యముడి దెబ్బకు కోట్లు గోవిందా
on Nov 29, 2014
సీక్వెల్ సినిమాలు తెలుగులో ఆడవనేది ఓ భయంకరమైన సెంటిమెంట్. అది యమలీల 2తో మరోసారి రుజువైంది. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కథ. దానికి తోడు కృష్ణారెడ్డి ఫామ్ కోల్పోయి చాలాకాలం అయ్యింది. అవుట్ డేటెడ్ ఆలోచనలతో, ఓ పాత కథ పట్టుకొని ముందుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులూ షాక్ ఇచ్చారు. సతీష్ అనే ఓ బిజినెస్ మ్యాన్ ఈ సినిమాతో హీరో అయ్యాడు. అసలు ఆయన కోసమే ఈసినిమా తీశారు కృష్ణారెడ్డి. అందుకు రూ.25 కోట్లని పణంగా పెట్టారు. పారితోషికాలు రూపేణా ఈ సినిమాకి రూ.8 నుంచి 10 కోట్ల వరకూ ఖర్చయ్యాయట. మరో పది హేను మేకింగ్. అలా పాతిక లెక్క తేల్చారు. తీరా చూస్తే ఈ సినిమాకి ఓపెనింగ్స్ లేవు. ఎక్కడా 50 శాతం కూడా నిండలేదు. కొన్ని చోట్ల మొదట్రోజు నుంచే అద్దెలు ఎదురుకట్టే పరిస్థితి. దానికి తోడు శాటిలైట్ అవ్వలేదు. ఈసినిమాకి రెండు మూడు కోట్లొచ్చినా గొప్పే అంటున్నారంతా. అంటే అర్థం ఏమిటి?. ఈ యముడి దెబ్బకు కోట్లన్నీ గోవిందాయ నమహానే కదా? సతీష్ కు బెంగళూరులో వందల కోట్లున్నాయి. వాటితో పోలిస్తే ఈ పాతిక ఓ లెక్క కాదు. కానీ.. ఓ కొత్త హీరోతో సినిమా అంటే, అతని మార్కెట్ ఎంత? బడ్జెట్ ఎంత? ఎంతలో ఈ సినిమా తీస్తే నిర్మాత క్షేమంగా బయటపడతాడు అనైనా ఆలోచించాలి కదా..?? నిర్మాత దొరికాడు కదా, అని రుద్దేయడమే..??! అలా అయితే సతీష్ ధైర్యంగా మరో సినిమా తీయగలుగుతాడా..??
కృష్ణారెడ్డిది క్లీన్ సినిమాలు తీసే మనస్తత్వం. మరోసారి ఆయన క్లీన్ సినిమానే తీశారు. ఆ విషయంలో డౌటే లేదు. కానీ ఏమిటా అవుట్ డేటెడ్ ఆలోచనలు?? యమలీలలోని హిమక్రీముల ఎపిసోడ్, ఘటోద్కచుడులోని పాప సెంటిమెంట్, జగదేక వీరుడు అతిలోక సుందరిలోని మూలికల ఉదంతం, గబ్బర్ సింగ్ గ్యాంగ్... ఇలా పార్టులు పార్టులు కింద సినిమాల్ని ఎత్తేయడం ఏమిటి?? అసలు ఈ సినిమాకి యమలీల టైటిల్ పెట్టకపోయినా బాగుండేది అనేది చాలామంది అభిప్రాయం. సినిమా చూశాక అది మరింత బలపడింది. యమలీల ఓ ట్రెండ్ సెట్టర్. అది అంతటి ఘన విజయం ఎందుకు సాధించిందయ్యా అంటే... యముడి ఫార్ములాతోనే కాదు. ఆ సినిమాలో అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా కుదిరింది. తోట రాముడు, కోట శ్రీనివాసరావు.. ఇలా ఎన్నో పాత్రలు పండాయి. వినోదం విషయంలో తిరుగులేదు. ప్రతి పాటా సూపర్ హిట్టే. అసలు అలీ.. డాన్సులు చేయడం అందరినీ అబ్బురపరిచింది. అన్ని షాకులు ఈ సినిమాలో లేవు. నిర్మాత కమ్ హీరోకి మాత్రం... భారీ షాక్ ఇచ్చాడు కృష్ణారెడ్డి.
యమలీల తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా. చాలా తక్కువ రోజుల్లో నిర్మాణం పూర్తయ్యింది. మరి ఆ మ్యాజిక్ కృష్ణారెడ్డిలో ఎటు పోయింది. ఇప్పుడూ ఓ చిన్న హీరోని తీసుకొని, చిన్న బడ్జెట్‌లో ఎందుకు సినిమా తీయలేకపోయారు? అలా చేస్తే నిర్మాత సేఫ్ అవుదుడు కదా..? ఈ ఆలోచన ఆయనకు ఎందుకు రాలేకపోయింది? ఏదేమైనా.... అగ్ర దర్శకులు, పాతతరం మేటి మేకర్స్, భారీదనం పేరుతో డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెట్టేవాళ్లు, హీరో అయిపోదామన్న ఆశతో కెమెరాముందుకు వచ్చి కోట్లు వెదజల్లే వాళ్లు యమలీల 2 సినిమాకి ఓ పాఠంలా, గుణపాఠంలా భావించాలి. మరోసారి ఈ తప్పు పునారావృతం కాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే థియేటర్లకొచ్చే ప్రేక్షకుల సంగతి అటుంచండి. అసలు సినిమా తీసే నిర్మాతలే మాయమైపోతారు. తస్మాత్ జాగ్రత్త.