రోజుకు రెండుసార్లు సముద్రంలో మునిగే దేవాలయం గురించి తెలుసా!

భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, మరికొన్ని రహస్యాలతో నిండి ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో స్తంభేశ్వర్ పరమేశ్వర ఆలయం కూడా ఒకటి. ఆ ఆలయం రోజులో రెండు సార్లు సముద్రంలో మునిగిపోతుంది. కళ్లముందే ఆలయం మునిగిపోవడం ఎంతో ఆశ్చర్యంగా, మరెంతో విచిత్రంగా కూడా అనిపిస్తుంది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
స్తంభేశ్వర దేవాలయం..
ఒక భవనం లేదా దేవాలయం ముందు నిలబడి ఉండగా, అది అకస్మాత్తుగా మాయమైపోతే అదెంత ఆశ్చర్యకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, దీని రహస్యం ఏమిటి? అని వెంట వెంటనే మనసులో ఎన్నో ప్రశ్నలు కూడా పుడతాయి. ఇలాంటి ఆలయం గుజరాత్ లో ఉంది. గుజరాత్‌లోని కవి కంబోయ్ గ్రామంలో ఉన్న స్తంభేశ్వర మహాదేవ్ ఆలయమే అది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యద్భుతమైన ఆలయాలలో ఒకటి , ఈ ఆలయానికి చెందిన అతిపెద్ద రహస్యం.. ఈ ఆలయం రోజుకు రెండుసార్లు సముద్రపు అలలలో మునిగిపోయి బయటి నుండి కనిపించదు.
పరమేశ్వరుడు పూజలు అందుకునే ఈ ఆలయం ఆటుపోట్ల సమయంలో అరేబియా సముద్రంలో మునిగిపోతుంది , నీరు తగ్గిన వెంటనే తిరిగి కనిపిస్తుంది. ఈ దృశ్యం భక్తులకు నిజంగా ఒక అద్భుతం. దీని గురించి మరింత తెలుసుకుంటే..
ఆలయ కథ..
స్తంభేశ్వర మహాదేవ ఆలయ కథ స్కంద పురాణంలో వర్ణించబడింది. ఈ ఆలయం దేవతలు , రాక్షసుల కాలంలో నిర్మించబడిందట. శివుని భక్తుడైన తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత, శివుని కుమారుడైన కార్తికేయుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. శివుని క్షమాపణ కోరడానికి , తారకాసురుడి సంహారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దీనిని నిర్మించారట. రోజుకు రెండుసార్లు సముద్రమే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తుందని, ఆ సమయంలో ఆలయం పూర్తిగా సముద్రపు నీటిలో మునిగిపోతుందని నమ్ముతారు.
ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోయి, జీవిత కష్టాల నుండి విముక్తి పొందుతారట. ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని శివుడు కూడా ఈ ఆలయానికి వరం ఇచ్చాడట. ఈ నమ్మకం నేటికీ కొనసాగుతోంది.
సముద్రంలో ఎందుకు మునిగిపోతుంది?
స్తంభేశ్వర మహాదేవ ఆలయానికి సముద్రంతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. రోజుకు రెండుసార్లు, ఈ ఆలయం భారీ అలల తాకిడికి మునిగిపోతుంది, కేవలం ఆలయం పైభాగం మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ, ఆలయం క్రమంగా తిరిగి పైకి తేలి, సూర్యకాంతిలో ప్రకాశిస్తుంది.
భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని ఒక దివ్యమైన , గాఢమైన ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే భక్తులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. నేటికీ ఈ ఆలయ రహస్యాన్ని భక్తులు దైవ లీలగా భావిస్తారు
*రూపశ్రీ.


