చండిక ఎలా ఆవిర్భవించింది!
మేధా ఋషీంద్రుడు దేవీ మహత్యాన్ని వివరించిన వైనం ఇలా సాగుతుంది...
రాక్షసులకు మహిషాసురుడు, దేవతలకు పురందరుడు రాజులుగా ఉన్నారు. ఇద్దరి మధ్యా ఉన్న వైరం తార స్థాయికి చేరి ఘోర యుద్దం ఆరంభమైంది. ఆ యుద్దం ఒకపట్టాన ముగియలేదు. అనేక సంవత్సరాలపాటు కొనసాగింది. కానీ చివరికి రాక్షసులు గెలిచి, దేవతలే ఓడిపోయారు. దాంతో రాక్షస రాజు మహిషాసురుడు దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని, దేవేంద్రుని సింహాసనం అధిష్టించాడు.
ఇంద్రునితో సహా దేవతలందరికీ ఘోర పరాభవం జరిగింది. వారంతా బ్రహ్మదేవుని నాయకత్వంలో శివకేశవుల వద్దకు వెళ్ళి తమ బాధలను వివరిస్తూ రాక్షసులు తమను ఎన్ని కష్టాలు పెడుతున్నారో , వారి దౌర్జన్యం ఎంత పెచ్చుమీరిందో, తాము ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో వివరించారు. ఇక ఆ అవమానాలు భరించలేమని, తమను రక్షించాలని మొర పెట్టుకున్నారు.
దేవతలు చెప్పిందంతా వినేసరికి శివకేశవులకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. కిం కర్తవ్యం అనుకున్నారు. త్రిమూర్తులు ఆలోచించారు. వారి క్రోధం ఆలోచనల వెల్లువైంది. మహిషాసురుని హతమార్చడానికి ఒక మూర్తిని సృష్టించాలి అనుకున్నారు. ప్రతిఫలంగా చండిక రూపకల్పన జరిగింది.
చండికను కల్పించాలి అనే ఆలోచనకు అంకురార్పణ జరగడం ఆలస్యం త్రిమూర్తుల ముఖాల నుండి మూడు మహా తేజో పుంజాలు బహిర్గతం అయ్యాయి. ఆ మూడు తేజస్సులు కళ్ళు మిరుమిట్లు గొలిపేంత బ్రహ్మాండంగా ఉన్నాయి.
చండిక రూపకల్పన సమయంలో మహేంద్రుడు మొదలైనవారి దేహాదుల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తర్వాత దేవతలందరి శరీరాల నుండి కూడా తేజస్సు రాశులుగా బహిర్గతం అయింది. అటు త్రిమూర్తులు, ఇటు తక్కిన దేవతల నుండి వెలువడిన మహా తేజస్సు అంతా కలిసి ఒక స్త్రీ రూపం అవతరించింది. సహజంగానే ఆ నారీమూర్తి మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలూ ప్రకాశవంతమయ్యాయి. అలా మూర్తీభవించిన వదనంలో శివ తేజస్సు, కేశాలలో యమ తేజస్సు, చేతుల్లో విష్ణుమూర్తి కాంతి, జఘనంలో వరుణ కాంతి, నితంబ భాగంలో పృథ్వి తేజము, ఇంకా బ్రహ్మదేవుడు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అష్ట వసువులు తదితర సర్వ దేవతల ప్రకాశాలు కలిసి అసమాన ప్రతిభావంతురాలిగా ఏర్పడింది. ఆ దివ్య రూపమే చండిక.