హనుమంతుడిని పూజిస్తే శని దోషం తగ్గుతుందా...
హిందూ మతంలో శనివారం, మంగళవారం రెండు రోజులు హనుమంతుడి పూజకు చాలా శ్రేష్టం అని చెప్తారు. ఈ రోజుల్లో హనుమంతుడికి సింధూరంతో అలంకరించడం, ఆకు పూజ చేయడంతో పాటు చాలా రకాల పూజలు, ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు వడమాల కూడా సమర్పిస్తుంటారు. అయితే హనుమంతుడిని పూజించే వారికి శని బాధలు ఉండవు అని పెద్దలు, పండితులు చెబుతుంటారు. అసలు హనుమంతుడిని పూజించడానికి, శనిదేవుడికి సంబంధం ఏంటి? తెలుసుకుంటే..
పురాణ కథ..
పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు చేరుకున్నాడు. అక్కడ సీతమ్మ వెతుకుతుండగా ఒక చోట శనిదేవుడు బంధించబడి ఉండటం చూశాడు. శనిదేవుడిని ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు ? అని హనుమంతుడు శనిదేవుడినే అడిగాడు. అప్పుడు శనిదేవుడు హనుమంతుడికి కథనంతా చెప్పాడు.
రావణుడు ఒకసారి తన జాతకాన్ని తన జ్యోతిష్కునికి చూపించాడు. రావణుడి జాతకంలో శని చాలా అల్లకల్లోలంగా ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు. దీంతో శని దేవుడినే బంధించి తన దగ్గర బంధీగా పెట్టుకున్నాడు రావణుడు. ఈ విషయం తెలియగానే హనుమంతుడు శనిదేవుడిని రక్షిస్తానని మాట ఇస్తాడు. లంక దహనం చేసిన సమయంలో శనిదేవుడిని విడిపించి దూరంగా కొండల మధ్యకు తీసుకెళ్తాడు. అక్కడ కొందరు ఋషుల సహాయంతో శనిదేవుడికి ఒళ్లంతా నూనె పూసి శనిదేవుడి ప్రాణాలు కాపాడతాడు. అప్పుడు శనిదేవుడు స్వయంగా.. నిన్ను పూజించే భక్తులను నేను కష్టపెట్టను అని హనుమంతుడితో చెబుతాడు. ఈ కారణంగా హనుమంతుడిని పూజించే వారిని శని దేవుడు బాధపెట్టడు. అంతేకాదు.. శనివారం నాడు శని దేవుడితో పాటు హనుమంతుడిని పూజించే ఏ భక్తుడైనా శని దేవుడి కోపం నుండి ఉపశమనం పొందుతాడని, ఆ భక్తుడి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని శని దేవుడే చెప్పాడు. శని దేవుడి ప్రాణాలు నిలబెట్టిన నూనె అనేది శనిదేవుడికి చాలా ఇష్టం. ఎల్లప్పుడూ తనను నువ్వుల నూనె లేదా ఆవనూనెతో అభిషేకించే వారి కర్మలను సులువుగా దాటిపోయేలా చేస్తాడు.
*రూపశ్రీ.
