నేనూ - వచన కవిత్వం - 5

నేనూ - వచన కవిత్వం - 5

- మల్లిక్

 

"నేను మామూలుగా చదివేశానుగానీ ఇదే మీరైతే ఒక్కో వాక్యాన్నీ రెండేసి మార్లు చదవాలి గుర్తుంచుకో, కవి సమ్మేళనల్లో ఒక పంక్తిని చదివిన తరువాత వెనక్కి తిరిగి బాగా పేరున్న పెద్ద కవి వైపు చూసి చిర్నవ్వు నవ్వాలి. అతగాడు ఊరికే కూర్చుంటే బావుండదని తనూ చిరునవ్వు నవ్వి "బావుంది బావుంది" అంటాడు. ఒక్కడే బావుందని మనమంతా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? అని అనుకుని స్టేజిమీద ఉన్న మిగతా కవులంతా తలలు ఊగిస్తూ "బావుంది బావుంది" అంటారు నిన్ను చూసి అంతమంది కవులు బావుందని అంటుంటే దాంట్లో ఏదో గొప్ప భావం ఉండకపోయి ఉంటుందా అని కవి సమ్మేళనానికొచ్చిన తలమాసిన వాడెవడో చప్పట్లు కొడతాడు. మాకేనా తలమాయనిది అని కోపగించుకుని మిగతావాళ్లు చప్పట్లు కొడతారు. దాంతో హాలంతా చప్పట్ల మోత.అప్పుడు ఆ పంక్తిని రిపీట్ చేసి ముందుకి వెళ్తావ్..."

    "బావుంది బావుంది" అని సంతోషంగా తల ఊపాను నేనూ.

    "తరువాత రెండో పంక్తిని చదివి మళ్ళీ వెనక్కి తిరిగి పెద్దకవిని చూసి చిర్నవ్వు నవ్వుతావ్... అంతే! మళ్ళీ ఇందాక చెప్పినదంతా వరస తప్పకుండా జరుగుతుంది. ఆ కవి సమ్మేళనంలో చప్పట్లన్నీ నీకే... ప్రేక్షకుల మార్కులన్నీ నీకే..."

    నేను సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాను.

    పిచ్చుమణి మళ్ళీ చెప్పడం మొదలుబెట్టాడు.

    "సీజన్ బట్టి కవిత్వం రాయాలి. ఉగాది వచ్చిందనుకో... వచ్చింది ఉగాది అంటూ రాసెయ్యాలి.. ఎండాకాలం వస్తే ఎండలు ఎండలు, మండే ఎండలు అంటూ రాసి పడెయ్యాలి. అంతేకాదు, ఎప్పుడూ ఇలాంటి కవిత్వమే రాస్తే నీకు సామాజిక స్పృహ లేదని అంటారు. అందుకే రిక్షావాడి మీద, గుడిసెల్లో ఉండేవాళ్ళమీద "ఓ పేదవాడా... నువ్వుండేది మురికివాడా" అంటూ కవిత్వం రాయ్. వీలున్నప్పుడల్లా చంపుతా, నరుకుతా అను"

    "అదేమిటండీ!" ఆశ్చర్యపోతూ అడిగాను.
 
"దాన్ని విప్లవ కవిత్వం అంటారు. ఇహపోతే మినీ కవితలు గురించి, మన రాజధాని గోడలమీద చూడు... ఎన్ని స్లోగాన్లో... ముందు అవి బాగా చదువు. అవన్నీ మినీ కవితలే..."