Home » » వివాహిత కన్యలు

వివాహిత కన్యలు

పెళ్ళి అయ్యాక, సంభోగానికి తగిన వయసు వచ్చినా తొలి సంభోగం కూడా కానివాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టమే. చాలామంది డాక్టర్ ని సంప్రదించరు. ప్రతిజంట ప్రపంచంలో తాము ఒక్కళ్ళమే అలా సెక్స్ (రతి) లేని కాపురం చేస్తున్నామని బాధపడుతూ ఉంటారు. కిన్సీ చూసినవారిలో 2 శాతం మంది దంపతులు తగిన వయసు వచ్చినా రతిలో పాల్గొనలేకపోయారు. అమెరికాలో జరిగిన ఇతర పరిశోధనలలో కనీసం 5 శాతం మంది దంపతులలో పిల్లలు పుట్టకపోవడానికి కారణం వాళ్ళు ఎప్పుడూ సెక్స్ లో పాల్గోకపోవడమే అని చూశారు. ఇదివరలో ఆడవారి లోపాలు, మగవారి లోపాలు ఈ విధంగా ఈ సమస్యను రెండుగా విభజించేవారు. కానీ చికిత్సలో ఇధ్దరినీ చికిత్సించడం ముఖ్యమైనది. మాస్టర్స్ & జాన్సన్ లు ఈ విధమైన చికిత్సా విధానానికి ప్రాచుర్యాన్ని ఇచ్చారు.

 

ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఈ విధమైన సమస్యలకు సంబంధం వున్న శాస్త్రవిభాగాన్ని హైమనాలజీ అంటారు (హైమస్ అంటే కన్నెపొర). ఈ సమస్యకు ముఖ్యకారణాలు - అంగస్తంభన సమస్యలు, వెజైనిస్మస్, రతిలో శూల, సెక్స్ కోరికలు లేకపోవడం, అంగస్తంభన సరిగా కలగకపోవడం, శీఘ్రస్ఖలనం - ఇవి సాధారణ కారణాలు. వీటిని ఓపికగా చికిత్సిస్తే ఫలితం బాగుంటుంది. మరికొందరిలో సెక్స్ కోరికలు బాగానే ఉంటాయి. అంగస్తంభన కలుగుతుంది. కానీ సిగ్గు, ఆందోళన, భయాల కారణంగా అంగప్రవేశం జరగదు. ఆడవారికి చెందిన కారణాల్లో వెజైనిస్మస్, రతిలో నొప్పి ముఖ్యమైనవి. రతిలో నొప్పి యోని బయట భాగాన్ని అయినా ఉండవచ్చు, లోపల అయినా ఉండవచ్చు. ఈ సమస్య శారీరక కారణాల వలన అయినా కలగవచ్చు. మానసిక కారణాల వలన అయినా కలగవచ్చు. మానసిక కారణాలలో మగవాళ్ళన్నా, సెక్స్ అన్నా అసహ్యం కారణంగా నొప్పి కలుగుతుంది. చాలామందిలో ఈ ద్వేషం చిన్నప్పటినుంచి ఉంటుంది. అదే వెజైనిస్మస్ ఉన్నవారిలో సెక్స్ చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. భర్త అంటే ఇష్టం ఉంటుంది. కానీ భయం వలన యోని కండరాలు బిగదీసుకుపోయి అంగప్రవేశం జరగదు. పొత్తికడుపు పై భాగం వరకు ఎంత ముట్టుకున్నా, ముద్దు పెట్టుకున్నా ఆనందంగానే ఉంటారు. చెయ్యి పొత్తికడుపు కింద భాగానికి చేరగానే బిగుసుకుపోతారు 'Above the belt, love, which is pure, but below the belt lust which is dirty' అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది.

 

ఇలాంటి స్త్రీలలో above the belt okey, but below the belt, no అనే attitude ఉంటుంది. వెజైనిస్మస్ అంటే యోని కండరాలు వాటంతట అవే బిగుసుకుని అంగప్రవేశం కష్టమవ్వడం. దీనిలో నొప్పి ఉండదు. సెక్స్ కోరికలు మామూలుగానే ఉంటాయి. కాని కొందరిలో వెజైనిస్మస్, రతిలో శూల (డిస్పరూనియా అంటారు దీన్ని) ఈ రెండూ కలిసి ఉంటాయి. ఎందుకంటే యోని కండరాలు వాటంతటవే బిగదీసుకున్నప్పుడు అంగప్రవేశానికి ప్రయత్నం చేసినప్పుడు యోని దగ్గర నొప్పి కలుగుతుంది. ఒక పరిశీలనలో వెజైనిస్మస్ ఉన్నవారిలో శారీరక కారణాలు 2 నుంచి 5 శాతం మందిలో మాత్రమే చూశారు. 1956లో వెజైనిస్మస్ చికిత్సలో సైకోథెరపీని అబ్రహం మొదలుపెట్టారు. 1958లో బాలిన్ స్త్రీ మానసిక భావాలను అర్థంచేసుకుంటూ, వాటికి ప్రాధాన్యత ఇస్తూ యోని దగ్గర రిలాగ్జేషన్ కూడా వాడారు. ఫ్రీడ్ మాన్ అనే శాస్త్రవేత్త 1962 లో వర్జిన్ వైవ్స్ (వివాహిత కన్యలు) అనే పుస్తకం వ్రాశారు. ఫ్రాన్స్ లో మెఖైల్ - వోల్బమ్ వెజైనిస్మస్ కలవారినే కాకుండా వారి భర్తలను కూడా పరిశీలించారు. చాలా సందర్భాలలో వారు సిగ్గు బిడియం కలవారై, చొచ్చుకుపోయే గుణం, దూసుకుపోయే గుణం తక్కువ ఉన్నవారై ఉంటారని వ్రాశాడు. వివాహమైనా తొలి రతి కూడా జరగకుండా కాపురం చేసే దంపతులలో ఈ సమస్యకు కారణాలు, భార్యాభర్తలిద్దరినీ చికిత్సించడం బాగా ముఖ్యమైనది. ఫ్రీడ్ మాన్, బాలన్ లు పరిశీలించిన వారిలో 25 శాతం మంది మాత్రమే ఇంటర్వ్యూ చేయబడ్డారు. సగంమందిలో అంగస్తంభన సమస్య కలిగినట్లు చూశారు (భార్యకు వెజైనిస్మన్ ఉన్నందున తాము అసమర్థులమనుకుని భయపడి నందువలన) భార్యకు చికిత్స చేశాక కూడా పదమూడు శాతం మంది భర్తలకు అంగస్తంభన సమస్య కలిగింది. అందుకే దంపతులిద్దరినీ కలిపి పరీక్ష చెయ్యాలి. చికిత్స చెయ్యాలి అనిచెప్పేది. మనదేశంలో చాలామంది దంపతులు సెక్స్ కౌన్సిలర్ దగ్గరకు కలిసి రావడానికి సిగ్గుపడతారు.

 

జెనీవాలో ఒక్కసారి కూడా సంభోగం జరగని 82 జంటలను చికిత్సించారు. వారిలో పదిహేను సంవత్సరాలు కలిసి కాపురంచేసి ఒక్కసారి కూడా సెక్స్ జరుపుకోనివారు కూడా వున్నారు. వీరిలో 2/3 వంతు మంది సెక్స్ సమస్య కొరకు, తక్కినవారు పిల్లలు లేరని సెక్సాలజీ యూనిట్ కి వచ్చారు. వీరిలో డెబ్బై అయిదు శాతం మందిలో భార్యాభర్తలిద్దరినీ కలిపి చికిత్సించాల్సిన అవసరం కలిగింది. వారిలో ఎనభై ఎనిమిది శాతం మందికి సమస్య తొలగింది. ఒకటినుంచి పదిసార్లు వైద్యశాలకి రావలసివచ్చింది. కామోద్రేకం కలిగిన స్త్రీ పురుషుల శరీరంలో జరిగే మార్పులు, సహజంగా ఏవేవి జరుగుతాయి. అన్నది వివరించడం చికిత్సలో ముఖ్యమైనది. ఫోర్ ప్లే, రతిభంగిమల గూర్చి వివరించడం కూడా చాలా ముఖ్యం. ఫ్రీడ్ మాన్ తన వర్జిన్ వైవ్స్ పుస్తకంలో వెజైనిస్మస్ చికిత్సలో స్త్రీని తనచేతితో యోనిని ప్రేరేపించమనాలని చెప్పాడు. దీనివలన జననావయవాలంటే వుండే సిగ్గు తొలగుతుంది. చిన్నప్పటినుంచి ఆ భాగాన్ని షేమ్, షేమ్ గా పిలిచి ఇది ముట్టుకోవడం మంచిది కాదని చెప్పినందువలన కొందరికి జననావయవాల్ని ముట్టుకోవడం అంటనే అసహ్యం కలుగుతుంది. అంతేకాదు చాలామంది ఆడవారు అక్కడ బాగా బిగుతుగా ఉంది అని భావిస్తారు.

 

యోని ప్రేరేపణ, వేలిద్వారా గానీ, జైలోకైన్ జెల్లీ పూసుకునిగానీ, వైబ్రేటర్ తోగానీ చెయ్యవచ్చు. ఆ తరువాత భర్త వేళ్ళతో యోని భాగాన్ని ప్రేరేపించాలి. ఇలా కొద్దిరోజులు ప్రేరేపణ అనంతరం ఉపరతి ద్వారా స్త్రీ పైన ఉండి అంగంతో యోనిని ప్రేరేపించుకుంటూ నొప్పి లేకపోతే అంగప్రవేశం జరపాలి. కొందరు ఆడవాళ్ళకు భర్త అంటే ఇష్టం ఉండదు. మరికొందరికి డెలివరీ అంటే భయం ఉంటుంది. ఇలాంటివారు మానసిక చికిత్సకు కలిస్తే మంచిది. వెజైనిస్మస్ ఉన్నవాళ్ళ భర్తలలో చాలా ఆందోళన ఉంటుంది. ఎందువల్ల అంగప్రవేశం జరగటం లేదో తెలియక అత్యంత ఆందోళనకు గురి అవుతారు. భార్యని చికిత్సించడంతో పాటు భర్త ఆందోళన కూడా పోగొట్టాలి. ముందు సెక్స్ సమస్యకు చికిత్స చెయ్యాలా? పిల్లలకోసం చికిత్స చెయ్యాలా అని అడిగినప్పుడు అనేకమంది ముందు పిల్లలు కావాలి అని అడిగారు. భర్త వీర్యపరీక్ష చేయించి అది సవ్యంగా వున్నవారి వీర్యాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే (IUI) ప్రక్రియ చేయించాను. అలా తల్లులయిన వారు అనేకమంది ఉన్నారు. అంటే తొలి సంభోగం కాకుండానే భర్త వీర్యంతో తల్లులయినవారు. పిల్లలు పుట్టాక చికిత్సకు వచ్చినవారు కొందరయితే, పిల్లలు కలిగినా సెక్స్ సమస్యలు పరిష్కరించుకోనివారు అనేకమంది ఉన్నారు. ఈవిధంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సహకరించుకుంటూ సెక్స్ థెరపిస్ట్ కి సహకరించితే సమస్య తొలగుతుంది. చాలామంది దంపతులు ఒకసారి థెరపిస్ట్ ని కలిసి ఆపై నిర్లక్ష్యం చేస్తారు. ఈవిధంగా చెయ్యడం మంచిదికాదు.

google-banner