రాజస్థాన్‌లో దసరా ఇలా...

దసరా... విజయదశమి... భారతదేశంలోని అనేక ప్రాంతాలలో భక్తి విశ్వసాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే చాలా ముఖ్యమైన పండుగ. మిగతా పండుగల విషయం ఎలా వున్నా, దసరా వచ్చిందంటే చాలు... దసరా వచ్చిందయ్యా... సరదా తెచ్చిందయ్యా అంటూ పిల్లలు పెద్దలు, ముఖ్యంగా మహిళలు ఉత్సాహభరితమైన మానసిక స్థితిలోకి వచ్చేస్తారు. దసరా పండుగకి మూడు పౌరాణిక సందర్భాలు కలసి వస్తాయి. వీటిలో ఒకటి రాముడు రావణుడిని సంహరించిన రోజు. రెండోది పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకుని, జమ్మి చెట్టు మీద దాచి వుంచిన తమ ఆయుధాలను కిందకి దించి ఉత్తర గో గ్రహణాన్ని నిరోధించిన రోజు. ఇక మూడవది లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత పదిరోజుల యుద్ధం అనంతరం సంహరించిన రోజు. ముచ్చటగా మూడు పౌరాణిక ప్రాధాన్యాలున్న ఈ రోజును దేశమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ వుంటుంది. ఈ నేపథ్యంలో విజయదశమి పర్వదినాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో చూద్దాం.

విజయదశమిని అత్యంత వైభవంగా జరుపుకునే రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్ రాజపుత్రుల జన్మస్థానం. ఇక్కడ ఏ పనిచేసినా రాజసంగా వుంటుంది. వైభవంగా వుంటుంది. ఆ రాజసం, వైభవం విజయదశమి వేడుకల నిర్వహణలో కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ వుంటుంది. శక్తి వున్నవాడే రాజు. అత్యంత శక్తివంతులైన రాజపుత్రులకు నిలయమైన రాజస్థాన్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా శక్తికి అధిదేవత అయిన జగన్మాతను పూజిస్తారు. వీరులు తమ ఆయుధాలను జగన్మాతకు సమర్పిస్తారు.

విజయదశమి నవరాత్రులను దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వున్నట్టే రాజస్థాన్‌లోనూ జరుపుతారు. అమ్మవారికి రోజుకోరకం అలంకారం చేస్తారు. రాజస్థాన్ సంప్రదాయమైన రంగురంగుల బట్టలు ధరించిన భక్తులు అమ్మవారిని సందర్శించుకుంటారు. విజయదశమి వేడుకలలో ప్రతిరోజూ రాజస్థానీ జానపద నృత్యమైన ‘గుమార్’ ప్రదర్శించడం ఆనవాయితీ. స్త్రీ పురుషులు రంగురంగుల బట్టలు ధరించి, తాము నిల్చున్న చోటనే గిర్రుగిర్రుమంటూ తిరుగుతూ చేసే గుమార్ నృత్యం దసరా వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వుంటుంది. తొమ్మిది రోజులు అమ్మవారికి రకరకాల అలంకారాలు చేయడంతోపాటు దసరా వేడుకల చివరి రోజున రావణ, కుంభకర్ణ, మేఘనాథ భారీ బొమ్మలను దహనం చేయడం కోలాహలంగా జరుగుతుంది.

రాజస్థాన్‌లో దసరా వేడుకలు జరిపే విషయంలో అగ్రస్థానంలో నిలిచేది ‘కోట’ అనే  పట్టణం. కోటలో దసరా సందర్భంగా అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. పట్టణమంతా మేళాలు జరుగుతూనే వుంటాయి. ఈ పది రోజులూ కోట ప్రజలు దసరా పండుగను తప్ప మరో విషయాన్ని పట్టించుకోరంటే అతిశయోక్తి కాదు. పలువురు కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. దసరా వేడుకల ముగింపు రోజు రావణ సంహార ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అదేరోజు 75 అడుగుల ఎత్తున నిర్మించిన రావణ, కుంభకర్ణ, మేఘనాథ బొమ్మలను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ‘జై సియారామ్’ అనే నినాదాలు కోట అంతటా మార్మోగుతాయి.

 

రాజస్థాన్‌లో శతాబ్దాలుగా విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ వస్తు్న్నాయి. ఎంతకాలంగా వేడుకలు జరుగుతున్నా ఏడాది ఏడాదికి భక్తులలో భక్తి, ఉత్సాహాలు పెరుగుతూనే వున్నాయి. రాజస్థాన్‌లో దసరా వేడుకలు ప్రతి ఏడాదీ కొత్త శోభను సంతరించుకుని వైభవంగా జరుగుతూనే వుంది.


More Dasara - Navaratrulu