నేనూ - దొంగాడూ - 1

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

నేనూ - దొంగాడూ - 1

 

- మల్లిక్

 

మా ఆఫీసులో వచ్చేవారం డిపార్టుమెంటల్ పరీక్ష ఉంది. ఎక్కౌంటెన్సీ, జనరల్ ఇంగ్లీషు, ఆర్ధమేటిక్ లలో పరీక్ష పెడ్తారు. మొదటి రెండు పరీక్షల్లో ఫరవాలేదుగానీ, అర్థమేటిక్ లోనే నేను చాలా పూర్.
"ఎలా? ఎలా?''
ఏం చేయాలోతోచక బుర్ర గోడకేసి కొట్టుకున్నా.
హఠాత్తుగా ఎవరో నా కాలరు పట్టుకుని బర్రున వెనక్కి లాగేశారు.
వెనక్కి తిరిగి కోపంగా చూశాను.
మా ఇంటి యజమాని ఉన్నాడు."ఏమిటీ? ... ఏమిటిది అంటున్నా?' 'చెవులు గండ్లు పడేలా అరిచాడు ఆయన.
"నా బుర్రకాయ్! ... నా ఇష్టం'' అన్నాను నేను ఉక్రోషంగా.
"బుర్రకాయ్ నీదేకానీ ఈ ఇల్లు నాది. నువ్విలా నీ తలతో గోడలు బద్దలుకొడ్తే ఊరుకునేది లేదు. ఇంకోమారిలా చేస్తే ఇల్లు ఖాళీచేయిస్తాను'' అన్నాడు ముక్కు పొంగిస్తూ.
నా కోపం చప్పున చల్లారిపోయింది.
"క్షమించండి సార్ ... నాకు వచ్చే వారం డిపార్టుమెంటల్ ఎగ్జామ్స్ న్నాయ్. అందుకని ... హిహిహి'' చేతులు నలుపుకుంటూ అన్నాను.
"పరీక్షలుంటే చక్కగా చదువుకోవాలి గానీ, నిక్షేపంలాంటి గోడలు బద్దలు కొడ్తారటయ్యా ... ఆ!'' కళ్లెగరేశాడాయన.
"అబ్బే ... మీ దోగాలు బద్ధలుకొట్టే ఉద్దేశం నాకే కోశానా లేదండీ. మరేమోనండీ .. నేనేమోనండీ ... అర్థమెటిక్కులో చాలా పూరండి ... ఏం చేయాలో తెలీక గోడకేసి తలకొట్టుకున్నానండీ ... హిహిహి'' అన్నాను వినయంగా.
"నీ ఫ్రెండ్ చంచల్రావు మాథమాటిక్స్ స్టూడెంట్ కదయ్యా'' అన్నాడు.
"హుర్రే ... ఈ విషయం నాకు తట్టలేదే?'' అని నాలుక కరుచుకుని అమాంతము మా ఇంటి యజమానిని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాను.
ఆయన చొక్కా పైకెత్తి ముఖం మీద కప్పుకుని సిగ్గుపడ్డాడు.
నేను చంచల్రావు ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాను.
"ఓ ... దాందేముంది'' అన్నాడు.
"మీ ఇంట్లో జనంవుంటారు ... లాభం లేదు. నేను గదిలో ఒంటరిగా వుంటాను కాబట్టి నువ్వు నా గదికి వచ్చి నాకు లెక్కలు చెప్పు ... ఈ రాత్రికి నా గదిలో పడుకో'' అన్నాను.
చంచల్రావు దానికి సరేనన్నాడు. ఇద్దరం నా గదికి వెళ్ళాము.
నా గదిలో నేలమీద చాప పరుచుకుని ఇద్దరం దానిమీద కూర్చున్నాం. నేను అర్థమెటిక్ పుస్తకం, నోటు పుస్తకం తెచ్చి పెట్టాను.
"తలుపు ముందునుండి తాళంవేసి వస్తానుండు'' అంటూ లేచాను.
"ఎందుకూ? టి.వి.లో 'చిత్రవిహార్'లో మంచిపాట వచ్చినంత ఆశ్చర్యంగా చూశాడు చంచల్రావు నావైపు.
"ఎందుకేమిటి ... వెధవ డిస్ట్రబ్స్. ముందునుండి తాళంవేసి నేను వెనుకనుండి వస్తాను. అప్పుడెవరైనా వస్తే తాళం చూసి నేను గదిలో లేననుకొని వెళ్ళిపోతారు'' అన్నాను.
చంచల్రావు నా తెలివితేటలకి మూర్ఛపోయాడు.
నేను వాది ముఖంమీద నీళ్ళుచల్లి "మరేం బెంగాపెట్టుకోకు. నాకు అప్పుడప్పుడూ ఇలాంటి ఐడియాలు తడ్తుంటాయ్'' అని వాడికి నచ్చజెప్పి కూర్చోబెట్టి ముందువైపునుండి తాళం వేసి వెనక తలుపులేసుకుని గదిలోకొచ్చాను.
ఇంకేం ఉందీ ... చంచల్రావు మళ్ళీ మూర్ఛపోయి ఉన్నాడు.
మళ్ళీ వాడి ముఖాన నీళ్ళుచల్లి లేపి కూర్చోబెట్టాను.
"నీకిందాక చెప్పానా నాకప్పుడప్పుడూ బ్రిలియంట్ ఐడియాలు వస్తాయని ... నువ్విలా మాటిమాటికి మూర్ఛపొతే నాకు లెక్కలు చెప్పేదెప్పుడు'' అంటూ వాడిమీద కోపగించుకున్నాను.
"ఓకే  ... ఓకే ... ఇంట మూర్ఛపోనుగా'' అన్నాడు పిచ్చివాడిలా నావంక చూస్తూ.