హలో... రాంగ్ నెంబర్.! - 78

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 78

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"స్టెలీనా..నాలాంటి వాళ్ళ పరిచయం, రైలు పరిచయం లాంటిదే. స్టేషన్ దిగేవరకే. నీతో చివరివరకూ ప్రయాణించగలిగే కో - ప్యాసింజర్ కావాలి...నా స్వార్ధంతో నిన్ను మభ్యపెడుతున్నానేమో అనిపిస్తోంది"

"ఏమిటి మీరు మాట్లాడుతోంది..." ఆమె గొంతులో వణుకు ప్రస్పుటమవుతోంది..."

"అవును స్టెలీనా...నువ్వు చాలా మంచి అమ్మాయివి. నాలా చెడ్డ మగబాయ్ వి కాదు" చిర్నవ్వుతో అన్నాడు శ్రీకర్.

"నేను మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసానా?" స్టెలీనా అడిగింది." నువ్వు నన్నేం హర్ట్ చేయలేదు. ఇంఫాక్ట్...నేనే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపించింది.స్టెలీనా...నువ్వు మంచి పార్ట్ నర్ ని

చూసుకో..అది నీ మాజీ భర్తా..మరొకరా? అన్నది నేను చెప్పలేను. ఈ సారి నీ మంచి ఫోన్ నీ 'వెడ్డింగ్ కాల్' అయివుండాలి."

"మీ...రు..."

"నేనే మాట్లాడుతున్నాను. బై స్టెలీనా..ఐ విష్ యు ఆల్ ద బెస్ట్" ఫోన్ కట్ చేసాడు.

'స్టెలీనా....అయామ్ సారీ..నేనన్న మాటలు కొద్ది గంటలు..కొద్ది రోజులు నిన్ను హట్ చేస్తాయి. ఆ తర్వాత నీ హార్ట్ లోకి ఓ మనిషి వచ్చి చేరితే అన్నీ సర్దుకుంటాయి. నా తాత్కాలిక అవసరాలకోసం, నీ

లైఫ్ ని డిస్టర్బ్ చేసే అధికారం నాకు లేదు. నేను నిన్ను హర్ట్ చేస్తే అయామ్ సారీ...' మనసులో అనుకున్నాడు శ్రీకర్.

అప్పడు అతనికి గుర్తొచ్చిన మరో అమ్మాయి జెన్నిఫర్.

*          *      *

ప్రియంవద ఎదురుగా కూర్చున్నాడు . జేమ్స్ బాండ్. "అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు?" మరోసారి అడిగాడు జేమ్స్ బాండ్.

"ఒక విధంగా ఇప్పుడు మనమే శ్రీకర్ గారిని రెచ్చగొట్టాలి" చెప్పింది ప్రియంవద.

"రెచ్చగొట్టడమా? అంటే..."

"శ్రీకర్ గారికి అమ్మాయిలంటే యిష్టం. కానీ, ఆయన పందెం వల్ల అతి కష్టమ్మీద సీరియస్ గా వుంటున్నారని నా ఫీలింగ్"

"అలా అని మనం ఏం చేయగలం?" ఒక్కక్షణం చెప్పడానికి సందేహించింది.

"చెప్పండి మేడమ్! పర్లేదు..లాయర్ల దగర, డాక్టర్ల దగ్గరే కాదు, డిటెక్టివ్ ల దగ్గరా ఏమీ దాచకూడదు" అన్నాడు జేమ్స్ బాండ్.

"అమ్మాయిలతో శ్రీకర్ ని టెంప్ట్ చేయించాలి"

నవ్వాడు జేమ్స్ బాండ్ ప్రియంవద మాటలకు. "నవ్వుతారేంటి?" అడిగింది ఉక్రోషంగా ప్రియంవద.

"బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో క్లబ్ డ్యాన్సర్లు హీరోలను రెచ్చగొట్టేవాళ్ళు. పూర్వం రోజుల్లో మునుల తపస్సును రంభ, ఊర్వశి, మేనకలు భంగం చేసే ప్రయత్నం చేసినట్టు"

ఆ మాటలకు ప్రియంవద కూడా నవ్వింది.