ముండేశ్వరి దేవాలయం.. ఇక్కడ మేకలను బలి ఇస్తారు.. కానీ రక్తపాతం జరగదు..
ఈ ఆలయం ఎక్కడంటే..!

జంతు బలి దైవారాధనలో ఒక భాగం. కొందరు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి జంతు బలి ఇవ్వడం చేస్తుంటారు. ఏదైనా కోరిక తీరినప్పుడు లేదా మొక్కుబడులు తీర్చుకోవడం కోసం చాలామంది గ్రామ దేవతలకు బలి ఇస్తుంటారు. కేవలం గ్రామ దేవతలకే కాకుండా శక్తి ఆరాధనలో కొన్ని ప్రాంతాలలో జంతు బలి ఉంటుంది. ఇాలాంటి ఆలయాలలో శ్రీ ముండేశ్వరి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ దేవతకు మేకలను బలి ఇస్తారు. కానీ రక్తపాతం ఉండదు. ఈ విచిత్రమైన దేవాలయం ఎక్కడుంది? ఈ దేవాలయపు విశేషాలేంటి? తెలుసుకుంటే..
ముండేశ్వరీ దేవాలయం..
బీహార్‌లోని కైమూర్ జిల్లా ఎత్తైన కొండలలో ముండేశ్వరి దేవత నెలకొని ఉంది. దాదాపు 2,000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది. భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ముండేశ్వరీ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయ వాస్తు అద్భుతం అని చెబుతుంటారు. ఇక్కడ రక్తపాతరహిత బలుల సంప్రదాయం చాలా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడికి వచ్చే భక్తులు ఒక అతీంద్రియ శక్తిని, ఒక రహస్య భావనను అనుభవిస్తారని చెబుతారు. ఈ దేవాలయంలో ఒక అదృశ్య శక్తి ఉందని, అది ఆ అమ్మవారి శక్తేనని చెబుతుంటారు. ముండేశ్వరిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
బలి సంప్రదాయం..
ముండేశ్వరి ఆలయ సంప్రదాయాలలో అత్యంత ఆసక్తికరమైన వాటిలో ఒకటి రక్తపాతరహిత యజ్ఞం. ఇది భారతదేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. మేకలను బలి ఇచ్చినా, ఈ ప్రక్రియలో ఎలాంటి రక్తపాతం ఉండదు.
మేకలను అమ్మవారి ముందు పడుకోబెడతారు. అయితే మేకలను బలి ఇవ్వడం అనేది కేవలం మంత్రబద్దంగా జరుగుతుంది. మేకల మెడ మీద అమ్మవారి పూలను ఉంచుతారు. అక్కడి పూజారి మంత్రాలను పఠిస్తూ ఉంటారు. ఈ సమయంలో మేకలు స్పృహ తప్పి ఉంటాయి. ఈ చర్య జరుగుతున్నంత వరకు అవి అక్కడి నుండి లేవవు, ఎక్కడికి పారిపోయే ప్రయత్నం కూడా చేయవు. సుమారు కొన్ని నిమిషాల పాటు సాగే ఈ ప్రక్రియ తర్వాత మేకలు వాటికవే స్పృహలోకి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఏదో అదృశ్య శక్తి అక్కడ పనిచేస్తోందనే నమ్మకాన్ని ఈ ప్రక్రియ బలపరుస్తుంది. రక్తపాత రహిత బలిని చూడానికి దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.
శక్తి అనుభవం..
ఈ క్షేత్రాన్ని దర్శించేవారికి ఆ ప్రాంతంలో శక్తి అనుభూతి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఒకరకమైన నిశ్శబ్దం, ప్రశాంతత, దేవత లోని అద్బుతమైన శక్తిని పరిచయం చేస్తుంది.
చరిత్ర ఆధారాలు..
భూగర్భ శాస్త్ర అధ్యయనాలు , పురావస్తు ఆవిష్కరణల ప్రకారం ఇది సుమారుగా రెండవ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తోంది. ఈ ఆలయం అష్టభుజి ఆకారంలో నిర్మితమై ఉంది. ఇలాంటి నిర్మాణం భారతీయ ఆలయ వాస్తుశిల్పంలో అరుదైనదిగా పరిగణించబడుతుంది, గోపురం వెంబడి ఉన్న దేవతామూర్తుల క్లిష్టమైన రాతి శిల్పాలు దీనికి ఒక సమ్మోహనమైన రూపాన్ని అందిస్తాయి.
శక్తి, ఆరాధన..
ఈ ఆలయం ఒకప్పుడు తంత్ర సాధన , శక్తి ఆరాధనకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి దేవతలో ఉండే శక్తి కారణంగా ఏ రాక్షస శక్తి కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించలేకపోయిందని స్థానిక జానపద కథలు తెలుపుతున్నాయి.
పెరుగుతున్న దేవాలయ ప్రాముఖ్యత..
ముండేశ్వరి ఆలయం బీహార్‌లోనే కాకుండా భారతదేశం అంతటా ఒక ప్రధాన విశ్వాస కేంద్రంగా మారింది. నవరాత్రులైనా లేదా ప్రత్యేక ఆచారాలైనా, ఈ ఆలయం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది, ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం తమకు అసాధారణమైన శాంతిని, సానుకూల శక్తిని ఇస్తుందని సందర్శకులు చెబుతారు. ముండేశ్వరి అమ్మవారు తంత్రానికి అధిదేవత అని, భక్తులను అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని ఒక ప్రధాన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను కూడా చేపడుతోంది.
*రూపశ్రీ.



