• Prev
  • Next
  • అందరూ దొంగలే - 89

    Listen Audio File :

    తిన్నగా వెళుతున్న వ్యాన్ ని వెనక్కి తిప్పాడు డిటెక్టివ్ పాండు.

    “అదేంటి సార్.. వ్యాన్ ని వెనక్కి తిప్పారు? మనం ఇప్పుడు కమీషనర్ ఇంటికి వెళ్ళడంలేదా?” అడిగాడు అసిస్టెంట్ రాజు.

    “లేదు!” చిరునవ్వుతో సమాధానం చెప్పాడు డిటెక్టివ్ పాండు,

    రాజు అర్ధంకానట్టు చూశాడు. “నా చిన్న బుర్రకి అర్ధం అయ్యేలా చెప్పండి సార్!” అన్నాడు రాజు.

    “దీపని మనం కమీషనర్ కి అప్పగిస్తే ఎంతిస్తాడు?... రెండు లక్షలు... అవునా?”

    “అవును సార్!”

    డిటెక్టివ్ పాండు చొక్కా జేబులోంచి ఓ న్యూస్ పేపర్ కటింగ్ తీసి రాజుకి ఇచ్చాడు. “అందులో దీపకి సంబంధించిన ఓ ప్రకటన వుంది... చదువు!” పట్టిస్తే పదిలక్షలు అనే హెడ్డింగ్ క్రింద వుంది ఆ ప్రకటన దీపని వెతికి పట్టుకుని క్షేమంగా అప్పగిస్తే పదిలక్షలు బహుమానం అని ప్రకటన సారాంశం. ఆ ప్రకటన ఇచ్చింది కమీషనర్ లింగారావ్.

    “అదేంటి? మరి మనకి రెండు లక్షలే ఇస్తానని అన్నాడు?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు.

    “తనే తెలివైనవాడినని అనుకుంటున్నాడు కమీషనర్. మనం అతనికంటే రెండాకులు ఎక్కువ చదివామని అతనికి తెలీదు" నవ్వుతూ అన్నాడు డిటెక్టివ్ పాండు.

    “మరి ఇప్పుడు ఏం చేస్తారు?”

    “మనం మరో మూడో వ్యక్తి ద్వారా దీపని కమీషనర్ కి అందజేస్తాం. అప్పుడు కమీషనర్ అతనికి 10 లక్షలు ఇస్తాడు. మన పని చేసి పెట్టినందుకు అంతో ఇంతో ముట్టజెప్పి ఆ పదిలక్షలూ మనం తీసుకుంటాం" అన్నాడు డిటెక్టివ్ పాండు.

    “బ్రిలియంట్ ఐడియా సార్!” అన్నాడు రాజు.

    “ఒరేయ్.. త్వరగా మీ ఇంటికి తీస్కెళ్ళండి. మీతో ఉయ్యాల ఆట ఆడాలి!” అంది దీప అసహనంగా.

    వ్యాన్ ఆ తారు రోడ్డుమీద రివ్వున పోతూ వుంది. “ఒరేయ్! నీ వ్యాన్ ని కాస్త ఇక్కడాపు!” అంది దీప ఓ కిరాణా షాప్ దగ్గర. డిటెక్టివ్ పాండు వ్యాన్ ని షాపుముందు ఆపాడు.

    “తప్పమ్మా! ఒరేయ్ అనకూడదు. ముద్దుగా అంకుల్ అనాలి. ఏదీ... అను" అన్నాడు పాండు.

    “ఒరేయ్ అంకుల్!” అంది దీప.

    రాజు కిసుక్కున నవ్వాడు.

    “ఒద్దులే పాపా! నీకు నన్ను పిలవాలని అన్పిస్తే నా భుజం మీద తట్టు నువ్వేమీ పిలవనక్కర్లేదులే!” అన్నాడు డిటెక్టివ్ పాండు.

    “సరేలే బే.... ముందు నీ సోదాపి నేను చెప్పింది విను! ఆ కిరాణా షాపులోంచి నాకు అరడజను బిస్కెట్ పాకెట్లు... పది పెద్ద పెద్ద చాక్లెట్లు, చిక్కీలు ఇరవై.... చిప్స్ పాకెట్స్ నాలుగు కావాలి... ఇంకా ఏమైనా గుర్తొస్తే దార్లో చెప్తా...” అంది దీప.

    “ఓహో.. అయితే దార్లో కూడా బోల్దనీ చెప్తావన్నమాట....?!” పళ్ళు కొరుకుతూ అన్నాడు డిటెక్టివ్ పాండు.

    “అవున్రా టొంగు టొస్కాయ్ …..” అంది దీప.

    పాండు ఉలిక్కిపడ్డాడు. రాజు కిసుక్కున నవ్వాడు.

    “ఓర్నాయనో... ఇది మనకి అర్ధంకాని భాషలో తిడ్తుంది. ఇది స్పృహలోవుంటే మన ప్రాణాలు తియ్యడమే కాదు, మన జేబులు కూడా గుల్ల చేసేలా వుంది. కాబట్టి దీనికి ట్రీట్ మెంటు ఇచ్చేయ్... మనం ప్రశాంతంగా వుండొచ్చు!” అన్నాడు డిటెక్టివ్ పాండు రాజుతో.

    రాజు జేబులోంచి క్లోరోఫాం అద్దిన రుమాలు తీసి దీప మొహం మీద పెట్టాడు. దీప స్పృహ తప్పింది.

  • Prev
  • Next