రావణుడి బంగారు లంక గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు!

రామాయణ కాలంలో రావణుని లంక యొక్క వైభవం, శోభ గురించి విస్తృతంగా ప్రస్తావించేవారు. గొప్ప కవి అయిన వాల్మీకి రచించిన వాల్మీకి రామాయణంలోని సుందరకాండ నాలుగవ అధ్యాయంలో ఈ బంగారు నగరం గురించి అందమైన, ప్రామాణికమైన వర్ణన ఉంటుంది. మహా పరాక్రమవంతుడైన హనుమంతుడు, సీతను వెతుకుతూ లంకినిని ఓడించి లంకలో ప్రవేశించినప్పుడు, అక్కడి దృశ్యాన్ని చూసి విస్మయం చెందాడు. దీనిని గురించి మరింత వివరంగా.. రావణుడి లంక గురించి చాలామందికి తెలియని నిజాలు తెలుసుకుంటే..
వాల్మీకి రామాయణం ప్రకారం, త్రికూట పర్వత శిఖరంపై వెలసిన ఈ నగరం ఎంత వైభవంగా ఉండేదంటే, దాని విశాలమైన రాజభవనాల కిటికీలు, గవాక్షాలు ఎంతో విలువైన వజ్రాలతో పొదగబడి ఉండేవట. ఇక రావణ లంకలోని రహదారులన్నీ రావణుని స్తోత్రనాదాలతో నిండిపోయేవట. ఎన్నో ఇళ్లలో రాక్షసులు వేద మంత్రాలను పఠిస్తూ, స్వయంగా వేదాధ్యయనం చేసేవారట. ఆ నగర భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండేదంటే, కేవలం దాని కేంద్ర ప్రాంతాన్ని రక్షించడానికి మాత్రమే లక్షకు పైగా సుశిక్షిత సైనికులతో కూడిన సైన్యాన్ని నియమించారట.
రావణుడి రాజభవనం ఎలా ఉండేదంటే..
వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఉన్న అద్భుతమైన వృత్తాంతం ప్రకారం, రావణుని ప్రధాన రాజభవనం ఏడు అంతస్తుల ఎత్తులో ఉండి, దట్టమైన బంగారు గోడలతో చుట్టుముట్టబడి ఉండేదట. హనుమంతుడు అక్కడ లెక్కలేనన్ని విలువైన రథాలను, ఏనుగులను, గుర్రాలను , రత్నఖచిత పల్లకీలను చూశాడట. ఆ రాజభవనం లోపలే అందమైన కళా ప్రదర్శనశాలలు, క్రీడా మైదానాలు , బంగారు విగ్రహాలు ఉండేవట.
కుబేరుడి పుష్పక విమానం..
రాజభవన ప్రాంగణంలో రావణుడు కుబేరుని నుండి లాక్కున్న దివ్యమైన పుష్పక విమానం ఉండేదట. దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ విమానాన్ని బ్రహ్మదేవుని కోసం నిర్మించాడట. అది బంగారం , విలువైన రాళ్లతో తయారు చేయబడి, సూర్యునిలా ప్రకాశించేదట. అది మనసు వేగంతో ఎగిరేదట, దాని రూపకల్పన ఆకాశంలోని విమానాల కంటే కూడా మరింత అద్భుతంగా ఉండేదని వాల్మికీ రామాయణంలో వర్ణించాడు.
సీత కోసం వెతుకుతున్న హనుమంతుడు రావణుని అంతఃపురానికి, అంటే పడకగదికి చేరుకున్నప్పుడు, తాను స్వర్గానికి వచ్చినట్లు భావించాడట. నేల మీద ఒక అద్భుతమైన, పెద్ద తివాచీ పరచి ఉందట. రావణుడు తనకున్న బోలెడు మంది అందమైన రాణులచే చుట్టుముట్టబడి, తన మంచం మీద నిద్రపోతున్నాడట.
రావణుడికి ఉన్న శాపం..
వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు తనకున్న శాపం కారణంగా ఏ స్త్రీ అనుమతి లేకుండా ఆమెను తాకడు. రావణుడి మంచం ఏనుగు దంతాలు, బంగారం, వైడూర్య రత్నాలతో పొదిగిన స్ఫటిక పీఠంపై నిర్మించబడిందట. మంచం పైన ఒక తెల్లని, దివ్యమైన గొడుగు వేలాడుతూ ఉండేదని. గది అంతా అత్యంత సువాసనగల పరిమళంతో నిండి ఉండేదని వాల్మికి వర్ణించాడు.
ఇదే పడకగదిలో హనుమంతుడు మండోదరి ఒక అందమైన మంచం మీద నిద్రించడం చూశాడు. మండోదరి సౌందర్యం ఎంత దివ్యంగా ఉందంటే, ఒక క్షణం పాటు ఆమె సీత ఏమోనని హనుమంతుడు అనుకున్నాడట. కానీ మరుక్షణమే, శ్రీరామునికి దూరమైన సీత, రావణుని రాజభవనంలో ఎన్నడూ ఇంత సౌకర్యంగా నిద్రపోదని అతనికి అనిపించింది.
ఆ తర్వాత హనుమంతుడు రాజభవనంలోని సత్రానికి వెళ్ళాడట, అది రకరకాల మాంసం, వంటకాలు , మధ్యపానంతో నిండి ఉంది. అక్కడ నిద్రపోతున్న స్త్రీలను చూసి హనుమంతుడు కొంచెం భయపడ్డాడు, కానీ తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని చెప్పుకుంటూ తనను తాను శాంతపరుచుకున్నాడు.
రాజభవనాలలో సీత జాడ కనిపించకపోవడంతో, హనుమంతుడు చివరకు అశోకవనానికి బయలుదేరాడు. వాల్మీకి రామాయణం ప్రకారం ఈ తోట దేవతల నందనవనం కంటే కూడా మరింత అందంగా ఉండేదట. ఇందులో పువ్వులు, పండ్లతో నిండిన లెక్కలేనన్ని చెట్లు, తామర పువ్వులతో నిండిన స్వచ్ఛమైన నీటి కొలనులు ఉండేవట. ఈ తోట మధ్యలో హనుమంతుడు ఒక పెద్ద ఆలయాన్ని చూశాడట.
తోట మధ్యలో ఉన్నఆలయానికి వెయ్యి స్తంభాలు ఉండేవట, దాని మెట్లు పగడాలతో చేయబడ్డాయట , దాని బలిపీఠాలు స్వచ్ఛమైన బంగారంతో పూత పూయబడ్డాయట. ఈ ఆలయం క్రిందనే, దీనస్థితిలో కూర్చున్న సీతామాతను హనుమంతుడు గుర్తించాడట. ఈ విధంగా వాల్మీకి రామాయణంలోని ఈ కథ మొత్తం రావణుని లంక నిజంగానే అద్భుతమైనదని నిరూపిస్తుంది.
*రూపశ్రీ.


