• Prev
  • Next
  • అందరూ దొంగలే - 94

    Listen Audio File :

    దొంగలందర్నీ పోలీసులు వ్యాన్లలో ఎక్కించారు. మంగులు కమీషనర్ లింగారావ్ కూర్చున్న జీపులో వెనుకవైపు కూర్చున్నాడు. జీపు.... దాని వెనకాల వ్యాన్లు! ఒకదానివెంట ఒకటి ముందుకు కదిలాయి. అవన్నీ కలిసి రాకా డెన్ దగ్గరికి వెళ్ళి ఆగాయ్.

    కమీషనర్ లింగారావ్ తో సహా అందరూ తుపాకులతో డెన్ లోకి హడావిడిగా వెళ్ళారు. మంగులు దగ్గర మాత్రం ఇద్దర్ని కాపలా పెట్టారు. ఒక పది నిమిషాలలో అక్కడి దొంగలను కూడా బయటికి తీసుకొచ్చి వ్యాన్లలో ఎక్కించారు.

    చివరగా కమీషనర్ లింగారావ్, రాంబాబు రాకాని జీపుదాకా తోస్కుంటూ వచ్చి "ఎక్కు....” అన్నారు.

    రాకా జీపు వెనుకనుండి ఎక్కుతూ కాస్త ఆలస్యం చేసేసరికి "త్వరగా ఎక్కరా!” అంటూ రాంబాబు రాకా నడ్డిమీద ఓ తన్ను తన్నాడు.

    ఆ దెబ్బకి రాకా జీపులో మంగులు ముందు బోర్లాపడ్డాడు. తలెత్తి చూసిన రాకాని మంగులు క్రూరంగా నవ్వుతూ చూశాడు. అప్పుడే రాకా మెడలో వేళ్ళాడుతున్న చైన్ దానికున్న లాకెట్ మంగులు కంటపడింది. రాకా బోర్లాపడ్డప్పుడు అది అతని షర్టులోంచి బయటపడింది. మంగులు ఉలిక్కిపడ్డాడు. తన చెయిన్ రాకా మెడలోకి ఎలా వెళ్ళింది?!.... తన షర్ట్ కాలర్ దగ్గర చేత్తో ముందుకు లాగి లోపలోకి చూస్కున్నాడు. తన చెయిన్ తన మెడలోనే వుంది. లాకెట్ చాతీమీద వెళ్ళాడ్తూ ఉంది! రాకా క్రింది నుండి లేచి సీటుమీద కూర్చున్నాడు, జీపు ముందుకు కదిలింది. మంగులు తన షర్ట్ లోంచి చైన్ ని బయటికి లాగి రాకాకి చూపించాడు.

    రాకా మొహంలో ఏంతో ఆశ్చర్యం! “అర్రే... అచ్చు గుద్దినట్టు నా చైన్ లాగానే వుందే.. లాకెట్ కూడా అలానే వుంది" అన్నాడు ఆశ్చర్యంగా.

    మంగులు గబగబా తన చైన్ లాకెట్ ని రెండు చేతుల్తో పట్టుకుని ఓపెన్ చేశాడు. అందులో ముప్పై సంవత్సరాల క్రితం ప్రజల్ని గడగడ లాడించిన గజదొంగ రంగన్న ఫోటో వుంది. దాన్ని చూసి రాక ఇంకా ఆశ్చర్యపోయాడు. “గజదొంగ రంగన్న ఫోటో నీ లాకెట్ లో ఎందుకుంది?”

    “రంగన్న మా నాన్న....” అన్నాడు మంగులు.

    “తమ్ముడూ!” అంటూ రాకా మంగుల్ని కౌగిలించుకున్నాడు.

    “అదేంటి నన్ను 'తమ్ముడూ' అంటున్నావ్?” ఆశ్చర్యంగా అడిగాడు మంగులు.

    “నా లాకెట్ లో కూడా గజదొంగ రంగన్న ఫోటోనే వుంది.....” రాకా తన లాకెట్ ని విప్పి చూపించాడు.

    అందులో సేమ్ మంగులు లాకెట్ లో వున్నలాంటి ఫోటోనే వుంది. “రంగన్న నాకు కూడా నాన్నే!....” అన్నాడు రాకా.

    “అన్నయ్యా!” అంటూ మంగులు రాకాని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ సీన్ చూసి కమీషనర్ లింగారావ్ కూడా ఆనంద భాష్పాలు రాల్చారు.

    “ఈ రోజు మీరెందుకో ఓవర్ సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు సార్" అన్నాడు రాంబాబు కమీషనర్ లింగారావ్ తో.

    రాంబాబు, చిన్నారావ్ లు విల్సన్ ఇంటికి వెళ్ళారు. తోటపని చేస్తున్న తన్ని "ఏయ్ మాలీ! అయ్యగారున్నారా?” అని అడిగాడు రాంబాబు.

    “నేనే అయ్యగార్ని" అన్నాడు మాలి రూపంలో వున్న విల్సన్ నవ్వుతూ.

    రాంబాబు, చిన్నారావ్ లు ఉలిక్కిపడ్డారు. “నువ్వే అయ్యగారివా?.... అయితే విల్సన్ అంకుల్ ఎక్కడికెళ్ళిపోయారు? నువ్వు అమ్మగార్ని ఎప్పుడు పెళ్ళి చేస్కున్నావ్?” కంగారుగా అడిగాడు.

    అబ్బా... నేనేనయ్యా బాబూ విల్సన్ ని. ప్రస్తుతం నేను ఈ మొహంతో ఉన్నా....” అన్నాడు విల్సన్ విసుక్కుంటూ.

  • Prev
  • Next