Home » » స్త్రీ భావప్రాప్తి పొందకపోవడం

స్త్రీ భావప్రాప్తి పొందకపోవడం

దాదాపు అన్ని సమాజాలలోను స్త్రీకి పురుషునితో సమానస్థానం గతంలో కల్పించబడలేదు. వారి చదువు విషయంలో, సమాజంలో వారిస్థానం విషయంలో, శృంగారంలో వారి పాత్ర విషయంలో వారికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. శృంగార విషయం మాట్లాడడం గానీ, ప్రత్యక్షంగా వ్యక్తం చెయ్యడం గానీ భర్తదగ్గర చేస్తే చెడిపోయినట్లవుతుంది అనే భావన సమాజం స్త్రీకి కల్పించింది. కేవలం పిల్లల్ని కనే సాధనంగానో, పురుషునికి సుఖాన్నిచ్చే సాధనంగానో స్త్రీ స్థానం పొందింది. శృంగారం గూర్చిన సరియైన సమాచారం స్త్రీకి అందించడం జరగట్లేదు. వాత్స్యాయనుడు తన కామసూత్రాల్ని ముఖ్యంగా స్త్రీలు చదవాలి అని చెప్పినా కామసూత్రాలు లేదా కామశాస్త్ర గ్రంధాలు భార్య చదవకూడదని చాలామంది భర్తలు అనుకుంటూ వుంటారు.

 

కామసూత్రాల్లాంటి గ్రంధాలు చదవాల్సిన అవసరంగానీ, భర్తతో శృంగారంలో ఉత్సాహంగా పాల్గోవాల్సిన అవసరం తమకు లేదని, రతి అన్నది పురుషునిచే చెయ్యబడే క్రియ అనే భావన కూడా చాలామంది స్త్రీలలో వుంటుంది. సామాజిక విలువలు, విధానాల ప్రభావం స్త్రీపై వుంటుంది. కొందరు స్త్రీలు స్వతంత్రంగా శృంగారానికి సంబంధించి ప్రతికూలధోరణి ఏర్పరచుకుంటారు. సామాజిక పరిస్థితుల వలన కలిగినా లేదా స్వతంత్రంగా తమ భావాల వలన కలిగినా ఈ ప్రతికూలధోరణుల ప్రభావం శృంగారంలో వారు ఏవిధమైన ఆనందం పొందక శృంగారంలో మాకేం అన్పించడం లేదు అంటారు. స్త్రీలో భావప్రాప్తి లోపించడానికి అనేక కారణాలుంటాయి. ఒకటికంటే ఎక్కువ కారణాలు భావప్రాప్తి పొందకపోవడాన్ని కలిగిస్తాయి. స్త్రీ ఏవిధంగానూ ఎప్పుడూ భావప్రాప్తి పొందకపోవడాన్ని ప్రాధమిక భావప్రాప్తి లోపం అంటారు. శృంగార వ్యతిరేక విశ్వాసాలు తీవ్రంగా వుండడం దీని ముఖ్యకారణాల్లో ఒకటి. కొందరు స్త్రీలు చిన్నప్పటినుంచీ శృంగారంపై ఒకవిధమైన వ్యతిరేకభావం, అసహ్యభావం కలిగి వుంటారు.

 

ఈ భావన శరీరంతోపాటు పెరిగి, శరీరంలో ఒకభాగమై, శరీరంపై తన ప్రభావం చూపుతుంది. పిల్లలు పుట్టలేదు అని ఒకామె నా దగ్గరకు వచ్చింది. అరగంట మాట్లాడాక అసలు విషయం చెప్పింది. పెళ్లి అయి 7 సంవత్సరాలైనా భార్యభర్తల తొలి కలయిక అవ్వలేదు. చిన్పప్పుడే తండ్రి పోవడంతో, తల్లేదైవంగా ఆమె భావించింది. చిన్నప్పటినుంచీ తల్లికూతురుకి సెక్స్ వ్యతిరేక భావనలను నూరిపోసింది. భర్తముట్టుకుంటే వంటిమీద తేళ్లు జెర్రెలు ప్రాకినట్టు ఆమె భావిస్తుంది. మిగతా విషయాల్లో భర్త అంటే ఇష్టమే. ఇప్పటికీ తల్లి కూతురుకి చెప్పేదొకటే మగవాడికి సుఖం ఇవ్వకూడదు అని. ఇలా వ్యతిరేక భావనలతో పెరిగినందు వలన ఆమెకు సెక్స్ అంటేనే అసహ్యం. ఇక సెక్స్ ఆనందం పొందే అవకాశం ఎక్కడ వుంటుంది? కొన్ని సందర్భాలలో స్త్రీకి ప్రవర్తన విషయంలో తనకు నచ్చిన భర్త లభించనప్పుడు శృంగారం విషయంలో వ్యతిరేక భావన ఏర్పడుతుంది. వివాహానికి ముందు అనేక సంవత్సరములు ఊహలతో తనకు కావలసిన భర్త గూర్చి ఎక్కువగా ఊహించిన స్త్రీకి అలాంటి వ్యక్తి దొరకనప్పుడు ఒక్కసారి వ్యతిరేక భావన కలుగుతుంది.

 

ఎంతో ప్రేమగా పెరిగిన స్త్రీకి తనకు నచ్చిన భర్త దొరికినప్పటికీ అతని ప్రవర్తన ప్రేమగా లేకుండా దూకుడుగా వున్నా ఆనందం అనుభవించలేదు. స్త్రీ ఊహాలోకం, స్వాప్నిక జగత్తులోనుండి వాస్తవికతకు వచ్చి ఏదో పొందలేక పోయామనే ధోరణి పూర్తిగా వదుల్చుకోవాలి. అలాగే దుడుకుగా ప్రవర్తించే భర్తలు తమ ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటే తప్ప స్త్రీ, తద్వారా పురుషుడు ఆనందాన్ని పొందలేరు. స్త్రీ భావప్రాప్తి పొందలేకపోవడంలో పురుషుని పాత్ర కూడా వుంటుంది. అంగప్రవేశం జరగగానే లేదా జరిగిన కొద్ది కదలికలకే పురుషుడు ఎప్పుడూ స్ఖలనం జరుపుతూ వుంటే ఆ స్త్రీ భావప్రాప్తి పొందలేదు. ఏళ్లు గడిచేకొద్దీ శృంగారం అంటేనే చిరాకు కలిగేదశను స్త్రీ పొందుతుంది. దీనివలన సమస్య మరింత జటిలమవుతుంది. పురుషునిలో అంగం స్తంభించకపోవడం సమస్య ఉన్నట్లయితే స్త్రీ అసలు సుఖం పొందలేదు. ఇలాంటి సందర్భాలలో వివాహానికి పూర్వం స్వయంతృప్తి అలవాటు వున్న స్త్రీలు వివాహం తర్వాత కూడా అవే మార్గాల ద్వారా స్వయంతృప్తి పొందుతారు. కానీ ఆ అలవాటు లేనివాళ్ళు వివాహం తరువాత ఆ మార్గాన్ని అవలంభించలేరు.

 

50 నుంచి 75 శాతం మంది స్త్రీలు కేవలం రతిద్వారా మాత్రమే తృప్తిని పొందరు. రతికి ముందు శరీరంలో వివిధ భాగాల్ని బాగా ప్రేరేపించడం అవసరం. ముఖ్యంగా చనుమొనలు, క్లిటోరిస్ వాంటి భాగాల్ని రతికి ముందు రతి తర్వాత, రతి సమయంలో ప్రేరేపిస్తేగానీ చాలామంది ఆడవారు తృప్తి పొందలేరు. భావప్రాప్తి పొందకపోవడం అనే సమస్య చాలామందిలో కొన్ని కొన్ని సందర్బాలలో మాత్రమే వుంటుంది. అంటే మిగతా సందర్బాలలో భావప్రాప్తి పొందడం వుంటుంది. కొందరు ఆడవారిలో భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు కారణంగా భావప్రాప్తి లోపిస్తుంది. రెండు విభిన్న రకాల కుటుంబాలనుంచి వచ్చిన స్త్రీ పురుషుల భావాలు కలవక, ఇద్దరి మధ్య సరియైన సమాచారం లేక ఏవైనా మానసిక ఘర్షణలు కలిగితే దాని ప్రభావం స్త్రీపై పడి ఆమె భావప్రాప్తి పొందకపోవచ్చు. ఇక్కడ కూడా భార్యభర్తల సహకారం వుంటేనే ఈ సమస్య తొలగుతుంది. కొందరిలో సహజంగా శృంగారానికి సంబంధించిన కోర్కెలు తక్కువగా వుంటాయి. భావప్రాప్తి పొందనంత మాత్రాన వీరిలో ఏవిధమైన విసుగు వుండదు.

 

ఈవిధంగా అనేక కారణాలుగా స్త్రీకి భావప్రాప్తి కలగకపోవడం సంభవిస్తుంది. స్త్రీ చిన్నప్పటినుంచీ పెద్దయ్యేదాకా జరిగిన అనేక సంఘటనలు, కొన్ని అపోహలు, కొన్ని విశ్వాసాలు, కొన్ని బాధాకర సంఘటనలు, వివాహం తర్వాత భర్తతో గల కొన్ని సమస్యలు, భర్త ప్రవర్తన నచ్చకపోవడం, భర్త ప్రవర్తనలో మార్పు, భర్తకు సరిగా స్త్రీని ప్రేరేపించడం తెలియకపోవడం, లేదా అతనికున్న సమస్యలు ఇలాంటివి ఎన్నో స్త్రీకి భావప్రాప్తి కలగకుండా చేస్తాయి. ఈ సమస్య పరిష్కారంలో భార్యభర్తల మధ్య సదవగాహన, సరియైన సమాచారం ముఖ్యమైనవి. భార్యభర్తలు పరస్పరం ఒకరి శరీరాన్ని ఒకరు సంపూర్ణంగా సాధ్యమైనంత ఎక్కువసేపు ఎదుటివారి ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తూ స్పృశించాలి. ఈవిధంగా కొద్దిరోజులు చేసిన తర్వాత భార్య శరీరంలో ఆమెకు ఎక్కడ ఏవిధంగా ముట్టుకుంటే ఉత్తేజం కలుగుతుందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత కొన్ని భంగిమలను ఆచరించాలి. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సమస్య తొలగుతుంది.

google-banner