శివుడు నందిమీద కాదు.. కప్ప మీద ఆసీనుడై ఉన్న ఈ ఆలయం గురించి తెలుసా!

ప్రపంచ వ్యాప్తంగా పరమశివుడికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి.  ప్రతి ఆలయం వెనుక ఒక చరిత్ర,  పురాణ కథనాలు,  ఆలయం రూపుదిద్దుకున్న కథనాలు ఉంటాయి.  సాధారణంగా పరమేశ్వరుడి ఆలయం అంటే ఎదురుగా నంది ఉంటుంది. పరమేశ్వరుడు కూడా నందినే వాహనంగా ఉపయోగిస్తాడు.  కానీ ఉత్తర ప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది.  ఇక్క పరమేస్వరుడు కప్ప మీద ఆశీనుడై ఉంటాడు.  కప్ప గుడి  అని కూడా పిలువబడే ఈ ఆలయం గురించి, ఆలయ రహస్యాల గురించి తెలుసుకుంటే..

నర్మదేశ్వర మహదేవ్ ఆలయం..

నర్మదేశ్వర మహాదేవ్ ఆలయం ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఓయల్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం లఖింపూర్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో లఖింపూర్-సీతాపూర్ రహదారిపై ఉంది. ఈ ఆలయం ఒక పెద్ద కప్ప ఆకారంలో ఉన్న వేదికపై నిర్మించబడింది, అందుకే దీనిని "కప్ప గుడి" అని కూడా పిలుస్తారు.

ఎవరు నిర్మించారంటే..

ఓయల్ సంస్థానానికి చెందిన రాజా బక్ష్ సింగ్ ఈ ఆలయాన్ని 1860 , 1870 మధ్య నిర్మించారు. దీని వెనుక ఒక ప్రసిద్ధ గాథ ఉంది, దాని ప్రకారం చాహమాన వంశానికి చెందిన రాజా బక్ష్ సింగ్ పాలనలో తీవ్రమైన కరువు ఏర్పడింది. రాజు శివ భక్తుడు, ఒక తాంత్రికుడి సలహా మేరకు "మండూక తంత్రం" ఆధారంగా ఈ ఆలయాన్ని కప్ప ఆకారంలో నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని వరదలు, కరువుల నుండి రక్షించడమే ఈ ఆలయం యొక్క ఉద్దేశ్యం. అందువల్ల, ఓయల్ పట్టణంలోని నర్మదేశ్వర మహాదేవ ఆలయం ఆ పట్టణ ఆనందం , శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఆలయ ప్రత్యేకతలు..

ఈ ఆలయం రాజస్థానీ వాస్తుశిల్పం ఆధారంగా రూపొందించబడినది.   ఈ వాస్తు నిర్మాణ శైలి చాలా ప్రసిద్ధ చెందింది.  ఈ ఆలయం ఒక భారీ కప్ప ఆకారంపై నిర్మించబడింది, దాని పైన శివాలయం కొలువై ఉంది.

ఇక్కడ శివుడు నంది మీద కాకుండా, ఒక కప్ప వీపు మీద కూర్చుని దర్శనమిస్తాడు. ఇక్కడ ఆ కప్పనే పూజిస్తారు.

ఇతర శివాలయాలలో నందీశ్వరుడు కూర్చున్న భంగిమలో ఉంటాడు. కానీ ఈ ఆలయంలో నంది నిలబడి దర్శనమిస్తాడు, ఇది ఈ దేవాలయంలో ఉన్న ఒక విశిష్టత అని చెబుతారు.

ఈ ఆలయం మాండూక తంత్రం ఆధారంగా నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని నర్మదా నది నుంచి తీసుకువచ్చారని, ఈ శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుస్తుందని నమ్ముతారు.

                               *రూపశ్రీ.


More Punya Kshetralu