• Prev
  • Next
  • అందరూ దొంగలే - 91

    Listen Audio File :

    రాంబాబు, చిన్నారావ్ లు డిటెక్టివ్ పాండు దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు.

    “ఎవడ్రా నువ్వు? మా దీపని మంగులుకి ఇచ్చావు?” అంటూ డిటెక్టివ్ పాండు కాలర్ పట్టుకున్నాడు.

    ఊహించని ఈ సంఘటనకి డిటెక్టివ్ పాండు ఖంగు తిన్నాడు. దానికి తోడు రాంబాబు ఇన్స్ పెక్టర్ యూనిఫాంలో వున్నాడు.

    “నేను క్రిమినల్ కాను ఇన్స్ పెక్టర్! ఇదిగో నా ఐడెంటిటీ కార్డ్!” అంటూ జేబులోని ఐడెంటిటీ కార్డ్ తీసి రాంబాబుకి చూపించాడు.

    అది చూసిన రాంబాబు చాలా ఆశ్చర్యపోయాడు. “డిటెక్టివా? నువ్వూ... మీరు డిటెక్టివ్ అయివుండి ఈ పని ఎలా చేశారు?” అని అడిగాడు.

    “ఏ పని?” కన్ ప్యూజ్ అవుతూ అడిగాడు డిటెక్టివ్ పాండు.

    “ఏ పని అని అమాయకంగా అడుగుతున్నారా? మీరు మంగులు లాంటి డేంజరస్ దొంగకి దీపని ఇచ్చారంటే, మీకూ అతనికి ఏదో లింక్ వుండే వుంటుంది", ఆవేశంగా అన్నాడు చిన్నారావ్.

    ఈలోగా అక్కడికి అసిస్టెంటు రాజు వచ్చాడు. “ఏం జరిగింది సార్?” అని డిటెక్టివ్ పాండుని అడిగాడు.

    “మన దగ్గరనుండి దీపని తీస్కెళ్ళిన మనిషి గజదొంగ మంగులట!” చెప్పాడు నీర్సంగా పాండు.

    అతని మొహం పాలిపోయి వుంది. “బాబోయ్.... ఎంత పొరపాటు జరిగిపోయింది....” అన్నాడు రాజు గుండెలమీద చెయ్యేసుకుంటూ.

    “అంటే మీకు వాడు గజదొంగ మంగులని తెలీదా....? ఒకవేళ నిజంగా తెలీకపోయినా అతనికీ మీకూ వున్న పరిచయం ఏంటీ? దీపని అతనికి ఎందుకిచ్చారు?” అనుమానంగా చూస్తూ అడిగాడు రాంబాబు.

    ఇంక లాభంలేదని రాంబాబు, చిన్నారావ్ లకి జరిగినదంతా చెప్పారు డిటెక్టివ్ పాండు, అసిస్టెంట్ రాజు.

    రాంబాబు, చిన్నారావ్ లు కూడా తాము ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 కాదనీ, తాము రాంబాబు, చిన్నారావ్ లని చెప్పి మంగులు అన్న గజదొంగ గంగులు ఎన్ కౌంటర్ లో మరణించినప్పటినుండీ ఆరోజు వరకు జరిగిందంతా అతనికి క్లుప్తంగా చెప్పారు.

    “దీనికి పరిష్కార మార్గం ఒక్కటే!” అన్నాడు డిటెక్టివ్ పాండు కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత.

    “ఏంటది?”

    “మీరు ఎలాగూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో వున్నారు కాబట్టి కమీషనర్ లింగారావ్ దగ్గరికి నిర్భయంగా వెళ్ళొచ్చు! మీకు మంగులు డెన్ ఎక్కడుందో కూడా తెల్సు కాబట్టి, కమీషనర్ కి ఆ విషయం చెప్పి మీరంతా ఫుల్ పోలీస్ ఫోర్సుతో మంగులుని ఎటాక్ చేసి దీపని రక్షించుకోవచ్చు" చెప్పాడు డిటెక్టివ్ పాండు.

    “ఏంటీ? నువ్వు చెపుతున్నది నిజమేనా అప్పారావ్?” ఆశ్చర్యంగా అడిగాడు కమీషనర్ లింగారావ్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో ఉన్న రాంబాబుని.

    'అవును సార్! నేనెంతో ఇన్వెస్టిగేట్ చేసి మంగులు చేసి డెన్ ఎక్కడుందో కనుక్కున్నా... దీప కూడా అక్కడ క్షేమంగా వుంది. కానీ మంగులుని ఎటాక్ చెయ్యడం నా ఒక్కడివల్లా కాదు. కాబట్టి మీ దగ్గరికి వచ్చా. మనం పుల్ పోలీస్ ఫోర్స్ తీస్కుని మంగులుని ఎటాక్ చెయ్యాలి.... “ అన్నాడు రాంబాబు.

    “నువ్వు చెప్పింది నిజమైతే నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తాను అప్పారావ్,

    “వద్దు సార్.. నాకే ప్రమోషనూ వద్దు!” అన్నాడు రాంబాబు.

    “కాదు... నీకు ప్రమోషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇది చాలా బిగ్ ఎచీవ్ మెంట్!” అన్నాడు కమీషనర్ లింగారావ్.

    “నా డ్యూటీ నేను చాశాను సార్....!అందుకని నాకే ప్రమోషన్ వద్దుసార్! ఇంకా చెప్పాలంటే మీరు నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తేనే నాకు చాలా ఆనందంగా వుంటుంది సార్!” అన్నాడు రాంబాబు.

    మనసులో మాత్రం 'ఒరేయ్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్... నీ పనిపడ్తాన్రా' అని అనుకుంటూ.

    “వద్దులే... నువ్విక మాట్లాడొద్దు. కేసుని చేదించడంకోసం బాగా ఇన్వెస్టిగేట్ చేసి నీ బుర్ర హీటేక్కిపోయినట్టుంది. ఏంటేంటో మాట్లాడ్తున్నావ్....” అన్నాడు కమీషనర్ లింగారావ్ కంగారుపడ్తూ.

    సార్... మనం ఇక మంగులు డెన్ కి వెళ్దామా?....” అన్నాడు రాంబాబు.

    “పద.... పద....” అన్నాడు కమీషనర్ లింగారావ్ హడావిడిగా.

  • Prev
  • Next