TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 38
ముచ్చర్ల రజనీ శకుంతల
"చాలా రోజులుగా...నెలలుగా...సంవత్సరాలుగా"
"అంటే వెయిట్ ఏమైనా పెరిగానా? కలర్ లో డిఫరెన్స్ వచ్చిందా?"
భర్త వంక సీరియస్ గా చూసింది. "నేను అడిగేది మీ సెటప్ ల గురించి"
"సెటప్పా? నాకు ఇంగ్లీషులో షటప్ తప్ప సెటప్ అనే పదం గురించే తెలియదు."
"మాటలతో ఏమార్చకండి. మీరు చాలా మారిపోయారు" అంది ప్రియంవద.
"అబ్బ అర్థరాత్రి టైం చూసి కొడతావు..." అంటూ ప్రియంవదను దగ్గరకు తీసుకోబోయాడు.
ప్రియంవద దూరంగా జరిగింది.
"అదేమిటోయ్ అసలే డెడ్ బాడీని సైతం..."
"ఆపండి. ఈ నయగారాల డైలాగులు నా దగ్గర వద్దు. ఈ టేప్ ఇంత వరకూ ఎంతమంది దగ్గర వినిపించారేమిటి?"
"ప్రియా! ఏమిటిది చిన్నపిల్లలా"
"నేనూ అదే చెబుతున్నాను. మనకో పిల్లాడు వున్నాడు. వాడు పెద్దవుతున్నాడు. మీకిప్పుడు చిన్న బుద్ధిలేమిటి బుద్ధిలేకుండా..."
"ఏంటీ! ప్రాసలతో తిడుతున్నావా?" అంత కోపంలోనూ అతనికి నవ్వొచ్చింది.
ప్రియంవద మొహం తిప్పుకుంది.
"అబ్బ నువ్వు అలిగినా అందగానే వుంటావు. నాకు తెలిసి ద్వాపర యుగంలో సత్యభామ, తర్వాత కలియుగంలో నువ్వే..." అంటూ ప్రియంవదను దగ్గరకు లాక్కున్నాడు.
ప్రియంవద అతడి నుంచి దూరంగా జరిగింది. "ఈవేళ్టి నుంచి మనిద్దరి మధ్యా..."
"ఆ మనిద్దరి మధ్యా..."
ప్రియంవద దిండు తీసి మంచం మధ్యలో పెట్టి చెప్పింది "ఈ దిండు వుంటుంది"
"ఏంటి? లక్ష్మణరేఖలా దిండు రేఖనా?"
"ఓహో...రేఖ అనే అమ్మాయి గురించి కూడా తెలుసన్నమాట...అమ్మాయిల పేర్లు పలవరించనిదే మీకు తోచదు కదా"
"నీకివాళ ఏమైంది ప్రియా..."
"నాకేమీ కాలేదు, మీకే సెటప్పుల వైరస్ సోకింది" శ్రీకర్ తల పట్టుకున్నాడు.
"తల పట్టుకోవాల్సింది, గోడకేసి తల కొట్టుకోవాల్సింది నేను, మీరు కాదు" అంది ప్రియంవద.
"ఆపుతావా? నాన్ స్టాప్ గా మాటలతో కుళ్లబొడుస్తున్నావు. ఇప్పుడేమిటి చెప్పు..."
"చెప్పాల్సింది మీరు..మీరు చెప్పే వరకూ మంచం మధ్యలో దిండు వుంటుంది"
"ఏం చెప్పాలి?"
"మీకు అమ్మాయిలతో వున్న లింకు గురించి" "ఇదేమైనా ఐఎస్ఐ లింకా? స్టేట్ మెంట్ ఇవ్వడానికి. అయినా నన్ను నమ్మవేంటి? నేను ప్యూర్ వర్జిన్ ని" "అది అమ్మాయిలకు వర్తిస్తుంది. మీలాంటి మగ పురుషులకు కాదు"
"నేను శ్రీరామచంద్రుడ్నే"
"శ్రీరాముడు ఈ మా వింటే బాణాలతో మిమ్మల్ని కుళ్లబొడిచి చంపుతాడు. ఆయన పేరెందుకు వాడతారు"
"ఇప్పుడేం చేయమంటావు?"
"నిజాయితీగా ఒప్పుకోండి. మీరు ఒప్పుకునే వరకూ నా నిరసన, నిరాకరణ కొనసాగుతూనే వుంటుంది. గుడ్ నైట్..." అంది తల దగ్గర దిండు మధ్యలో పెట్టి అటు తిరిగి పడుకుంటూ ప్రియంవద.
"హు...బ్యాడ్ నైట్ నాకు" శ్రీకర్ ఇటు తిరిగి పడుకుంటూ అన్నాడు.
ఆ క్షణం తన జీవితం ఓ అనూహ్యమైన మలుపు తిరగడానికి కారణమవుతుందని అతనికి తెలియదు.
|