ఫ్రిజిడిటీ స్త్రీలలో సెక్స్ కోర్కెలు తగ్గడం
స్త్రీల సమస్యలలో ముఖ్యమైనది ఫ్రిజిడిటీ. సెక్స్ కోరికలు తగ్గడం లేదా కలగకపోవడాన్ని ఫ్రిజిడిటీ అని పిలిచేవారు. శాస్త్రవేత్తలకు వాడడం ఇష్టం లేకపోయినా ఈ పదమే వాడుకలో వుంది. 1970 లలో మాస్టర్స్ అండ్ జాన్సన్ ల పుస్తకాలు వచ్చాక సెక్స థెరపిస్టుల దగ్గరకు ఎక్కువగా స్త్రీలలో భావప్రాప్తికి సంబంధించిన, పురుషులలో అంగస్తంభనానికి సంబంధించిన సమస్యలతో వచ్చే వారని తెలిపారు. ఇప్పుడు సుమారు సగంమంది సెక్స్ కోరికలకు సంబంధించిన సమస్యలతో వస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సెక్సాలజిస్టులు. డా. హెరాల్డ్ లీఫ్, డా. హెలెన్ కాప్లాన్ లు మొదటిసారిగా సెక్స్ కోరికలు తగ్గడం అనేది విడిగా సమస్యగా తెలిపారు. ఫ్రిజిడిటీ వున్న స్త్రీలలో సెక్స్ సంబంధించిన ఆలోచనలు, ఫీలింగ్స్ కలగవు. సెక్స్ అంటే అసహ్యం కూడా కలగవచ్చు. కొందరు కేవలం భర్తకోసం సంసారంలో పాల్గొంటారు.
కొందరు సెక్స్ అంటే భయపడి దాని జోలికి వెళ్లరు. ఇంకొందరు తగినంత ప్రేరేపణ వున్నా, ఉద్రేకం కలగకపోయినా, భర్త స్పర్శ, దగ్గరగా వుండడం లాంటి వాటిని మాత్రం ఇష్టపడతారు. ఫ్రిజిడిటీ అనేక రకాలుగా వుంటుంది. కొందరు ఎలాంటి సందర్భాలలోనూ, ఎవరితోనూ ఎలాంటి కామానందాన్నీ పొందనివారు. కొందరు కొద్దికాలం ప్రేరేపణ వున్నప్పుడు ఉద్రేకం పొంది వారు. కొందరు కొద్దికాలం ప్రేరేపణ వున్నప్పుడు ఉద్రేకం పొంది ఆ తరువాత అసలు ఎలాంటి సెక్స్ ఫీలింగ్స్ కలగనివారు. ఫ్రిజిడిటీ వున్నవాళ్లు కోరిక లేకపోయినా యాంత్రికంగా రతిలో పాల్గొంటారు. అందువలన వాళ్ళ భర్తలకు తొందరగా అయిపోయి వాళ్లకిష్టంలేని పని నుంచి విరమిస్తారు. ఇష్టంలేని పని మాటిమాటికీ చేస్తూ కేవలం శరీరం అప్పగించడం, ఆనందం లేకపోవడం వీటి ఫలితంగా స్త్రీలో ఒకవిధమైన అసంతృప్తి, విసుగు జనిస్తాయి. ఈ పరిస్థితిలో తనంటే తనకే అసహ్యం, డిప్రెషన్ లు కలుగుతాయి. ఇలాంటివాళ్ళు సెక్స్ ఇష్టం లేదని చెప్పకుండా అది వదిలించుకోవడానికి వంట్లో బాగుండలేదనో, అలిసిపోయామనో చెప్తారు. అనేక సంస్కృతులు ఇష్టం వున్నా లేకపోయినా భర్త తృప్తే భార్యకు ముఖ్యమైంది అని బోధిస్తాయి. భర్తల ప్రతిస్పందన కూడా అనేక రకాలుగా వుంటుంది. చాలామంది భార్య సమస్యని సానుభూతితో అర్దం చేసుకుంటారు. కొందరు మగవాళ్ళు భార్య భావాల్ని, సెక్స్ కోరికలు లేకపోవడాన్ని అర్దం చేసుకోలేక అది తన అసమర్దత అనో, భార్య తమని నిర్లక్ష్యం చేస్తోందనో భావిస్తూ భార్యపై వత్తిడి తెస్తారు. దానివలన పరిస్థితి మరింత క్లిష్టమౌతుంది.
ఫ్రిజిడిటీ, కారణాలు, చికిత్స
సెక్స్ కోరికలు తగ్గడానికి అనేక కారణాలుంటాయి. భార్యాభర్తల సంబంధాలలో తగవులు, కోపం, సెక్స్ పై తప్పుడు అవగాహన, శరీరం లేదా ఏదో ఒక అంగం బాగా లేదనే బాధ, ఆత్మన్యూనతాభావం, భార్యాభర్తల మధ్య నమ్మకం తక్కువగా వుండడం, ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గోవాలని పార్టనర్ నుంచి వత్తిడి, బోర్ కొట్టడం, అనేక సంవత్సరాల సంసారం తరువాత రోజువారీ సమస్యల్ని పరిష్కరించుకోలేకపోవడం, ఇలాంటి కారణాలేమైనా సెక్స్ కోరికల్ని తగ్గిస్తాయి. స్త్రీ కోపంగా, లేదా భయంగా లేదా ఇష్టం లేకుండా వున్నప్పుడు శృంగారంలో పాల్గొంటే జననావయవా లలో రక్తప్రసారం జరగక సరిగా పాల్గొనలేదు. శృంగార వ్యతిరేక భావాలు అనేక రకాలుగా వుంటాయి. ఏ రకమైన వ్యతిరేక భావమైనా తీవ్రంగా వుంటే సెక్స్ కి సిద్దం అవ్వకుండా చేస్తుంది.
మాస్టర్స్ అండ్ జాన్సన్ లు సెక్సువల్ రెస్పాన్స్ ఆందోళనని తగ్గించేదిగా చెప్పారు. కారణాలు చిన్నవైనా ఆందోళన కలిగిస్తాయి. మనసులో లోతుగా నాటుకుపోయిన భావాలు కూడా శృంగార సమయంలో ఆందోళనని కలిగిస్తాయి. ఈ సమస్య చికిత్సలో భార్యాభర్తల మధ్య శృంగార సంబంధమైన ఇష్టాఇష్టాల గూర్చి సంపూర్ణ సదవగాహన ముఖ్యమైంది. సెక్స్ థెరపీలో సెన్సేట్ ఫోకస్, జననాంగాల ప్రేరణ, డిమాండ్ లేని రతి ఈ మూడు అవసరం. మాస్టర్స్ అండ్ జాన్సన్ లు రూపొందించిన సెన్సేట్ ఫోకస్ ఎక్సర్ సైజులు ఫ్రిజిడిటీ చికిత్సలో ముఖ్యమైనవి. రతిలో పాల్గొనడం కొద్దిరోజులు మానివేసి ఒకరి శరీరాన్ని మరొకరు మృదువుగా స్పృశించాలి. భార్య భర్త శరీరాన్ని స్పృశించాక, భర్త భార్య శరీరాన్ని స్పృశించాలి. చూడ్డానికి తేలికగా కన్పించినా ఈ ఎక్సర్ సైజుల ప్రభావం చాలా బాగా వుంటుంది. కేవలం భర్తకు ఆనందాన్నివ్వడం, భావప్రాప్తి, పొందాలనే ఒత్తిడి. ఇవి తొలగి ఆనందదాయకమైన సెన్సేషన్స్ పొందడం మొదలవుతుంది. ఆ తరువాత జననాంగాల ప్రేరణ చెయ్యాలి.
భర్త భార్యచనుమొనల్ని, క్లిటోరిస్ భాగాన్ని, యోనిద్వారాన్ని మృదువుగా ముట్టుకోవాలి. ఈ స్పర్శ మృదువుగానే వుండాలి. అవసరం అయితే వేజలేన్ ఉపయోగించాలి. పై ఎక్సర్ సైజుల తరువాత రతి నిర్వహించాలి. అది కూడా స్త్రీ భావాలకు అనుగుణంగా భావప్రాప్తి పొందాలనే ఒత్తిడి వుండాలి. తగినంత ఉద్రేకం పొందాక స్త్రీ తనే రతిని మొదలు పెట్టాలి. కదలికలు మొదట నెమ్మదిగా వుండాలి. యోని దగ్గర వుండే ప్యూబో కాకిగ్జియల్ కండరాల్ని సంకోచింపచెయ్యడం కూడా చెయ్యవచ్చు. ఇలా నెమ్మదిగా చేసేటప్పుడు భర్త స్ఖలించాలని అనిపిస్తే ఇద్దరూ విడిపోవాలి. భర్త భార్యని చేతితో ప్రేరేపించాలి. ఆరాటం కలిగితే రతి మళ్లీ కొనసాగించాలి. ఇలా ఎక్కువసేపు మృదుస్పర్శతో బాగా ప్రేరేపిస్తూ మధ్యమధ్యలో ఆపుతూ రతి జరపడం వలన స్త్రీకి బాగా లాభం కలుగుతుంది. ఎంతసేపు ఎక్కడ, ఏవిధంగా ఎంతవేగంతో స్పర్శ వుండాలనేది నిర్ణయించేది స్త్రీయే. ఈవిధంగా ఓపికగా భార్యభర్తలు ఒకళ్ళనొకరు సహకరించుకుంటూ వుంటే ఫ్రిజిడిటీ సమస్య తీరుతుంది. ఈ ఎక్సర్ సైజుల నిర్వహణకు సెక్స్ థెరపిస్టు అవసరం.



