• Prev
  • Next
  • సినిమాకో కథకావాలి - 3

    Listen Audio File :

    భేతాళరావు దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు. “మన బొమ్మలో కిరణ్, తారశ్రీని హీరో హీరోయిన్లుగా బుక్ చేశామయ్యా. మరి ఆళ్ళకి తగినట్టు కత రాయాల!...”

    చంచల్రావు ఓసారి మెడచాపి, దగ్గి, గొంతులో కిజ్ కచ్ అంటే ఓ దగ్గుబిళ్లేస్కుని గొంతు సవరించుకుని "ఒకూళ్ళోనేమో ఒక రామయ్య వున్నాడంటా... ఏదో వూళ్లో సీతమ్మ వుందంటా.... మరేమో వాళ్ళిద్దరూ ఒకే కాలేజీ అంటా....”

    భేతాళరావు కంగారు పడిపోయాడు. “ఆగాగు... ఏటా కత సెప్పడం? ఆ...? నువ్వేదో తాతయ్య అయినట్టూ... మేం నీ మనవళ్ళం అయినట్టూ. ఇట్టా లాభంలేదు..... కత సెప్తె సిన్మా చూసినట్టుండాలా!”

    లిల్లీ కిచకిచా నవ్వింది.

    చంచల్రావు మళ్ళీ మెడ పైకి చాపి దగ్గి గొంతు సవరించుకున్నాడు.

    “ఆగు.... అప్పుడే కత సెప్పమాకు. స్టోరీ డిస్కషన్ లో మా వాళ్ళంతా కూడా వుండాల. ఆళ్ళు సెంటర్ దాకా ఎల్లారు. ఇప్పుడే వస్తారు" అన్నాడు భేతాళరావు.

    ఒక అయిదు నిమిషాల తరువాత భేతాళరావు బామ్మర్ది భంభులింగం, తమ్ముడు కూర్మారావు, డైరెక్టర్ ఎల్లారావు, అసిస్టెంటు డైరెక్టరు పుల్లారావు గదిలోకి బిలబిలా వచ్చారు. భేతాళరావు చంచల్రావుకి అందర్నీ పరిచయం చేశాడు.

    "ఆ... ఇంక కూర్చుందామా.....?” అన్నాడు భేతాళరావు బామ్మర్ది శంభులింగం.

    "కూర్చుందాం.... కూర్చుందాం.... “ అన్నాడు కూర్మారావు సంబరంగా.

    “మొదలెడ్దాం.... హిహిహి....” పుల్లారావు మెలికలు తిరుగుతూ అన్నాడు.

    చంచల్రావు మెడచాపి ఓమారు దగ్గి గొంతు సవరించుకున్నాడు.

    “ఏంటి గొంతు సవరించుకుంటున్నావ్? మొదలెడ్దాం అంటే స్టోరీ డిస్కషన్ అనుకుంటున్నావా...? కాస్సేపు దాని పక్కన పెడ్దాం....” అన్నాడు డైరెక్టర్ ఎల్లారావు చంచల్రావుతో.

    శంభులింగం బెల్ నొక్కి రూమ్ బాయ్ ని పిలిచాడు. “ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి....” అన్నాడు డైరెక్టర్ ఎల్లారావు.

    “నాకు బీర్....."

    “నాకు విస్కీ, సోడా...”

    “నాకు బ్రాందీ...” ఎవరికీ కావాల్సినవి వాళ్ళు టకటకా చెప్పేస్తున్నారు.

    “నాకు వైన్ కావాలి!” చివరగా లిల్లీ అంది.

    “ఆఖరికి నువ్వుకూడా ఆర్డర్ వేశావా....? దిక్కుమాలిన స్టోరీ డిస్కస్సు కాదుగానీ.... సినిమాకి పది లచ్చలైతే ఈ వ్యవహారాలన్నింటికీ ఇరవై లచ్చలవుద్ది" నెత్తిన గుడ్డేసుకున్నాడు భేతాళరావు..

    ఓ పావుగంట తరువాత సీసాలు, మిక్చర్, జీడిపప్పులూ, వగైరా వగైరా వచ్చాయ్.

    “ఊ.... సూత్తారేం ….? కానియ్యండి పళ్ళు బిగపడ్తూ అన్నాడు భేతాళరావు. రెండు రౌండ్లయ్యాయి.

    “ఆ... ఇంక ఇప్పుడు చెప్పవయ్యా కథేంటో" అన్నాడు డైరెక్టర్ ఎల్లారావు.

    చంచల్రావు మెడ మరోసారి సాగదీసి ఓసారి దగ్గి గొంతు సవరించుకుని కథ చెప్పసాగాడు. “సినిమా ఒక కాలేజీ యూనివర్సిటీ ఫంక్షన్ తో స్టార్ట్ అవుతుంది.... ముందు ఒక డాన్సు డ్రామా వుంటుంది. అందులో గోపీ పాటకి ప్రైజివ్వాలో లేదా రాధ డాన్సుకి ప్రైజివ్వాలో అర్ధం కాదు... చివరికి ఇద్దరికీ ఫస్టు ప్రైజిస్తారు. అంతేకాదు. గోపికి చదువులో, ఆటల్లో, పాటల్లో అన్నింటిలోను ఫస్టు ప్రైజ్ వస్తుంది....” వింటున్న అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తృప్తిగా తలలూగించారు.

    “ఇంకేముందు రాధ గోపీ చేతుల్లోని వెండి కప్పులన్నీ చూసి గోపీని ఆరాధనగా ప్రేమగా చూస్తుంది....”

    “హా... రాధ గోపీని ప్రేమిస్తుందా?” భేతాళరావు గుండెలమీద చేయ్యేస్కుని కళ్ళింతింత చేస్కుని అడిగాడు.

    “ఆ సుబ్బరంగా ప్రేమిస్తుంది.... అన్నింట్లోనూ తెలివైన వాడు.... బుద్ధి మంతుడూ.... పైగా అందగాడు.... ప్రేమించక ఏం చేస్తుంది....?” అన్నాడు చంచల్రావు.

    అంతే.... వింటున్న అందరూ ఘోల్లున నవ్వారు.

    చంచల్రావు అయోమయంగా చూశాడు. “ఏం కతయ్యా అది...? ఆ...?” చొంగ తుడుచుకుంటూ అడిగాడు భేతాళరావు.

    'సినిమాకి కథ రాయడం ఇదే కదా మొదలు... పాపం వేళాకోళం ఆపండి డార్లింగూలు.... ఆయన భాదపడ్తారు.....” అంది లిల్లీ నవ్వుతున్న అందర్తో.

    “నువ్వు సెగట్రీ నాకా లేకపోతే ఇక్కడున్న అందరికీనా.....” అందర్నీ డార్లింగులని అంటావేం....? ఆ....?” కయ్ మంటూ లేచాడు భేతాళరావు.

    “నువ్వు చెప్పవోయ్ అసిస్టెంటూ...” కులాసాగా అన్నాడు డైరెక్టర్ ఎల్లారావు.

    “ఏమయ్యా.... అలా వెంటనే ప్రేమించేస్తే సస్పెన్స్ ఏముంటుందయ్యా...? చూసేవాళ్లు హీరోయిన్ ప్రేమిస్తుందా లేదా అని ఊర్కె తెగ ఇదయిపోయి సస్పెన్స్ లో కొట్టుకుని చావాలి.... ఈ... ఎలా చెప్తావో చెప్పు మరి" అన్నాడు అసిస్టెంటు డైరెక్టర్ పుల్లారావు. చంచల్రావు ఓ నిమిషంపాటు సీలింగు వంక చూసి ఆలోచించి

    "ఊ..... వినండి" అన్నాడు.

  • Prev
  • Next