• Prev
  • Next
  • సినిమాకో కథకావాలి - 2

    Listen Audio File :

    లిల్లీ చంచల్రావు వైపు వయ్యారంగా రెండడుగులు వేసింది.

    “ఏయ్... ఏటే అది?..... రమ్మనగానే ఎల్లిపోవడమే.... అక్కడే కూర్చో... ఏంటయ్యా నీ వాలకం సూత్తంటే నీకు సినిమా శాన్సు అక్కర్లేదులా వుంది..... కొరకొరా చూస్తూ అన్నాడు భేతాళరావు.

    చంచల్రావు నాలుక కొరుక్కుని చెంపలేస్కున్నాడు. “క్షమించండి... మీకు ఇబ్బంది లేకుండా చూద్దామనే అలా అన్నానుగానీ వేరే దురుద్దేశం ఏమీ లేదండీ.....”

    లిల్లీ భేతాల్రావు పక్కన కూర్చుంది.

    “చాలా కాలం నుంచీ నా దగ్గర సెగట్రీగా పని చేస్తుంది కదా.... అందుకే కూసింత సనువొచ్చి అలా నా ఒళ్ళో కూర్చుంటా వుంటాది... హిహిహి.... సంజాయిషీ ఇచ్చుకుంటూ అన్నాడు భేతాళరావు.

    “చనువొస్తే అంతే కదండీ మరి?..... ఈ వేళ నేను మీకు పరిచయం అయ్యానా...? రేపు మళ్ళీ కలిశామనుకోండి... ఆనక ఎల్లుండి ఇంకోసారి కలుస్తున్నామనుకోండి.. అలా మాటిమాటికి కలుస్తున్నామనుకోండి … అప్పుడు నాకూ చనువొస్తుంది....” అన్నాడు చంచల్రావు సంబరంగా..

    “అంటే నువ్వు కూడా నా ఒళ్ళో కూర్చుందామనా?.... ఏంటి నీ ఉద్దేశం?...ఆ....?.....” అన్నాడు భేతాళరావు కోపంగా చూస్తూ.

    ముందు చంచల్రావు ఆనందంగా అవునన్నట్టు తల ఊపి తరువాత భేతాళరావు ముఖం చూసి నాలుక్కర్చుకుని చెంపలేస్కున్నాడు. “క్షమించండి... ఏది పొరపాట్న అన్నాను.”

    “ఊ.. ఇంతకీ నిన్నెందుకు పిలిపించానో తెల్సా?... అన్నాడు విలాసంగా కాలుమీద కాలేసి ఊగిస్తూ భేతాళరావు.

    “తెలుసండీ.... మీరు తీయబోయే సినిమాకి కథ కావాలి! అంతే కదా" అన్నాడు చంచల్రావు బ్యాగ్ జిప్ తెరుస్తూ.

    “ఏంటదీ... అదెందుకు తెరుస్తున్నావ్ ?” కంగారుగా అడిగాడు భేతాళరావు

    “దీన్నిండా నే వ్రాసిన కథలు తెచ్చానండీ. మీకు వినిపిద్దామనీ" ఉత్సాహంగా చెప్పాడు చంచల్రావు.

    భేతాళరావు ఘోల్లున నవ్వాడు. లిల్లీ కిచకిచా నవ్వింది. చంచల్రావు తెల్లబోయి చూశాడు. “లేకపోతే ఏంటయ్యా?.... కతలు తెచ్చావా?.. అయి మాకు సదివి వినిపిస్తావా?... ఎవడైనా వింటే నవ్వుతాడు. నీకు మా సిన్మాలో హీరో హీరోయిన్లు ఎవరోతెల్సా.?” అన్నాడు

    భేతాళరావు నవ్వుతుంటే కారిపోతున్న చొంగని తుడుచుకుంటూ. “తెలీదండీ...” అయోమయంగా చెప్పాడు చంచల్రావు.

    “మరి తెలీకుండా ఏకతని మాకు ఇనిపిస్తావయ్యా? అయినా ఇలా ముందుగా రాసిన కతలు మాకు పనికిరావయ్యా.... మేం బుక్ చేసిన హీరో హీరోయిన్లకు సరిపడేలా కథని ఇప్పటికిప్పుడు అల్లాల! మా బామ్మర్ది నువ్వేదో గొప్ప రచయితని, పత్రికల్లో యడాపెడా కతలు రాసేస్తుంటావ్ అని చెప్తే నిన్ను పిలిపించాను... నీకు బొత్తిగా అనుభవం లేదేందయ్యా... ఆ...?”

    “పోన్లే డాళింగూ... సిన్మాకి రాయడం అనుభవం లేదనుకుంటా.... మనం చెప్తే మనకి కావాల్సిన విధంగా ఆయన రాస్తారులే...” అంది లిల్లీ వయ్యారంగా.

  • Prev
  • Next