సంపూర్ణ కార్తీక మహాపురాణము
పదునాలుగవ రోజు పారాయణము
ఏకోన త్రింశా2ధ్యాయము
అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో వుండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంత విందారగించి, నా సర్వదోషాలనూ ఉపశమింప చెయ్యి అని ప్రార్ధించాడు. దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి 'రాజా! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కాని బ్రాహ్మణుడనూ, తాపసినీ, నీ కన్నా వయోవృద్దుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని యేమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాభాగ్యం" అని చెప్పి, అతని ఆతిధ్యాన్నీ స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటానార్ధం, పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు. కాబట్టి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి - ద్వాదశినాడు దానాదులను (క్షీరాబ్దిద్వాదశీ వ్రతం) నిర్వర్తించి, బ్రాహ్మణ సమేతుడై, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడంవల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినాకూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు.
ఏకోన త్రింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది తొమ్మిదవ అధ్యాయము)
త్రింశాధ్యాయము
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు - 'మహాభాగా! కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సమపారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడెవరు? దేని వల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు మందులూ అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటీ, అని అడిగారు. అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు - 'మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్ధ క్షేత్రాటనా స్నానాల వల్లా - వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్లా కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమధర్మము. సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్దుడినీ గాను - సమయమూ చాలదు. గనుక - అన్ని శాస్త్రాలలోనూ వున్న - సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్న తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై, నరకదూరులై వుంటారు - హరి ప్రీత్యర్ధులుగా స్నాన, దాన, జప, పూజా, దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెలరోజులూ కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించేవాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతమును చేయని వాళ్ళు - కుల, మత, వయో, లింగభేద రహితంగా -
'అంధతామిత్రము' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు. విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును చేసి, విష్ణ్వర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్ఠము, హరిప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో వుండగా, - కార్తీక, స్నాన, దాన, జప పూజాదులు చేసే వాళ్లు - సర్వదుఃఖ విముక్తులై - మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం. ధన-ఫల-ధాన్య-గృహాది దానాలూ అమిత పుణ్యఫలదాలు. కార్తీకం ముప్పయి రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణం చేసినా కూడా - సకలపాపాలూ? నశించిపోతాయి. సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా కలుగుతాయి.
ఏవం శ్రీ స్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యేమందలి
తింశాధ్యాయః సమాప్తః (ముప్పదియవ అధ్యాయము)
14 వ రోజు
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు :- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :- ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట
పదునాలుగవ (చతుర్దశ దిన) రోజు పారాయణము సమాప్తము