శక్తికీ, ముక్తికీ… సుబ్రహ్మణ్యుడే!
తెలుగునాట సుబ్బారాయుడి షష్ఠిగానూ, తమిళనాట స్కందషష్ఠిగానూ ఎదురుచూసి కొలుచుకునే సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజునే! మార్గశిర శుద్ధ షష్ఠినాడు ఈ పండుగను వైభవోపేతంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరునికి కళ్యాణం జరిపించడం; సుబ్రహ్మణ్యుని ఆలయాలు ఉన్న ప్రదేశంలో తిరునాళ్లు, రథోత్సవాలు చేసుకోవడం పరిపాటి. సుబ్బారావు, సుబ్బారాయుడు, బాలసుబ్రహ్మణ్యం అంటూ మన ఇంట్లో పిల్లలకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని పేరుని రకరకాలుగా పెట్టుకుంటాము. అలాగే ఆయనకీ తన గుణాలను బట్టి వివిధరకాల పేర్లు ఉండనే ఉన్నాయి. ఆ పేర్లని స్మరించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుని జీవిత చరిత్రను తలుచుకుందాము.
దక్షయజ్ఞం తరువాత సతీవియోగుడైన పరమేశ్వరుడు తీవ్రమైన ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాల మీదా పడి విధ్వంసాన్ని సృష్టించసాగాడు. పరమేశ్వరుని తేజస్సుతో పుట్టినవాడు మాత్రమే ఆ తారకాసురుని సంహరించగలడని తేలింది. కానీ శివుడు తీవ్ర వైరాగ్యంతో నిండిన ధ్యానంలో ఉండటంతో ఇక ఆయనకు పుత్రుడు కలిగే అవకాశమే లేదన్న సంబరంలో ఉన్నాడు తారకాసురుడు. దాంతో పరమేశ్వరునిలో ప్రబలంగా ఉన్న వైరాగ్య భావనలను తగ్గించేందుకు కామదేవత అయిన మన్మథుని శరణుకోరారు దేవతలంతా! తన మన్మథబాణాలతో పరమేశ్వరునికి తపోభంగం చేయాలనుకున్నాడు మన్మథుడు. కానీ బదులుగా తానే శివుని కోపానికి గురయ్యాడు. తన ధ్యానాన్ని భంగం చేసిన మన్మథుని భస్మం చేసేందుకు పరమేశ్వరుడు తన మూడో కంటిని తెరవక తప్పలేదు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన శక్తి మన్మథుని భస్మం చేయడమే కాకుండా, ఒక తేజస్సుగా మారింది. ఆ తేజస్సుని అగ్ని కూడా భరించలేక గంగానదిలో విడిచాడు. అక్కడ ఉన్న రెల్లుపొదల వద్ద ఆ తేజస్సు ఒక శిశువుగా మారింది.
రెల్లు మొక్కలని ‘శరం’ అంటారు. అలాంటి రెల్లుపొదలలో పుట్టినవాడు కాబట్టి ‘శరవణుడు’ అయ్యాడు. ఇక శివుని తేజస్సుతో పుట్టడం వల్ల ‘స్కందుడు’ అయ్యాడు. ఆరు ముఖాలతో (షణ్ముఖుడు) అలరారుతున్న శరవణుడిని ఆరుగురు అక్కచెల్లెల్లైన కృత్తిక నక్షత్ర దేవతలు సాకారు. దాంతో ఆయనకు కార్తికేయుడు అన్న పేరు కూడా స్థిరపడింది. శరవణుడు ఓ పక్క కృత్రికల అనురాగంతో పెరుగుతుండగా, శివుడు సైతం తన వైరాగ్యాన్ని వీడి పార్వతిగా జన్మించిన సతిని వివాహమాడాడు. తన తేజస్సుతో జన్మించిన శరవణుడిని వారిరువురూ కైలాసానికి తెచ్చుకున్నారు. అలా పరమేశ్వరుని కుమారుడైన అతడిని ‘కుమారస్వామి’గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక శూలాన్ని ఆయుధంగా ధరించి తారకాసురుని దండించాడు కాబట్టి ‘వేలాయుధన్’గా ప్రసిద్ధికెక్కాడు.
సుబ్రహ్మణ్యేశ్వరుని మనం నాగరూపంలో కూడా పూజిస్తాము. జాతకరీత్యా నాగదోషాలు ఉన్నవారికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించమని సూచిస్తారు. ముఖ్యంగా సంతానలేమి ఉన్నవారు ఈ స్వామిని పూజిస్తే కొంగు బంగారమవుతుందని నమ్మకం. కుమారస్వామి, శివుని సేనలకు సేనాపతి కూడా! అందుకే శత్రుభయం ఉన్నవారు శరవణుడి శరణు కోరితే విజయాన్ని సాధిస్తారు. కుమారస్వామి శక్తిలోనే కాదు యుక్తిలో కూడా అఖండుడే! సుబ్రహ్మణ్యుడు అంటేనే బ్రహ్మజ్ఞానాన్ని ఇష్టడేవాడన్న అర్థం కూడా వస్తుంది. విజయసిద్ధి కోసం, జ్ఞానలబ్ది కోసం కుమారస్వామిని పూజించే సంప్రదాయం ఈనాటిది కాదు. రెండువేల సంవత్సరాలకు ఉన్న తమిళసంగం సాహిత్యంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రసక్తి కనిపిస్తుంది. తమిళనాట ఏ ఊరు చూసినా మురుగన్ (అందమైనవాడు) ఆలయం ప్రముఖంగా కనిపిస్తుంది. అలాంటి కుమారస్వామి ఆలయాలను ఈ పండుగ రోజున దర్శించుకున్నా, వీలుకాకుంటే ఇంట్లోనే పూజించుకున్నా… ఆయన అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
- నిర్జర.