అన్నపూర్ణే... సదా పూర్ణే...
శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశమంతా దేవీ ద్యానంలో నిమగ్నమైపోయింది. సికింద్రాబాద్ ఆనందబాగ్ లోని శ్రీ సత్యసాయి - షిరిడిసాయి - లలిత దేవి దేవాలయము లో కూడా నవరాత్రి పూజలు కళ్ల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు ముక్తికారిణి అయిన ఆ ముకుందుని సోదరిని... అన్నపూర్ణగా అలంకరించారు! సువాసినిపూజ , సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణాలతో అమ్మను ఆరాధించారు....
దసరా ఉత్సవాలలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణి కోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధి భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి.
ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించినరసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లివరంగా ఇస్తుంది.
పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. అమ్మవారికి దద్థ్యన్నం, కట్టెపొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.