• Prev
  • Next
  • నేను - యాక్సిడెంటూ - 4

    Listen Audio File :

    ఆరోజు ఆఫీసులో క్రితం రోజు శెలవు ఉన్నవాళ్ళు అడిగారు ఏమైందని. మళ్ళీ వాళ్ళందరికీ విపులంగా జరిగింది చెప్పాల్సి వచ్చింది. క్రితం రోజు యాక్సిడెంటు గురించి చెప్పడంలో ఉన్న ఉత్సాహం ఆరోజు లేదు, ఎవడైనా కట్టు వంక చూసి అడిగితే చాలు గూబ పగలకొట్టాలని పిస్తుంది. పది నిమిషాలకోసారి ఎవడో ఒకడు అడుగుతూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక నాకోసం గుమ్మంలో చంచల్రావు ఎదురుచూస్తూ కనబడ్డాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది.

    “అడిగావంటే తంతా" అన్నాను రూమ్ తాళం తీస్తూ.

    చంచల్రావు నవ్వాడు. ఎందుకురా అంతకోపం.... నేనేం డబ్బులు అప్పు ఇవ్వమని అడగడానికి రాలేదు.... నీకు యాక్సిడెంటు అయ్యిందని ఎవరో చెప్తే చూద్దామని వచ్చాను. అవునూ ఎలా అయ్యింది?” అన్నాడు కట్లవంక జాలిగా చూస్తూ.

    నేను స్పృహతో కుప్పకూలిపోయాను, వారం రోజులపాటు ఇలా నరక యాతన అనుభవించాను అందరికీ చెప్పలేక. వారం తరువాత నా కట్లు విప్పేశారు, నేను తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంకా ఒంటిమీద కట్లు కనిపించవు కాబట్టి ఎవరూ యాక్సిడెంటు గురించి అడగరు. కట్లు విప్పేశారు కాబట్టి ఆ రోజు ఆఫీసుకి స్కూటర్ మీద వెళ్ళాను. నా సెక్షనులో పని చేసుకుంటుండగా నా దగ్గరికి పక్క డిపార్టుమెంట్లోని విశ్వనాథం వచ్చాడు.

    “నేను పదిరోజుల క్రితం ఊరెళ్ళాను. ఈ వేళే జాయిన్ అయ్యాను. రాగానే చెప్పారు. నీకు పోయినవారం యాక్సిడెంటయిందటగా"... ఎలాగయింది?”

    నేను కోపంతో, బాధతో, భయంకరంగా అరిచాను, “ఈ......”

    విశ్వనాథం తెల్లబోయాడు. “పాపం... యాక్సిడెంటు వల్ల మతి స్థిరం కాస్త తప్పినట్టుంది....” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

    ఇంకా ఆ రోజంతా ఆఫీసులో వారం రోజులుగా రానివాళ్ళు “నీకు యాక్సిడెంట య్యిందటగా మేం ఆఫీసులో లేనప్పుడు, ఎలాగయింది” అని అడగడం మొదలు పెట్టారు.

    నాకు పిచ్చెక్కిపోయింది. సాయంత్రం స్కూటర్ మీద ఇంటికెళ్తున్నాను. వెధవలు... నాకు యాక్సిడెంటయితేనేం.. చస్తేనేం వీళ్ళకెందుకు? ప్రతి ఒక్కడికి వివరాలు కావాలి. ఆఫీసులో ఇంతసేపూ చంపుకుతిన్నారు. తరువాత ఇంటికెళ్లాక కాలనీలో చంపుకు తింటారు. బజార్లో ఎక్కడ కనబడితే అక్కడ తెలిసన వాళ్ళందరూ అడుగుతారు. ప్రాణాలు తీస్తారు....... ఛీ. కోపంతో జుట్టుపీక్కున్నా స్కూటరు హాండిలు వదిలేసి... అలా రెండుక్షణాలేఅంతే.... ఎదురుగుండా లారీ దూసుకువస్తోంది.

    మరో పక్కనుండి ఈసారి పంది అడ్డువచ్చింది. గబుక్కున హాండిలు పట్టుకున్నా.... బ్యాలెన్సు తప్పింది.... “క్రీ.... ఈ...... ష్... నేను మెల్లగా కళ్ళు తెరిచాను. నేను ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను, ణా చుట్టూ. ణా పరిచయస్తులు, ఆఫీసుస్టాప్ నా ముఖంలోకి ఆతృతగా చూస్తున్నారు. యాక్సిడెంటు ఎలాగాయిందో తెలుసుకుందామని.....

  • Prev
  • Next