• Prev
  • Next
  • అందరూ దొంగలే - 92

    Listen Audio File :

    “ఒరేయ్... నాకిదేం ఖర్మ పట్టిందిరో.... ఇది నా ప్రాణాలు తీస్తుందిరో....” అంటూ ఘోల్లుమని ఏడుస్తున్నాడు గజదొంగ మంగులు.

    మంగులు నడ్డిమీద కూర్చుని ఛల్ ఛల్ గుర్రం.... అంటూ బెల్టుతో మంగుల్ని కొడ్తూ ఆడుకుంటుంది దీప.

    “దీనివల్ల మనకి పైసా లాభంలేదు. దీన్ని అనవసరంగా యింటికి తీస్కోచ్చాడు బాస్" అన్నాడు డేవిడ్ మంగులు వంక జాలిగా చూస్తూ.

    “ఏంటీ?.... ఇలా?!... పవిత్రమైన ఈ డెన్ నీకు ఇల్లులా కన్పిస్తుందా? డెన్ ని ఇంటితో పోల్చడానికి నీకు మనసెలా ఒప్పిందిరా?” బాధగా అన్నాడు మంగులు.

    డేవిడ్ సిగ్గుతో తల దించుకున్నాడు. “సారీ బాస్....” అన్నాడు మెల్లిగా.

    “ఏయ్ గుర్రం.... ఆగిపోయావేం? ముందుకు నడువ్.... ఛల్...” అంటూ బెల్టుతో మంగులు డొక్కమీద చెళ్ళుమనిపించింది దీప.

    “హబ్బా! ఎంతపని చేశావే పిల్లకుంకా...” బాధగా అన్నాడు మంగులు.

    “పాపా! నీకు చాక్లెట్లు కావాలా?” అని దీపని అడిగాడు మంగులు బాధ చూడలేని జాకబ్.

    “నాకు చాక్లెట్లు కావాలి... ఇస్క్రిం కావాలి.. బిస్కెట్లు కావాలి. అన్నీ కావాలి!” అంది దీప బెల్టుతో మళ్ళీ మంగులు డొక్కమీద చెళ్ళుమనిపిస్తు.

    “హబ్బా!....” బాధగా మూలిగాడు మంగులు.

    “సరే... అన్నీ ఇస్తాను... దా...” అన్నాడు జాకబ్.

    దీప మంగులు నడుం మీదినుండి క్రిందకి దూకి జాకబ్ దగ్గరికి పరుగున వెళ్ళింది.

    “చూశారా బాస్..... దీప బారినుండి మిమ్మల్ని ఎలా రక్షించానో....” గొప్పగా అన్నాడు జాకబ్.

    మంగులు లేచి నిలబడ్తూ "జాకబ్... ఓసారి దగ్గరికి రామ్మా! నీకు ఇనాం యిస్తాను" అన్నాడు.

    జాకబ్ ఉత్సాహంగా మంగులు ఎదురుగా నిలబడి "థాంక్యూ బాస్.....” అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా నిలబడుతూ.

    “ఇదిగో తీస్కో నీ ఇనాం...” మంగులు చాచిపెట్టి జాకబ్ చెంపమీద కొట్టాడు.

    అతను వెనక్కి తూలిపడ్డాడు.

    “అది గంటనుండీ నా మీదెక్కి సవారీ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేశావ్. ఈ పని ఇందాకే ఎందుకు చెయ్యలేదు?” అన్నాడు మంగులు.

    “సారీ బాస్....” అన్నాడు జాకబ్ లేచి నిలబడి చెంప రుద్దుకుంటూ.

    “ఒరేయ్! నాకు చాక్లెట్లూ బిస్కెట్లూ అన్నీ ఇస్తానన్న వాడిని ఎందుకు కొట్టావ్ రా? నువ్విలా రా... నీతో ఉయ్యాలాటాడ్తాను....!!” అంది దీప మంగులుతో యమ సీరియస్ గా.

    అది విని మంగులు బాధగా జుట్టుపీక్కున్నాడు. “లాభంలేదు... దేన్ని త్వరగా వదుల్చుకోవాల్సిందే...” అంటూ రిసీవర్ తీసి కమీషనర్ లింగారావ్ ఇంటి నెంబర్ డయల్ చేశాడు.

    అవతల శ్రీ లక్ష్మి ఫోన్ ఎత్తి "హలో.... " అంది.

    “కమీషనర్ లింగారావ్ వున్నాడా?” అడిగాడు మంగులు.

    “లేరు. మీరెవరు?” అడిగింది శ్రీలక్ష్మి.

    “మంగులు... గజదొంగ మంగులు....”

    “మా దీపని కిడ్నాప్ చేసిన మంగులువే కదూ?”

    “అవును. నేను లింగారావ్ తో 10 లక్షలు ఇస్తే దీపని ఇస్తానన్నా. కానీ నా రేటు తగ్గించుకుంటున్నా. ఎంతోకొంత ఇచ్చి త్వరగా దీపని తీస్కెళ్ళమని ఆయన ఇంటికొస్తే చెప్పు...”

    “ఎంతోకొంత ఏంట్రా.... బాగానే ఇద్దామని నీ దగ్గరకే బయలు దేరారు" అంది శ్రీలక్ష్మి.

    “నా దగ్గరకా? నా అడ్రసు లింగారావ్ కి తెలీదే?!......” ఆశ్చర్యంగా అన్నాడు గజదొంగ మంగులు.

    "నీ అడ్రస్ నాకు తెలిసిపోయిందోచ్.........!" అని వెనుకనుండి ఓ గొంతు పలికింది.

    మంగులు వెనక్కి తిరిగి చూశాడు.

    కమీషనర్ లింగారావ్ వెనకాల షుమారు యాభైమంది పోలీసుల్తో హాలు మధ్యలో నిలబడి వున్నాడు. పోలీసులంతా తుపాకులు గురిపెట్టి రెడీగా వున్నారు.

    మంగులు చేతిలోని రిసీవర్ జారిపోయింది.

  • Prev
  • Next