• Prev
  • Next
  • నేనూ - యాక్సిడెంటూ

    Listen Audio File :

    రోజులాగానే ఆఫీసు కెళ్దామని బస్ స్టాండుకొచ్చాను. అక్కడి దృశ్యం చూస్తే నాకు చాల ఆశ్చర్యం ఆనందం వేసింది. ఎందుకంటే బస్ స్టాండులో అస్సలు జనం లేరు. రోజూ జనాన్ని తోసుకొని బస్సు ఎక్కాల్సి వచ్చేది. నేను బస్ స్టాండులో నించున్నాను... అయిదు... పది... పదిహేను నిమిషాలైంది. ఒక్క బస్సు కూడా రాలేద. అప్పుడు గమనించాను... జనం రోడ్లమీంచి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు.

    నాకు అనుమానం వచ్చింది. రోడ్డుమీద వెళ్ళే ఒకతన్ని ఆపి అడిగాను. ఆర్టీసీ స్ట్రయిక్ కదా ఈ వేళ అన్నాడు. నేను పనిచేసే ఆఫీసు చాలా దూరం . బస్సు లు లేవు... అంతదూరం నడిచి వెళ్ళడం కష్టం. అందుకని ఆటోని పిలిచాను.

    వాడు "మనిషికి అయిదు రూపాయలివ్వాలి" అన్నాడు. “నేను ఒక్కడినేకదా?... మనిషికి అయిదు రూపాయలంటావేం...” అన్నాను.

    “అర్రె... గదేంమాట... గిప్పుడు ఒక్కడివే ఉన్నావ్.. జర్ర సేపైతే వేరోళ్లు రారా... ఆళ్ళన్ బీ ఎక్కించుకుంటా....” అన్నాడు వాడు రుసరుస చూస్తూ. అంటే నాతో బాటు మరో ఇద్దర్ని ఎక్కుంచుకుంటావన్నమాట... ముగ్గురికి మూడైదులు పదిహేను రూపాయలా?....

    "మీటరేస్తే నాల్రూపాయలే కదయ్యా అవుతుంది" అన్నాను గుండెలమీద చేయ్యేస్కుంటూ.

    “అర్రె ఇస్కీ. గట్ల గుండెలమీద చెయ్యేసుడేంది ….. గట్ల పరేషానౌతే నువ్వేం ఆటో ఎక్కుతావ్ సాబ్!” అన్నాడు. ఇంకా ఏమైనా మాట్లాడితే నా పరువుతీస్తాడని ఆటో ఎక్కి కూర్చున్నా. వాడు మాత్రం మిగతా రెండు బేరాలు తగిలేదాకా కదల్లేదు. మిగతా యిద్దరూ దొరకడానికి పదిహేను నిమిషాలు పట్టింది. అప్పుడు కదిలింది ఆటో.

    ఆఫీసుకు వెళ్ళేటప్పటికి బాగా ఆలస్యం అయిపొయింది. మా ఆఫీసరు నాకు బాగా చివాట్లు పెట్టాడు. ఆర్.టి.సి వాళ్ల స్ట్రయికు వారం రోజులు జరిగింది. కండక్టర్లు టిక్కెట్టు కొట్టకుండా డబ్బులు తిన్నా ఏమనకూడదు. చెకింగులు చెయ్యకూడదని స్ట్రయికు. చివరికి కండక్టర్లే గెలిచారు. ఈ వారంరోజులు ఆఫీసుకు వెళ్ళడానికి చాలా బాధలు పడ్డాను. డబ్బులు ఖర్చుపెట్టడమేకాక ఆటో వాళ్ళతో నానా రకాలుగా బాధలు పడాల్సి వచ్చింది. బస్సులున్నా అంతే. అవి టైంకి రావు. వచ్చినా బస్ స్టాపులో ఆగవు.

    “ఇన్ని బాధలు పడేకంటే ఏ స్కూటరో మోటార్ సైకిల్ కొనుక్కోరాదు?” అంటూ నా స్నేహితుడు చంచల్రావు సలహా ఇచ్చాడు.

    'నీ సలహా బాగుంది గానీ మరి డబ్బుల్లో?” అన్నాను.

    “ఆఫీసులో లోను పెట్టు....”

    వాడి సలహా నచ్చింది. మా ఆఫీసులో స్టాఫ్ కి ఒకేరకం లోన్ ఇస్తారు. అది పర్సనల్ లోన్. దాన్ని పెళ్ళి చేసుకోడానికి గానీ, మీద ఆధారపడిన వాళ్ళ పెళ్ళిళ్లు చేయడానికి గానీ, అంటే చెల్లెళ్లు, కూతుళ్ళ పెళ్ళిళ్ళు అన్నమాట. దానికే ఇస్తారు. ఆలోచన రాగానే దాన్ని ఆచరణలో పెట్టేశాను. లోను ఆప్లికేషను ఫారం పూర్తిచేసి శాంక్షన్ చేసినట్టు సంతకం పెట్టుంచుకోడానికని మా ఆఫీసరు గదిలోకి వెళ్ళాను. అప్లికేషన్ని ఆయన ముందుంచాను.

    “ఏంటది?” అన్నాడాయన కళ్లెగరేస్తూ.

    నేను చెప్పాను.

    “వాహ్హాట్!!... ఈమధ్యనే కదా నువ్వొక మ్యారేజీలోన్ పెట్టావ్?” అన్నాడు. “

    ఆ మ్యారేజీ లోన్ మా చుట్టాలాయన ఎవరికో డబ్బు అవసరం అయి నన్ను సర్దమంటే పెట్టానండీ...”

    మరి పోయిన సంవత్సరంకూడా ఒక మ్యారేజీలోన్ పెట్టినట్టున్నావ్?

    “ఆ మ్యారేజిలోన్?”

    “ఈ మ్యారేజీలోన్ స్కూటరు కొంటానికి పెట్టానండీ.....” అన్నాను.

    వెరీ నైస్ … వెరీ నైస్.. అయితే ఇక ముందు ఆఫీసుకు ఆలస్యంగా రావన్నమాట...” అనేసి నా ఆప్లికేషను లోన్ శాంక్షన్ చేసినట్టు రాసి సంతకం చేసేసాడు.

    లోన్ డబ్బు చేతికి అందింది.

  • Prev
  • Next