నేనూ - వచన కవిత్వం - 4

Listen Audio File :

నేనూ - వచన కవిత్వం - 4

- మల్లిక్


నా మాట వింటూనే పిచ్చుమణి పగలబడి నవ్వాడు.

" భలే సందేహం వచ్చిందయ్యా నీకు దీని సిగతరగ మళ్ళీ పడిపోయింది" అని కుర్చీ క్రిందకి దూరి మళ్ళీతీసి

నాకు చూపించి " ఇది కట్టుడు పన్నయా బాబు కాస్త గట్టిగా నవితే  ఊడి పడిపోతుంది. ఇందాకటి నుండీ క్రింద

పడిపోతుంటే దీన్నే క్రిందనుండి తీసి పెట్టుకుంటున్నా "  అని ఆ కట్టుడు పన్నును యధాస్థానంలో పెట్టేసాడు.

" ఇంతకి వచన కవిత్వం ఎలా రాయాలో చెప్పాలంటావ్ ? " ముందు నీ మనసుకు తట్టిన భావం వచనలో

కాగితం మీద రాసేస్కో ఆ వచనలోని ఒక్కో వాక్యాన్ని ముక్కల క్రింద విరిచేసి ఒకదాని క్రింద ఒకటి పరిస్తే అదే 

వచన కవిత్వం.

" హబ్బా! చాల సులభంగా ఉందండీ" గుండెల మీద చేయివేసుకున్నాను.

" ఇప్పుడు నీకు తోచిన వాక్యం ఏదైనా చెప్పు"

నేను బుర్ర గోక్కున్నాను.

" ఒక  పువ్వు వికసించింది. దాని చుట్టూ తుమ్మెద తిరిగింది అన్నాడు రెండు క్షణాలు ఆలోచించి.

" శభాష్ ... చూశావా నీకు బుర్ర గోక్కుంటే అయిడియాలు వచ్చింది. అంటే నీకు బుర్ర గోక్కుంటే అయిడియాలు

వస్తాయన్నమాట. కాబట్టి నువ్వు కవిత రాసేటప్పుడు బుర్ర గోక్కుంటూ రాస్తుండు. ఆ మళ్ళీ ఆ! వాక్యం చెప్పు"

అన్నాడు పిచ్చుమణి .

" ఒక  పువ్వు వికసించింది. దాని చుట్టూ తుమ్మెద తిరిగింది "

" ఇప్పుడు  దీన్ని వచన కవిత్వంగా మార్చేస్తా చూడు" అని ప్రక్కనున్న దువ్వెన తీసి దాంతో వీపు గోక్కోవడం

మొదలు బెట్టాడు.

"  నీకు బుర్ర గోక్కుంటే ఆలోచనలు ఎలా వస్తాయో నాకు వీపు గోక్కుంటే అలా వస్తాయి" అని నవ్వాడు

పిచ్చుమణి. మళ్ళీ క్రిందపదిపోయిన కట్టుడు పన్ను తీసి పెట్టుకుని రెండు నిముషాలు ఆలోచించి, నాలుగు

నిముషాలు వీపు గోక్కుని

" ఇప్పుడు విను" అన్నాడు.

పిచ్చుమణి గొంతు సవరించుకుని  చదివాడు.

" ఒక పువ్వు వికసించింది
వికసించిందొక పువ్వు
దాని చుట్టూ గిర గిర
గిరగిర  తిరిగింది
ఒక తుమ్మెద
తిరిరి తిరిగి
పువ్వును
మరిగిందొక తుమ్మెద
ఒక పువ్వువికసించింది "

అంటూ చదవడం ఆపి నా వైపు చూసి కళ్ళు ఎగరేసాడు. " ఎలా ఉంది!"

" చాలా బావుందండీ " అన్నాను.

 "నేను మామూలుగా చదివేశానుగానీ ఇదే మీరైతే ఒక్కో వాక్యాన్నీ రెండేసి మార్లు చదవాలి గుర్తుంచుకో, కవి

సమ్మేళనల్లో ఒక పంక్తిని చదివిన తరువాత వెనక్కి తిరిగి బాగా పేరున్న పెద్ద కవి వైపు చూసి చిర్నవ్వు నవ్వాలి.

అతగాడు ఊరికే కూర్చుంటే బావుండదని తనూ చిరునవ్వు నవ్వి "బావుంది బావుంది" అంటాడు. ఒక్కడే

బావుందని మనమంతా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? అని అనుకుని స్టేజిమీద ఉన్న మిగతా కవులంతా

తలలు ఊగిస్తూ "బావుంది బావుంది" అంటారు నిన్ను చూసి అంతమంది కవులు బావుందని అంటుంటే దాంట్లో

ఏదో గొప్ప భావం ఉండకపోయి ఉంటుందా అని కవి సమ్మేళనానికొచ్చిన తలమాసిన వాడెవడో చప్పట్లు

కొడతాడు. మాకేనా తలమాయనిది అని కోపగించుకుని మిగతావాళ్లు చప్పట్లు కొడతారు. దాంతో హాలంతా

చప్పట్ల మోత.అప్పుడు ఆ పంక్తిని రిపీట్ చేసి ముందుకి వెళ్తావ్..."

    "బావుంది బావుంది" అని సంతోషంగా తల ఊపాను నేనూ.

    "తరువాత రెండో పంక్తిని చదివి మళ్ళీ వెనక్కి తిరిగి పెద్దకవిని చూసి చిర్నవ్వు నవ్వుతావ్... అంతే! మళ్ళీ

ఇందాక చెప్పినదంతా వరస తప్పకుండా జరుగుతుంది. ఆ కవి సమ్మేళనంలో చప్పట్లన్నీ నీకే... ప్రేక్షకుల

మార్కులన్నీ నీకే..."

    నేను సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాను.