పంచముఖీ మాతా గాయత్రి నమోస్తుతే!!

దుర్గా నవరాత్రుల సందడిలో మూడవ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనం ఇస్తుంది. వేదాలకు అధిపతి, త్రిసంధ్యలతో వాక్శుద్ధిని చేకూర్చే శక్తి రూపిణి. బ్రహ్మదేవుడు సృష్టికార్యం కోసం సమాధి స్థితిలో ఉండగా అతడి శరీరం సగం స్త్రీ రూపం, సగం పురుష రూపం అయిందని ఆ స్త్రీ రూపానికే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని వ్యవహారమని మత్స్యపురాణం చెబుతోంది. పంచ ముఖాలలో అగ్ని ఆమెకు ముఖమని, బ్రహ్మ శిరస్సని, విష్ణువు హృదయమని, రుద్రుడు శిఖ అని శృతులు గాయత్రి స్వరూపమని చెబుతారు. 

అయితే శక్తి స్వరూపమైన గాయత్రి దేవి మంత్రం ఇంకా ఎంతో  ప్రసిద్ధి చెందిన వేదమంత్రం.  "గయాన్‌ త్రయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లే.

లాజిక్ గా చెబితే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు. ఈ ప్రపంచంలో 19 రకాల కదిలే కదలని వస్తువులున్నాయి. వీటికి 5 మూలకాలను కలిపితే 24 అంకె ఏర్పడుతుంది. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలకు కారణమదే. త్రిపుర దహనంలో ఈ మంత్రాన్ని శివుడు తన రథానికి పైన కట్టుకున్నాడు. 

గాయత్రి గొప్పతనం : ఒక్కసారి గాయత్రిని ఉచ్చరిస్తే అప్పుడు చేసిన పాపాలు తొలగిపోతాయని, 10 సార్లు ఉచ్చరిస్తే ఆ రోజు చేసిన పాపాలు పోతాయని, అంటే 100 సార్లు ఉచ్చరిస్తే ఓ నెలలో చేసిన పాపాలు, 1000 సార్లు ఉచ్ఛరిస్తే ఓ సంవత్సరం చేసిన పాపాలు, ఓ లక్షసార్లు ఉచ్చరిస్తే జీవితకాలపు పాపాలు, 10 లక్షల సార్లు చేస్తే ఇంతకు ముందు జన్మలో చేసిన పాపాలు, 100 లక్షల సార్లు ఉచ్చరిస్తే అన్ని జన్మల పాపాలు పోతాయి మోక్షం లభిస్తుంది. ఇక్కడ సంఖ్యను బట్టి పాపం పోవడం అనేది కొందరికి కెవ్వు తెప్పించవచ్చు. కానీ ఇందులో అర్థం ఏమిటి అంటే మనిషి తన ఆరోగ్యానికి అప్పటికప్పుడు ఒక మందు బిళ్ళ వేసుకుంటే అప్పటికప్పుడు కాస్త ఉపశమనం లభిస్తుంది, కానీ తరువాత మళ్ళీ సమస్య వస్తుంది. కొన్ని రోజులు మందులు వాడి వదిలిపెడితే, ఆ వాడినన్ని రోజులు మనిషి బాగుంటాడు. కానీ మళ్ళీ సమస్య తిరగబెట్టచ్చు. అందుకే జబ్బు తగ్గే వరకు మందు అనేది అవసరం. అలాంటిదే ఈ గాయత్రి మంత్రం కూడా.  ప్రతిరోజు ప్రతి ఒక్కరు ప్రశాంత చిత్తంతో గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనుషుల్లో ఎంతో గొప్ప మార్పు చోటుచేసుకుంటుంది. ఈ మంత్రం జపించేవాళ్లకు  రాజ- పిశాచ రక్కసి- అగ్ని- జల- వాయు- గురు మొదలైన భయాలు ఏమి ఉండవని చెబుతారు.

ఇంతటి శక్తివంతమైన మంత్రం, ఈ మంత్రానికి అధిదేవత అయిన గాయత్రిదేవి అలంకారంలో  ఈ దుర్గా నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారు దర్శనమిస్తారు. గాయత్రి మాత కరుణా కటాక్షాలకు పాత్రులై మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం!!

◆ వెంకటేష్ పువ్వాడ

 


 


More Dasara - Navaratrulu