరిని - మునులందరూ కూడి, యజ్ఞ దర్శనార్ధమూ, సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థమూ నైమిశారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు - ఉసిరికలనూ, కార్తీక దీపాలనూ, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్నీ కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనతోనూ, నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై - భక్తి పారవశ్యంతో తన్మయులై, జన్మసాఫల్య సంతృప్తులయ్యారు సూతశౌనకాది ముని ప్రవరులు.
ఏవం శ్రీస్కాందపురాణా౦ తర్గత కార్తీక మహత్మ్యమునందు
పరునైదవ (పౌర్ణమి) రోజు పారాయణము సమాప్తము.